అది ‘ఐ–టీడీపీ’ పనే  CID Case On TDP Social Media For Morphing videos | Sakshi
Sakshi News home page

అది ‘ఐ–టీడీపీ’ పనే 

Published Wed, Sep 7 2022 6:09 AM

CID Case On TDP Social Media For Morphing videos - Sakshi

సాక్షి, అమరావతి: ప్రతిపక్ష టీడీపీ సోషల్‌ మీడియా విభాగం ‘ఐ–టీడీపీ’పై ఏపీ సీఐడీ విభాగం కేసు నమోదు చేసింది. మార్ఫింగ్‌ వీడియోల ద్వారా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ ప్రతిష్టకు భంగం కలిగించిందన్న ఫిర్యాదుపై టీడీపీ సోషల్‌ మీడియా విభాగంపై కేసు నమోదు చేశారు. కుట్రపూరితంగా వ్యవహరించడం, దుష్ప్రచారానికి ఒడిగట్టి గౌరవానికి భంగం కలిగించడం, ఫోర్జరీకి పాల్పడిన అభియోగాలపై ఐటీ, ఐపీసీలోని ఫోర్జరీ చట్టాల కింద కేసు నమోదు చేసినట్టు మంగళవారం ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

ఈ మేరకు ‘ఐ–టీడీపీ’, మరికొందరిపై ఐటీ(66టి), ఐపీసీ 465, 469, 471, 153(ఎ), 505(2), 120(బి) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎంపీ గోరంట్ల మాధవ్‌ పేరుతో ఇటీవల ఓ ఫేక్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన విషయం తెలిసిందే. దీనిపై ఎంపీ మాధవ్‌ పోలీసులు, సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. మార్ఫింగ్‌ వీడియోను వైరల్‌ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దాంతో అనంతపురం పోలీసులు విచారించగా, అది ఫేక్‌ వీడియో అని నిర్ధారణ అయ్యింది. ఆ మార్ఫింగ్‌ వీడియోను ఐ–టీడీపీ సోషల్‌ మీడియా గ్రూప్‌ తొలుత సోషల్‌ మీడియా ద్వారా వైరల్‌ చేసినట్టు కూడా వెలుగు చూసింది. 

అది ఒరిజినల్‌ కానేకాదు.. 
ఆ వీడియో అసలైనదేనని అమెరికాకు చెందిన ‘ఎక్లిప్స్‌ ఫోరెన్సిక్‌ ల్యాబొరేటరీ’ నిర్ధారించినట్టుగా టీడీపీ నేతలు విలేకరుల సమావేశంలో చెప్పారు. ఆ మేరకు ఎక్లిప్స్‌ ల్యాబరేటరీ జారీ చేసినట్టుగా ఓ సర్టిఫికెట్‌ను కూడా విడుదల చేశారు. కాగా, ఫోరెన్సిక్‌ సర్టిఫికెట్‌ అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వం సీడీఐ విభాగాన్ని ఆదేశించింది. దాంతో సీఐడీ అధికారులు అమెరికాలోని ఎక్లిప్స్‌ ఫోరెన్సిక్‌ ల్యాబొరేటరీని సంప్రదించగా అసలు విషయం వెలుగు చూసింది.

ఆ వీడియో అసలైందేనని తాము ఎలాంటి సర్టిఫికెట్‌ జారీ చేయలేదని ఆ ల్యాబొరేటరీ స్పష్టం చేసింది. ఓ సెల్‌ఫోన్‌లో ప్లే చేస్తున్న వీడియోను మరో సెల్‌ ఫోన్‌ ద్వారా రికార్డు చేసిన క్లిప్‌ను మాత్రమే ప్రసాద్‌ పోతిని అనే వ్యక్తి తమకు పంపినట్టుగా తెలిపింది. వీడియో కాల్‌ మాట్లాడుతుండగా మొదట రికార్డు చేసిన వీడియో క్లిప్‌ను పంపిస్తే ఆ వీడియోను మార్ఫింగ్‌ చేశారో లేదో నిర్ధారించగలం తప్ప.. ఇలా ఒక క్లిప్‌ను మూడో వ్యక్తి సెల్‌ఫోన్‌ నుంచి రికార్డు చేసిన వీడియోను పరిశీలించి నిర్ధారించలేమని కూడా సీఐడీ విభాగానికి పంపిన ఈ మెయిల్‌లో స్పష్టం చేసింది.

దాంతో ఎంపీ మాధవ్‌ పేరుతో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన వీడియో మార్ఫింగేనన్నది స్పష్టమైంది. వాస్తవానికి ఓ ల్యాబరేటరీ ఇచ్చిన సర్టిఫికెట్‌ను యథాతథంగా విడుదల చేయాలి. సర్టిఫికెట్‌లో మార్పులు చేయడం అన్నది చట్ట వ్యతిరేకం. కానీ టీడీపీ నేతలు ఎక్లిప్స్‌ ల్యాబొరేటరీ సర్టిఫికెట్‌ను ట్యాంపర్‌ చేసి మీడియాకు విడుదల చేయడం గమనార్హం. దీనిపై ఎంపీ మాధవ్‌ ఫిర్యాదుతో సీఐడీ అధికారులు దర్యాప్తు చేపట్టారు.     

Advertisement
 
Advertisement
 
Advertisement