‘పచ్చ’పేకలో ఖాకీ: ఎస్పీ జోక్యంతో బట్టబయలు 

Constable Gambling With TDP Leader In Tadipatri - Sakshi

టీడీపీ నేతతో కలిసి కానిస్టేబుల్‌ గ్యాంబ్లింగ్‌

విషయాన్ని బయటకి పొక్కకుండా తొక్కిపెట్టిన పోలీసులు

తాడిపత్రి రూరల్‌(అనంతపురం జిల్లా): తాడిపత్రి పోలీసులు మరో వివాదానికి తెరలేపారు. టీడీపీ నేతలతో కలిసి ఓ కానిస్టేబుల్‌ సాగిస్తున్న గ్యాంబ్లింగ్‌ దందాను దాచి ఉంచే ప్రయత్నం చేశారు. అంతటితో ఆగకుండా ‘మీ ఇష్టం.. ఏమన్నా రాసుకోండి’ అంటూ విలేకరులపైనే ఖాకీ నైజాన్ని ప్రదర్శించారు. ఫ్రెండ్లీ పోలీస్‌ అనే పదానికి అర్థం మార్చేసేలా సాక్షాత్తూ డీఎస్పీ ఎదుటే ఓ సీఐ చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారి తీశాయి.

ఏం జరిగింది? 
ఈ నెల 20న తాడిపత్రిలోని పుట్లూరు రోడ్డులో రైస్‌ మిల్లు వద్ద గ్యాంబ్లింగ్‌ నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఆ సమయంలో పట్టుబడిన వారిలో మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తనయుడు జేసీ పవన్‌కుమార్‌ రెడ్డి ప్రధాన అనుచరుడు శరత్‌కుమార్‌తో పాటు మరో పది మంది ఉన్నారు. వీరిలో తాడిపత్రి పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ వెంకటేష్‌ నాయుడు కూడా ఉండటం విశేషం.

అయితే తాడిపత్రి పోలీసులు ఈ విషయం బయటకు పొక్కకుండా తొక్కిపెట్టారు. నిందితులను అరెస్ట్‌ చేసిన రోజు పత్రికలకు విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లోనూ 11 మంది నిందితులను అదుపులోకి తీసుకుని రూ.50 వేలు స్వా«దీనం చేసుకున్నట్లుగా పేర్కొన్నా...పేర్లు మాత్రం వెల్లడించలేదు. కానీ విషయం తెలుసుకున్న ఎస్పీ సత్యయేసుబాబు కానిస్టేబుల్‌ వెంకటేష్‌ నాయుడిపై చర్యలు తీసుకున్నారు. వీఆర్‌కు పంపుతూ ఉత్తర్వులిచ్చారు.

మీ ఇష్టం ఏమన్నా అనుకోండి.. 
ఆదివారం తాడిపత్రి పోలీసులు తెలంగాణ మద్యం స్వాదీనం చేసుకోగా, డీఎస్పీ చైతన్య విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిందితుల వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా పేకాటలో దొరికిన కానిస్టేబుల్‌ అంశాన్ని విలేకరులు లేవనెత్తడంతో సీఐ ప్రసాదరావు జోక్యం చేసుకున్నారు. విషయాన్ని దాటవేసేందుకు విశ్వప్రయత్నం చేశారు. పట్టుబడిన వారిలో కానిస్టేబుల్‌ ఉన్నందునే పేర్లు బహిర్గతం చేయలేదా? అని విలేకరులు ప్రశ్నించగా... సీఐ సహనం కోల్పోయారు. అది ఒక చిన్న పెట్టీ కేసు అంటూ అసహనం వ్యక్తం చేశారు. దాని గురించి లోతుగా వెళ్లకండి. కాదంటే మీ ఇష్టం మీరు ఏమైనా అనుకోండని సమాధానమిచ్చారు.

చదవండి: టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌రెడ్డి అరెస్ట్‌
ఈ–పాస్‌ ఉంటేనే తెలంగాణలోకి అనుమతి     

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top