బొల్లినేని గాంధీపై క్రిమినల్‌ కేసు 

Crime News: Bollineni Srinivasa Gandhi Register Criminal Case - Sakshi

మరో నలుగురు జీఎస్టీ అధికారులపైనా నమోదు 

ఆరోపణలున్న వ్యక్తి భార్యతో అభ్యంతరకర ప్రవర్తన 

2019లో తనిఖీల సందర్భంలో జరిగిన ఉదంతం 

తాజాగా పంజగుట్ట ఠాణాలో కేసు నమోదు 

సాక్షి, హైదరాబాద్‌: ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)లో పనిచేసినప్పుడు తన అధికారాన్ని అడ్డంపెట్టుకుని, తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ మాజీ సీఎం ఎన్‌.చంద్రబాబు నాయుడు ఆదేశాలు, సూచనల మేరకు నడుచుకున్న బొల్లినేని శ్రీనివాసగాంధీపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే ఈయనపై సీబీఐ, ఈడీల్లో మూడు కేసులు ఉన్నాయి. తాజాగా గాంధీతోపాటు జీఎస్టీ ప్రిన్సిపల్‌ కమిషనర్‌ ఎం.శ్రీనివాస్, అదనపు కమిషనర్‌ ఆనంద్‌ కుమార్, డిప్యూటీ కమిషనర్‌ చిల్కల సుధారాణి, సూపరింటెండెంట్‌ ఇస్బెల్లా బ్రిట్టోలపై గత శుక్రవారం క్రిమినల్‌ కేసు నమోదైంది. వివరాలివీ.. 

►బంజారాహిల్స్‌ ప్రాంతానికి చెందిన జేఎస్‌ శ్రీధర్‌రెడ్డి హైదరాబాద్‌ స్టీల్స్‌ సంస్థను నిర్వహిస్తున్నారు. ఇందులో కొన్నాళ్లు ఆయన భార్య జె.రాఘవిరెడ్డి భాగస్వామిగా ఉన్నారు. తర్వాత తన భర్తకే ఆమె జీపీఏ ఇచ్చారు. అయితే 2019లో ఆ సంస్థపై జీఎస్టీ ఎగవేత ఆరోపణలు రావడంతో సంబంధిత అధికారులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో అదే ఏడాది ఫిబ్రవరి 27 సాయంత్రం 5.30 గంటలకు ఐదుగురు వ్యక్తులు శ్రీధర్‌రెడ్డి ఇంటికి వెళ్లి తాము జీఎస్టీ అధికారులమని, ఇంట్లో సోదాలు చేయాలని చెప్పారు. దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ఉత్తర్వులు చూపించలేదు. వీరంతా తీవ్ర అభ్యంతరకరంగా, ఇంట్లోని వారిని భయభ్రాంతులకు గురిచేస్తూ ప్రవర్తించారు. 

►తన భర్త విదేశాల్లో ఉన్నారని, తిరిగి వచ్చాక వివరణ ఇస్తారని రాఘవిరెడ్డి చెప్పినా వారు వినిపించుకోలేదు. సోదాల సమయంలో బాధితురాలి ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులూ ధ్వంసమయ్యాయి. జీఎస్టీ అధికారుల తీరుతో బాధితురాలి కుటుంబీకులు భయభ్రాంతులకు లోనయ్యారు.  

►కొన్ని గంటలపాటు జరిగిన సోదాల్లో శ్రీధర్‌రెడ్డికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో అధికారులు బాధితురాలిని బషీర్‌బాగ్‌లోని తమ కార్యాలయానికి తరలించి మరుసటి రోజు తెల్లవారుజామున 4 గంటల వరకు నిర్బంధించారు. అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో గాంధీతోపాటు సుధారాణి ఆ కార్యాలయానికి వచ్చారు. బాధితురాలిని బెదిరిస్తూ రూ.5 కోట్ల లంచం డిమాండ్‌ చేశారు.  

►ఆ మొత్తం లంచం తమ కోసమేకాదని, ప్రిన్సిపల్‌ కమిషనర్‌ ఎం.శ్రీనివాస్, అదనపు కమిషనర్‌ ఆనంద్‌ కుమార్‌లకూ వాటా ఇవ్వాల్సి ఉంటుందని గాంధీ ఆమెతో చెప్పారు. తాను 2009లోనే భర్త పేరుతో జీపీఏ ఇచ్చానని చెప్పినా వాళ్లు వినిపించుకోలేదు. అయినప్పటికీ తాము పట్టించుకోబోమంటూ వారిద్దరూ బాధితురాలిపై తీవ్ర, అసభ్య పదజాలం వాడారు. ఆమె చూపిస్తున్న జీపీఏ కాపీలను గాంధీ చింపి నేలపై పడేశారు. తెల్లవారుజాము 4 గంటల వరకు ఈ తతంగం నడిచింది.  

►అదేరోజు మధ్యాహ్నం మరోసారి కార్యాలయానికి రావాలంటూ రాఘవిరెడ్డిని బెదిరించి పంపారు. ఇస్బెల్లా బ్రిట్టో తన వాహనంలో ఆమెను ఇంటికి చేర్చారు. మధ్యాహ్నం మరోసారి ఆమెను బలవంతంగా జీఎస్టీ కార్యాలయానికి తరలించారు. అయితే ఆ సందర్భంలో ఆనంద్‌ కుమార్‌ అభ్యంతరంగా ప్రవర్తించారంటూ బాధితురాలు జాతీయ మహిళా కమిషన్‌ను ఆశ్రయించారు. కమిషన్‌ ఆదేశాల మేరకు గత శుక్రవారం ఐదుగురిపై ఐపీసీ 354, 341, 506 సెక్షన్ల కింద కేసు నమోదైంది.  

►గాంధీతోపాటు సుధారాణి 2021 ఫిబ్రవరి నుంచి సస్పెన్షన్‌లో ఉన్నారు.    

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top