అఖిలప్రియను అరెస్టు చేయకుంటే అనర్థాలెన్నో!

Bowenpally Kidnap Case Bhuma Akhila Priya Remand Report Key Points - Sakshi

ఆమె భర్త భార్గవ్‌రామ్‌కూ నేరచరిత్ర

పారిపోయిన నిందితుల కోసం గాలింపు: పోలీసులు

సాక్షి, హైదరాబాద్‌: ఏపీ మాజీ మంత్రి, టీడీపీ ప్రధాన కార్యదర్శి భూమా అఖిలప్రియ రిమాండ్‌ రిపోర్టులో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న అఖిలప్రియను అరెస్టు చేయకపోతే అనేక అనర్థాలు చోటు చేసుకుంటాయని హైదరాబాద్‌ పోలీసులు పేర్కొంటున్నారు. ఇదే విషయాన్ని న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో పొందుపరిచారు. హఫీజ్‌పేటలో ప్రవీణ్‌రావు 2016లో ఖరీదు చేసిన 25 ఎకరాల భూమికి సంబంధించిన వివాదాన్ని అఖిలప్రియ తండ్రి భూమా నాగిరెడ్డి తదితరులు పరిష్కరించారు. అప్పట్లోనే ఒప్పందం ప్రకారం నిర్ణీత మొత్తాన్ని ప్రవీణ్‌రావు చెల్లించారు. ఇటీవల ఆ భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో తమకు అప్పట్లో ఇచ్చిన మొత్తం చాలదని, భారీ మొత్తం చెల్లించాలని, లేదంటే ఆ భూమిలో వాటా కావాలని అఖిలప్రియ, ఆమె భర్త భార్గరామ్‌ కలసి ప్రవీణ్‌రావుపై ఒత్తిడి తెచ్చారు.

ఇందులో భాగంగా నెరవేర్చుకోవడానికే గుంటూరు శ్రీను, సాయి, చంటి, ప్రకాశ్‌ తదితరులతో కలసి మంగళవారం రాత్రి బాధితుల్ని కిడ్నాప్‌ చేయించారు. ఈ క్రమంలో చిలుకూరులో ఉన్న ఓ ఫామ్‌హౌస్‌లో నిర్బంధించి సెటిల్‌మెంట్‌ చేసుకో వాలని బెదిరిస్తూ కర్రలతో వారిపై దాడి చేశారు. ఆపై ఖాళీ బాండ్‌ పేపర్లపై సంతకాలు చేయించు కున్నారు. ఈ కిడ్నాపులకు సంబంధించిన వార్త మీడియాలో రావడంతో తీవ్ర కలకలం రేగిందని, పోలీసుల వేట ముమ్మరం కావడంతో అఖిలప్రియ తదితరులు అప్రమత్తమయ్యారు. ఆమె సూచన మేరకు ప్రవీణ్, సునీల్, నవీన్‌లను మెహిదీపట్నం సన్‌సిటీ సమీపంలోని కాళీమాత దేవాలయం వద్ద వదిలి వెళ్లారు. అఖిలప్రియ రాజకీయంగా పలుకు బడి ఉన్న నేత కావడంతో సాక్ష్యాలు తారుమారు చేయడంతోపాటు సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ పోలీసులు కోర్టుకు నివేదిం చారు. దర్యాప్తునకు కూడా ఆటంకం కలిగించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.(చదవండి: బెంగళూరులో ఏ-3 భార్గవరామ్‌?)

అరెస్టు చేయకపోతే...
పరారీలో ఉన్న ఆమె భర్త భార్గవ్‌రామ్‌కు నేరచరిత్ర ఉందని, అఖిలప్రియను అరెస్టు చేయకపోతే ఇద్దరూ కలిసి నేరాలు కొనసాగించవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇంకా అనేక మంది నిందితులు పరారీలో ఉన్నారని కోర్టుకు తెలిపారు. బాధితులతోపాటు వారి కుటుంబీకులపై మరోసారి దాడికి పాల్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నిందితుల్ని అరెస్టు చేయడం ద్వారా బాధితులకురక్షణ కల్పించాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. భార్గవ్‌రామ్‌తోపాటు ఇతర నిందితుల్ని అరెస్టు చేయడానికి ప్రత్యేక బృందాలు గాలింపు ముమ్మరం చేశాయి. ఏపీలోని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో భార్గవ్‌రామ్‌ ఉన్నాడని అనుమానిస్తున్న పోలీసులు ఓ టీమ్‌ను అక్కడకు పంపారు.

6 నెలల క్రితమే పథకం!
కాగా ప్రవీణ్‌ రావు తదితరుల్ని కిడ్నాప్‌ చేయడానికి అఖిలప్రియ దాదాపు 6 నెలల క్రితమే పథకం వేశారని అనుమానిస్తున్నారు. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న గుంటూరు శ్రీను నకిలీ నంబర్‌ ప్లేట్‌తో కూడిన వాహనంలో సంచరిస్తుండగా బోయిన్‌పల్లి పోలీసులు ఐదు నెలల క్రితమే పట్టుకున్నారు. అలా ఎందుకు చేశారని పోలీసులు ప్రశ్నించగా... తాను కొందరి కోసం పనిచేస్తుంటానని, ఈ నేపథ్యంలోనే ముప్పు పొంచి ఉండటంతో తరచూ వాహనం నంబర్‌ ప్లేట్లు మారుస్తుంటానని చెప్పి తప్పించుకున్నట్లు తెలిసింది. వాస్తవానికి అప్పట్లో నకిలీ నంబర్‌ ప్లేట్‌తో ప్రవీణ్‌రావు ఇంటి వద్ద రెక్కీ కోసమే గుంటూరు శ్రీను వెళ్లినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అతడిని పట్టుకోవడానికి ఓ ప్రత్యేక బృందాన్ని ఏపీకి పంపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top