Chintakayala Ayyanna Patrudu Did Crop Canal Kabja - Sakshi
Sakshi News home page

పంట కాలువను కబ్జా చేసిన అయ్యన్న

Published Mon, Jun 20 2022 4:07 AM

Chintakayala ayyanna patrudu did Crop canal Kabja - Sakshi

నర్సీపట్నం (అనకాపల్లి జిల్లా): టీడీపీ మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పంట కాలువను అడ్డగోలుగా కబ్జాచేశారు. అంతటితో ఆగకుండా ఆ స్థలంలో ఆయన ఇల్లు నిర్మించుకుని తన ఆగడాలకు అంతేలేదని చాటిచెప్పారు. జిల్లాలోని రావణాపల్లి రిజర్వాయర్‌ బ్రాంచ్‌ అయిన నీలంపేట చానల్‌కు నర్సీపట్నం పరిధిలోని శివపురం వద్ద నీటిపారుదల శాఖ గోడ నిర్మించింది. దానిపైనే అయ్యన్నపాత్రుడు యథేచ్ఛగా ఇంటికి బేస్‌మెంట్‌ నిర్మించారు. ఈ చానల్‌ ఒడ్డున నదిలో 10 అడుగుల వరకు (సర్వే నెంబరు 276లో 2 సెంట్ల మేర) ఆయన ఆక్రమించారని ఇరిగేషన్‌ శాఖతోపాటు రెవెన్యూ శాఖ తేల్చింది. కాలువ కుచించుకుపోయి నీరు ఎక్కువగా వచ్చినప్పుడు సమీపంలోని పొలాలు ముంపునకు గురవుతాయి. 

ఈనెల 2న నోటీసులు జారీ
అక్రమ నిర్మాణం తొలగించాలని ఈనెల 2న అధికారులు అయ్యన్నకు నోటీసులు జారీచేశారు. అయినా.. ఆయన స్పందించకపోవడంతో ఆర్డీఓ గోవిందరావు, ఏఎస్పీ విజయ మణికంఠ చందోలు, మున్సిపల్‌ కమిషనర్‌ కనకారావు, తహసీల్దార్‌ కె. జయ రెవెన్యూ, పోలీసు యంత్రాంగంతో ఆదివారం వేకువజామున జేసీబీలతో అయ్యన్న నివాసానికి చేరుకున్నారు. గోడను పాక్షికంగా కూల్చివేశారు. ఇది జరుగుతుండగా అయ్యన్న సతీమణి పద్మావతి, తనయుడు రాజేష్‌ వారిపై దౌర్జన్యంచేస్తూ అడ్డుకున్నారు. రాజేష్, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. సమాచారం అందుకున్న టీడీపీ కార్యకర్తలు అయ్యన్న నివాసానికి చేరుకుని కూల్చివేతలను అడ్డుకుంటూ తిరగబడ్డారు. టీడీపీ కార్యకర్తల రాకతో పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉండడంతో పోలీసులు భారీగా మోహరించారు. 
పోలీసులను బెదిరిస్తున్న అయ్యన్న కుమారుడు రాజేష్‌ 

అయ్యన్న తనయుడి అభ్యర్థన మన్నించినా.. 
ప్రభుత్వ సర్వేయర్‌తో సర్వే చేయించాలని, ఆక్రమణ జరిగినట్లు అందులో రుజువైతే తామే తొలగిస్తామని అయ్యన్న తనయుడు రాజేష్‌ ఆర్డీఓను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆయన అభ్యర్థన మేరకు ఆర్డీఓ అప్పటికప్పుడు సర్వేకు ఏర్పాట్లు చేశారు. కానీ, సర్వే చేయమని కోరిన టీడీపీ నేతలే మళ్లీ సర్వేను అడ్డుకున్నారు. అంతటితో ఆగకుండా సిబ్బంది నుంచి బలవంతంగా చెయిన్లు లాక్కుని, రెవెన్యూ రికార్డులు ఎత్తుకుపోయారు. ఈ తతంగాన్ని సెల్‌ఫోన్‌లో రికార్డు చేస్తున్న ఇంటెలిజెన్స్‌ కానిస్టేబుల్‌పై కొంతమంది టీడీపీ కార్యకర్తలు చేయిచేసుకుని సెల్‌ఫోన్‌ లాక్కున్నారు.

ఈ దశలో పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. అయ్యన్న నివాసంలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు గండి బాబ్జీ, వంగలపూడి అనిత, కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు, అయ్యన్న మరో కుమారుడు చింతకాయల విజయ్‌ బరితెగించి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు వ్యాన్‌ తీసుకొచ్చి అయ్యన్న ఇంటి ముందుపెట్టారు. కానీ.. సర్వేను అడ్డుకుని కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్న టీడీపీ కార్యకర్తలను తరలిస్తారని భావించిన ఆ పార్టీ నేతలు రోడ్డుపై ఉన్న కార్యకర్తలను లోపలకు తీసుకుపోయి గేట్లు మూసేశారు. అయితే, టౌన్‌ సీఐ మోహన్‌రావు టీడీపీ నేతల వద్దకు వెళ్లి రెవెన్యూ రికార్డులు తిరిగి ఇవ్వాలని కోరడంతో రికార్డులు ఇచ్చేశారు.

అనంతరం మళ్లీ సర్వే ప్రారంభించగా టీడీపీ నేతలు దౌర్జన్యం చేస్తూ అడ్డుకున్నారు. రాత్రి పొద్దుపోయే సమయానికి కూడా టీడీపీ కార్యకర్తలు, పోలీసులు అయ్యన్న ఇంటి వద్దే మోహరించి ఉండడంతో ఉద్రిక్తత కొనసాగుతోంది. తమ నిర్మాణాలు తొలగించకుండా ఉత్తర్వులివ్వాలని అయ్యన్నపాత్రుడు కుటుంబ సభ్యులు హైకోర్టులో హౌస్‌మోషన్‌ పిటిషన్‌ వేసినట్లు సమాచారం.

కాలువను కబ్జాచేసి కట్టేశారు
ఇక మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు రావణాపల్లి రిజర్వాయర్‌ బ్రాంచ్‌ నీలంపేట చానల్‌ను ఆక్రమించి అక్రమ నిర్మాణం చేపట్టారని నీటిపారుదల శాఖ అధికారులు స్పష్టంచేశారు. కాలువను 10 అడుగుల మేర ఆక్రమించారని.. ఇంటి ప్రహరీ గోడతోపాటు వంట షెడ్డు నిర్మించారని వారు తెలిపారు.  

Advertisement
 
Advertisement
 
Advertisement