ఈ–పాస్‌ ఉంటేనే తెలంగాణలోకి అనుమతి

Strict restrictions by Telangana police At the borders - Sakshi

తెలంగాణ పోలీసుల కఠిన ఆంక్షలు

సరిహద్దుల్లో మళ్లీ ఆగిన వాహనాలు

అంబులెన్సులకే అనుమతి

సాక్షి, అమరావతి/గరికపాడు(జగ్గయ్యపేట)/దాచేపల్లి(గురజాల): కోవిడ్‌ ఉధృతి నేపథ్యంలో తెలంగాణ పోలీసులు ఆదివారం నుంచి ఆంక్షలను మరింత కఠినతరం చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌–తెలంగాణ సరిహద్దులోని చెక్‌పోస్టుల వద్ద పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. అంబులెన్సులు, అత్యవసర సర్వీసుల వాహనాలను మాత్రమే తెలంగాణలోకి అనుమతిస్తున్నారు. మిగిలినవారు తెలంగాణ పోలీసుల నుంచి ఈ పాస్‌ (అనుమతి) తీసుకోవాల్సిందేనని తేల్చిచెప్పారు. ఇకనుంచి తెలంగాణ ఈ పాస్‌లు ఉంటేనే తమ రాష్ట్రంలోకి అనుమతిస్తామని చెక్‌పోస్టుల వద్ద ఆ రాష్ట్ర పోలీసులు స్పష్టం చేస్తున్నారు. లాక్‌డౌన్‌ సడలింపు సమయంలోను పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికుల వాహనాలను తెలంగాణ పోలీసులు నిలిపేస్తున్నారు.

తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం చెక్‌పోస్టు వద్ద ఏపీ, ఇతర రాష్ట్రాల నుంచి వెళ్లే వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణలో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ఆంక్షలు సడలించినప్పటికీ ఆ సమయంలో వచ్చిన వాహనాలను ఎందుకు అనుమతించడంలేదంటూ పోలీసులతో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. తెలంగాణలో లాక్‌డౌన్‌ సడలింపు ఉందని పాస్‌లు లేకుండా భారీగా వెళ్లిన వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కృష్ణాజిల్లా సరిహద్దు గరికపాడు వద్ద జాతీయరహదారిపై చెక్‌పోస్టుల వద్ద భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. గుంటూరు జిల్లాలో సరిహద్దు పొందుగల చెక్‌పోస్టు వద్ద తెలంగాణ పోలీసులు లాఠీలకు పనిచెప్పారు.

గంటల తరబడి ఎదురుచూసినా తెలంగాణ పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో వాహనదారులు వెనుదిరిగారు. ఇటీవల మన రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు జరపడం, హైకోర్టు ఆదేశాలివ్వడంతో అప్పటినుంచి అంబులెన్సులను నిరంతరాయంగా తెలంగాణ పోలీసులు అనుమతిస్తున్నారు. ఉదయం 10 గంటల వరకు మాత్రమే గూడ్స్‌ (సరుకుల) వాహనాలకు అనుమతి ఇచ్చారు. తర్వాత సరుకుల వాహనాలను కూడా నిలిపేశారు. స్విగ్గీ, జొమాటో వంటి ఆన్‌లైన్‌ సరుకుల డెలివరీ సర్వీసుకు మాత్రం అనుమతి ఇచ్చారు. గరికపాడు చెక్‌పోస్టు వద్ద నందిగామ డీఎస్పీ నాగేశ్వరరెడ్డి, సీఐ చంద్రశేఖర్, ఎస్‌ఐ వెంకటేశ్వరరావు, పొందుగల చెక్‌పోస్ట్‌ వద్ద ఎస్‌ఐ బాలనాగిరెడ్డి పరిస్థితిని పరిశీలించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top