రెండు ఉదంతాల్లో రూ.73 లక్షల మోసం  

Cyber Crime: Unknown Cheats Rs 73 Lakh NRI With Woman Name In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరానికి చెందిన ట్రేడింగ్‌ చేసే వ్యక్తితో పాటు అమెరికాలో నివసిస్తున్న ఎన్‌ఆర్‌ఐ రూ.73 లక్షల మేర నష్టపోయారు. ఇన్వెస్టర్‌తో పాటు ఎన్‌ఆర్‌ఐ సోదరుడు సోమవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో వేర్వేరుగా ఫిర్యాదులు చేయడంతో రెండు కేసులు నమోదయ్యాయి. నగరానికి చెందిన ఓ మహిళ షేర్‌ మార్కెట్‌లో ట్రేడింగ్‌ చేస్తుంటారు. ఈమె వివరాలు తెలుసుకున్న సైబర్‌ నేరగాళ్లు కొన్నాళ్ల క్రితం ఫోన్‌ చేశారు. ఓ మహిళ మాట్లాడుతూ తాను ట్రేడింగ్‌ వ్యాపారం చేసే ఓ సంస్థ తరఫున మాట్లాడుతున్నానంటూ మాట్లాడింది. ఏ రంగాల్లో, ఎలా ట్రేడింగ్‌ చేస్తే భారీ లాభాలు వస్తాయో తమకు తెలుసంటూ నమ్మబలికింది. దీనికి రెండుమూడు ఉదాహరణలు చెప్పి మరీ పూర్తిగా బుట్టలో వేసుకుంది.

ఆపై ట్రేడింగ్‌లో అంటూ రూ.5 లక్షలను తమ ఖాతాల్లోకి ట్రాన్స్‌ఫర్‌ చేయించుకుంది. కొన్ని రోజుల పాటు అందులో, ఇందులో ట్రేడింగ్‌ చేస్తున్నామని, భారీ లాభాలు వచ్చాయంటూ మాటలు చెప్పింది. ఓ రోజు కాల్‌ చేసిన ఆ కీలేడీ’ తమ వద్ద ఉన్న ట్రేడింగ్‌ ఖాతాలో ఉన్న మొత్తం రూ. 4 కోట్లకు చేరిందని చెప్పింది. అది మీకు బదిలీ చేయాలంటే కంపెనీ నిబంధనల ప్రకారం ముందుగా తమకు రావాల్సిన బ్రోకరేజ్‌ చెల్లించాలని షరతు పెట్టింది. ఈ పేరుతో దాదాపు రూ. 60 లక్షలు బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేయించుకుని మోసం చేసింది. ఈ మేరకు సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. అమెరికాలో నివసిస్తున్న పాతబస్తీకి చెందిన ఓ మహిళ పేరుతో దుండగులు ఐదు క్రెడిట్‌ కార్డులు తీసుకున్నారు.

వీటి ద్వారా జరిపిన రూ.13 లక్షల లావాదేవీల బిల్లులు ఇక్కడుంటున్న ఆమె సోదరుడికి వచ్చా యి. పూర్వాపరాలు పరిశీలించిన ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ప్రవాస భారతీయురాలైన ఆ మహిళ సోదరుడు, కుమార్తె పాతబస్తీలో నివసిస్తున్నారు. కొన్నేళ్లగా అమెరికాలోనే ఉండిపోయిన ఆమె పేరుతో ఇక్కడి యాక్సస్, ఐసీఐసీఐ, స్టాండర్డ్‌ చార్టర్డ్‌ బ్యాంకుల నుంచి ఐదు క్రెడిట్‌ కార్డులు జారీ అయ్యాయి. ఈ కార్డులు, ఓటీపీలు పంపే కవర్లు నేరుగా నేరగాళ్లకే డెలివరీ అయ్యాయి. రూ.13 లక్షలకు సంబంధించిన బిల్లులు మాత్రం ఆమె సోదరుడి చిరునామాకి చేరాయి. దీంతో తన సోదరిని సంప్రదించిన ఆయన ఆమెకు ఎలాంటి సంబంధం లేదని తెలుసుకున్నారు. దీంతో సోమవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top