నారా వారి లిక్కరు స్కాం  | CID Petition In ACB Court On Chandrababu Naidu Liquor Scam - Sakshi
Sakshi News home page

నారా వారి లిక్కరు స్కాం 

Published Tue, Oct 31 2023 4:30 AM

CID petition in ACB court On Chandrababu Liquor Scam - Sakshi

సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిని కేసులు వెంటాడుతున్నాయి. తాజాగా ఆయనపై సీఐడీ మరో కేసు నమోదు చేసింది. గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న మద్యం కుంభకోణానికి సంబంధించి నమోదైన ఈ ఎఫ్‌ఐఆర్‌లో ఏ–3గా చంద్రబాబు పేరును చేర్చింది. ఈ మేరకు ఏసీబీ కోర్టులో పిటిషన్‌ను కూడా వేసింది. న్యాయస్థానం కూడా విచారణకు అనుమతించింది.

ఐపీసీ, ప్రివెన్షన్‌ ఆఫ్‌ కరెప్షన్‌ (పీసీ) యాక్ట్‌–1988ల ప్రకారం 166, 167, 409, 120 (బి), రెడ్‌విత్‌ 34, 13(1)(డి), రెడ్‌ విత్‌ 13(2) సెక్షన్లతో సీఐడీ ఆయనపై ఈ కేసు నమోదు చేసింది. ఇందులో ఏ–1గా అప్పటి ఎక్సైజ్‌ కమిషనర్‌ ఐఎస్‌ శ్రీనరేష్, ఏ–2గా నాటి ఎక్సైజ్‌ మంత్రి కొల్లు రవీంద్రపై కూడా ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. డిస్టిలరీస్, బేవరేజెస్‌ కమిషనర్, ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డి. వాసుదేవ రెడ్డి ఫిర్యాదు మేరకు వీరిపై కేసు నమోదైంది. 

అయినవారి కోసం అడ్డదారులు..: నంద్యాల మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డికి చెందిన ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌కి, మాజీమంత్రి అయ్యన్నపాత్రుడుకి చెందిన విశాఖ డిస్టిలరీకి, మాజీమంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడు పుట్టా సుధాకర్‌ యాదవ్‌కి చెందిన పీఎంకే డిస్టిలరీకి అప్పట్లో అడ్డగోలుగా మేలు చేకూర్చడానికి చంద్రబాబు ప్రభుత్వం అడ్డదారులు తొక్కింది. ఇందుకోసం ఏకంగా 2012 ఎక్సైజ్‌ పాలసీని మార్చేసింది. 2012 నుంచి 2015 వరకు ప్రభుత్వానికి రూ.2,984 కోట్లు పన్నులు రాగా, 2015లో కొత్త పాలసీ తీసుకువచ్చి ప్రభుత్వానికి ఈ పన్నులు రాకుండా చేసింది.

టర్నోవర్‌పై 8 శాతం వ్యాట్‌తో పాటు అదనంగా 6 శాతం పన్నులను తీసేసింది. 6 నుంచి 10 శాతానికి పన్నులు పెంచాలని త్రిసభ్య కమిటీ చేసిన సిఫార్సులనూ బేఖాతరు చేసింది. ఈ విధంగా రెండు బేవరేజ్‌లు, మూడు డిస్టిలరీలకు లబ్ధిచేకూర్చడానికి చంద్రబాబు ప్రభుత్వం క్విడ్‌ ప్రో కోకి పాల్పడినట్లు సీఐడీ  తన ఎఫ్‌ఐఆర్‌లో వెల్లడించింది. టీడీపీ ప్రభుత్వంలో జరిగిన ఈ కుంభకోణం ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా రూ.1,300 కోట్ల నష్టం వాటిల్లుతోందని కోర్టుకు వివరించింది.  

కొన్ని డిస్టిలరీలకు అనుకూలంగా నిర్ణయాలు.. 
నిజానికి.. ఎక్సైజ్‌ పాలసీ సమస్యలు, ఆదాయ వివరాలను ప్రభుత్వానికి సూచించడానికి గత ఫైళ్లను తిరగేయడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రాష్ట్రానికి ఆదాయాన్ని తగ్గించి, లైసెన్సులకు ప్రయోజనం చేకూర్చేలా క్రిడ్‌ ప్రో కో జరిగినట్లు అధికారులు గుర్తించారు. అంతటితో ఆగక.. అందుకు సంబంధించిన వాస్తవాలపై లోతుగా అధ్యయనం చేశారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా, ఎల్‌ఓఐ ఇవ్వడం ద్వారా కొన్ని డిస్టిలరీలకు అనుకూలంగా వ్యవహరించినట్లు గుర్తించారు.

డీటీ నోటిఫికేషన్‌ తర్వాత కొత్త బ్రాండ్లను అనుమతించారని అధికారులు తెలుసుకున్నారు. సరఫరాదారులు కుట్రపూరితంగా, లైసెన్స్‌లతో కుమ్మక్కై, కొన్ని ఉత్పత్తులకు మార్కెట్‌లో డిమాండ్‌ లేకపోయినా కృత్రిమంగా డిమాండ్‌ పెంచారు. తద్వారా కార్పొరేషన్‌కు తప్పుడు అంచనాలు ఇచ్చారు. అలాగే, 2015–2019 కాలానికి సంబంధించిన వాస్తవ డిమాండ్, సరఫరాల డేటా, పరిమాణాల వెరిఫికేషన్‌ కోసం ఎలాంటి యంత్రాంగం లేదు. 2019 ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిన తర్వాత కొన్ని కంపెనీలకు ప్రాధాన్యత ఇస్తూ, వారి ఉత్పత్తులకు, వారి మార్కెట్‌ వాటాకు అనుకూలంగా హడావిడిగా ఆర్డర్లు ఇచ్చేశారు.

అంతేకాక.. అవసరానికి మించి లిక్కర్‌ కంపెనీలకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులిచ్చి కొందరి నుంచే 70 శాతం బ్రాండ్లు కొనుగోలు చేశారు. పక్కా ప్లాన్‌తో, కొందరు అధికారుల సహకారంలో కొన్ని సంస్థలకు చట్టవిరుద్ధంగా ఆర్థిక ప్రయోజన చేకూర్చినట్లు స్పష్టమైంది. అకౌంటెంట్‌ జనరల్‌ (ఆడిట్‌) ఉల్లంఘన ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందనే విషయం తేటతెల్లమైంది. దీంతో తగిన ఆధారాలతో కేసు నమోదు చేసినట్లు సీఐడీ వివరించింది.  

కేబినెట్‌ ఆమోదం లేకుండా నచ్చినట్లు పాలసీ..: 2015–2017 ఎక్సైజ్‌ సంవత్సరాలకు సంబంధించి నిర్ణయం తీసుకోవడానికి ముందు, కొనుగోళ్ల వార్షిక లైసెన్సు రుసుం కంటే పది రెట్లు మించి ఉంటే మాత్రమే ప్రివిలేజ్‌ రుసుం విధించే థ్రెషోల్డ్‌ టెండర్‌ పరిమితిని పెంచాలని మొదట ప్రతిపాదించారు. కానీ, అది అమల్లోకి రాలేదు. తెలంగాణలో అమలులో ఉన్న ఈ ఫీజులు ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం తొలగించింది. షాపుల కోసం పాలసీని కూడా తమకు నచ్చినట్లు ఎటువంటి చర్చలు లేకుండా, ఆర్థిక చిక్కుల గురించి ఆలోచించకుండా కేబినెట్‌ ఆమోదం కూడా లేకుండా ఖరారు చేసేశారు.  

ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌కు అనుకూలంగా నిర్ణయాలు..
ఇక ఎస్పీవై రెడ్డికి చెందిన ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌కు చంద్రబాబు ప్రభుత్వం భారీగా లబ్ధిచేకూర్చింది. వాయిదా పద్ధతిలో లైసెన్స్‌ ఫీజు చెల్లించడానికి అనుమతించింది. ఈ ఫీజులో బకాయిలపై వడ్డీని కేవలం 18 శాతం (రూ.15 కోట్లు) మాత్రమే వసూలుచేయడానికి అనుమతించింది. హైకోర్టు తీర్పునకు విరుద్ధంగా, లైసెన్స్‌ ఫీజు బకాయిలపై అంతకుముందు కాలానికి చెల్లించాల్సిన వడ్డీని కూడా సడలించింది. నిజానికి ఇలా వడ్డీని వదిలేయడానికి, పరోక్షంగా మాఫీ చేయడానికి, తర్వాత చెల్లించేలా అనుమతించడానికి నిబంధనలు అంగీకరించవు. 

డిస్టిలరీ మంజూరుకు అనుమతి..
ఇక 2014 నవంబర్‌లో జీఓ నెంబర్‌ 993 ప్రకారం.. రెవెన్యూ (ఎక్సైజ్‌–2) డిపార్ట్‌మెంట్‌ ఏర్పాటుచేసిన కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా, కమిటీ సూచించిన వాటి కంటే ఎక్కువ డిస్టిలరీల స్థాపనకు టీడీపీ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. పీఎంకే డిస్టిలరీస్, విశాఖ డిస్టిలరీస్, మరో మూడు ప్రైవేటు డిస్టిలరీస్‌కు ఆర్థిక ప్రయోజనం చేకూర్చడానికే ఈ నిర్ణయం తీసుకుంది.  

కొంతమంది సరఫరాదారులు..డిస్టిలరీలపై ప్రేమ..
కుట్రలో భాగంగా కొంతమంది సరఫరాదారులు, డిస్టిలరీలపై టీడీపీ ప్రభుత్వం అప్పట్లో అమితమైన ప్రేమ కనబర్చింది. వారితో కుమ్మక్కై కొన్ని ఉత్పత్తులకు కృత్రిమ డిమాండ్‌ను సృష్టించింది. వాటికి మార్కెట్‌ డిమాండ్‌ లేకపోయినా ఉన్నట్లుగా చూపించింది. వాస్తవ డిమాండ్, సరఫరాల డేటా ధ్రువీకరణకు ఎలాంటి యంత్రాంగం కూడా లేదు. దీనివల్ల 2015–2019 మధ్య ఇలా నాలుగైదు కంపెనీలకు భారీగా లబ్ధి చేకూరింది. వీరి నుంచే 70 శాతం కొనుగోళ్లు జరిగాయి. 

బ్రాండ్లకు అడ్డగోలు అనుమతులు..
మరోవైపు.. 2019లో సాధారణ ఎన్నికల నోటిఫికేషన్‌ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా, ఎలాంటి ప్రజా ప్రయోజనం లేకపోయినా సరే అనేక బ్రాండ్లకు ఆమోదం తెలిపి తద్వారా వాటి సరఫరాదారులకు ఎక్కడలేని ప్రయోజనం చేకూర్చింది. వ్యక్తులు, సంస్థలకు ప్రయోజనాలను అందించడంవల్ల రాష్ట్ర ఖజానాకు పెద్దఎత్తున నష్టం వాటిల్లింది. 

లోతుగా విచారణ జరపాలి : సీఐడీ 
ఈ నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నష్టం, లైసెన్సీలకు చట్టవిరుద్ధంగా ఆర్ధిక లాభం చేకూర్చడంపై విచారణ జరగాల్సి ఉందని సీఐడీ ఏసీబీ కోర్టుకు తెలిపింది. ఈ మేరకు ఎఫ్‌ఐఆర్‌ కాపీని న్యాయస్థానానికి సమర్పించింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ కుంభకోణంపై లోతుగా విచారణ జరపాలని, బాధ్యులైన వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని
సీఐడీ కోరింది.   

Advertisement

తప్పక చదవండి

Advertisement