
హైదారాబాద్: సికింద్రాబాద్‌లోని ఓల్డ్ బోయినపల్లిలో డ్రగ్స్ తయారు చేస్తున్న మేధా హైస్కూల్‌పై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ స్కూల్‌ను సీజ్ చేసింది. మేధా స్కూల్ అనుమతులు సైతం రద్దు చేసింది విద్యా శాఖ. ఇక ఆ స్కూల్‌లో చదువుతున్న విద్యార్థులను ఇతర స్కూళ్లలో చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
అసలు ఏం జరిగిందంటే..!
విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే పాఠశాలనే మ త్తుమందు తయారీ ఫ్యాక్టరీగా మార్చేశారు. ఉదయం పాఠశాల తరగతులు నిర్వహిస్తూనే గుట్టుచప్పుడు కాకుండా రాత్రివేళల్లో ఆ్రల్ఫాజోలం అనే మత్తుపదార్థాన్ని తయారు చేస్తున్నారు. స్వయంగా పాఠశాల కరస్పాండెంటే ఈ దందాకు తెరతీయడం గమనార్హం. సికింద్రాబాద్‌లోని ఓల్డ్ బోయినపల్లిలో మేధా హైస్కూల్ కరస్పాండెంట్ మల్లేల జయప్రకాశ్‌గౌడ్ పాఠశాలలోనే ఆ్రల్ఫాజోలం తయారు చేస్తున్నట్టు అందిన సమాచారం మేరకు ఈగల్ (ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్) బృందం నిఘా పెట్టింది.
శనివారం మధ్యాహ్నం జయప్రకాశ్‌గౌడ్ ఆ్రల్ఫాజోలంను కస్టమర్లకు విక్రయించేందుకు తీసుకెళ్తుండగా అప్పటికే మాటువేసి ఉన్న ఈగల్ బృందం అతడిని అదుపులోకి తీసుకుంది. అతడి వద్ద నుంచి 3.5 కిలోల ఆ్రల్ఫాజోలంను స్వా«దీనం చేసుకున్నట్టు తెలిసింది. పాఠశాలలో తనిఖీ చేయగా.. రెండు గదుల్లో ఆల్ఫ్రాజోలం తయారీ పరికరాలు గుర్తించారు.
ఈ సోదాల్లో తయారీలో ఉన్న 4.3 కిలోల ఆ్రల్ఫాజోలం, రూ.20 లక్షల నగదు స్వా«దీనం చేసుకున్నారు. జయప్రకాశ్‌గౌడ్‌కు సహకరిస్తున్న ఓల్డ్ బోయినపల్లి గంగపుత్ర కాలనీకి చెందిన గౌటె మురళీసాయి, బోయినపల్లి హస్మత్‌పేటకు చెందిన పెంటమోల్ ఉదయ్ సాయిని అరెస్టు చేశారు. పట్టుబడిన ఆల్ఫ్రాజోలం విలువ బహిరంగ మార్కెట్‌లో రూ. 50 లక్షల వరకు ఉంటుందని తెలిసింది.
ఓల్డ్ బోయినపల్లిలో..
బీటెక్ డిస్‌కంటిన్యూ చేసిన జయప్రకాశ్‌గౌడ్ హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలో ఒక భవనాన్ని అద్దెకు తీసుకుని తొమ్మిదేళ్లుగా మేధ హైస్కూల్ నడుపుతున్నాడు. పాఠశాల కరస్పాండెంట్‌గా పనిచేస్తూనే మత్తుపదార్థాల తయారీ దందాకు తెరతీశాడు. వనపర్తి ప్రాంతానికి చెందిన జయప్రకాశ్... మహబూబ్‌నగర్, వనపర్తి జిల్లాల్లో కల్లు దుకాణాలకు ఆ్రల్ఫాజోలం సరఫరా చేయడం ప్రారంభించాడు. ఆల్ఫ్రాజోలం తయారీ ఫార్ములాను ఒకరి నుంచి నేర్చుకున్న తర్వాత తానే స్వయంగా తయారీ ప్రారంభించాడు.
ఇందుకు తాను నడుపుతున్న పాఠశాల అయితే ఎవరికీ అనుమానం రాదన్న ఉద్దేశంతో ఇక్కడే రెండు పెద్ద గదుల్లో ఆ్రల్ఫాజోలం తయారీ మొదలుపెట్టాడు. అవసరమైన కెమికల్స్. ఇతర పదార్థాలను రాత్రి సమయాల్లో తెచ్చేవాడు. ఉదయం పాఠశాల నడిచే సమయంలో ఆ రెండు గదులకు తాళం వేసి ఉంచేవాడు. విద్యార్థులు, ఉపాధ్యాయులు అంతా వెళ్లిన తర్వాత ఆ్రల్ఫాజోలం తయారీ మొదలుపెట్టేవాడు.
ఈ విషయం పాఠశాల సిబ్బందికి, ఇతరులకు తెలియకుండా పాఠశాలతో సంబంధం లేని మురళీసాయి, ఉదయ్ సాయిలను తనతోపాటు చేర్చుకున్నాడు. గత ఆరు నెలలుగా ఇక్కడ ఆ్రల్ఫాజోలం తయారు చేస్తున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారం వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా..? ఈ ఆ్రల్ఫాజోలంను ఇతర రాష్ట్రాల్లోనూ విక్రయిస్తున్నారా? అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.