యువకుని హత్య.. ముదురుతున్న రాజకీయ వివాదం

Bengaluru: Youth Assassinate Case Raise Political Heat - Sakshi

బనశంకరి(బెంగళూరు): బెంగళూరులో జరిగిన ఒక హత్య రాజకీయ ప్రకంపనలను సృష్టిస్తోంది. ఇటీవలి వరుస పరిణామాల నేపథ్యంలో ఈ హత్యతో మరింత సెగ రగిలింది. బెంగళూరు  జేజే నగర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం అర్ధరాత్రి బైకులో వెళుతున్న చంద్రశేఖర్‌ (19) అనే యువకున్ని దుండగులు హత్యచేశారు. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్‌చేసి విచారిస్తున్నారు. స్నేహితుడు సైమన్‌రాజ్‌ పుట్టినరోజు సందర్భంగా చలవాదిపాళ్య నుంచి హొసగుడ్డదహళ్లికి అర్ధరాత్రి దాటిన తరువాత భోజనం చేయడానికి వెళ్లారు. ఈ సమయంలో వీరి బైక్‌ మరొక యువకుని బైక్‌ తగిలాయి. దీంతో ముగ్గురు యువకులు చంద్రశేఖర్‌తో గొడవపడి కత్తితో పొడిచి పరారయ్యారు. బాధితుడు విక్టోరియా ఆస్పత్రిలో మరణించాడు.

పోలీస్‌ కమిషనర్‌ ట్వీట్‌
నగర పోలీస్‌ కమిషనర్‌ కమల్‌పంత్‌ బుధవారం ట్విట్టర్‌లో ఈ హత్యపై స్పందిస్తూ చంద్రశేఖర్‌– షాహిద్‌ అనేవారి బైక్‌లు ఢీకొన్నాయి. గొడవ సమయంలో షాహిద్‌ కత్తితో చంద్రశేఖర్‌పై దాడి చేశాడు. ఈ కేసులో ముగ్గురు యువకులను అరెస్ట్‌చేశామని తెలిపారు.   

తడబడిన హోంమంత్రి
చంద్రశేఖర్‌ ఉర్దూ భాష మాట్లాడలేదనే కారణంతో దుండగులు హత్యచేశారని హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర బుధవారం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. అర్ధగంటలోనే ఆయన మాట మార్చారు. తప్పు జరిగింది, క్షమించండి అని ఒక ప్రకటనలో క్షమాపణ కోరారు.   

ఈ హత్య దారుణం: ఎమ్మెల్యే
ఇప్పుడు షరియత్‌ న్యాయం ప్రకారం చంద్రశేఖర్‌ హంతకులను శిక్షించాలా అని ఉడుపి ఎమ్మెల్యే రఘుపతి భట్‌ ప్రశ్నించారు. ఉడుపిలో ఆయన మాట్లాడుతూ బెంగళూరులో చంద్రశేఖర్‌ హత్య సీసీ కెమెరా వీడియో చూడడానికి సాధ్యం కాదు. హిందూ మొహల్లాలో ఇలాంటి హత్య ఎప్పుడూ జరగలేదు. స్థానికులు ఎవరూ చంద్రశేఖర్‌ను కాపాడడానికి రాలేదు. ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. సిద్దరామయ్య, డీకే శివకుమార్, జమీర్‌అహ్మద్‌  ఎక్కడికి వెళ్లారు?, హలాల్‌ మాంసం తిన్న మేధావులు ఎక్కడ ఉన్నారని ఎద్దేవా చేశారు.  

ఎమ్మెల్యే రూ.2 లక్షల సాయం
హత్యకు గురైన చంద్రశేఖర్‌ కుటుంబానికి చామరాజపేటె ఎమ్మెల్యే జమీర్‌అహ్మద్‌ రూ.2 లక్షల సహాయం అందజేశారు. చంద్రశేఖర్‌ ఇంటికి వెళ్లి మృతుని అవ్వకు సాయం చేశారు. హోం మంత్రి జ్ఞానేంద్ర వ్యాఖ్యలపై స్పందించలేనని, బైకు యాక్సిడెంట్‌ వల్ల గొడవ జరిగిందని అన్నారు.  

కశ్మీర్‌ను చేయాలనుకుంటున్నారా: సీటీ
ఉర్దూ మాట్లాడటం రాదనే కారణంతో చంద్రశేఖర్‌ను హత్యచేయడం వెనుక కొన్ని సంఘవిద్రోహశక్తుల హస్తం ఉంది, కర్ణాటకను కశ్మీర్‌ చేస్తారా? అని బీజేపీ జాతీయ ప్రదాన కార్యదర్శి సీటీ రవి మండిపడ్డారు. ఇది భారతదేశం. దీనిని అఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్‌ చేయాలంటే కుదరదు. మాకు కూడా మా భాషపై  అభిమానం ఉంది అన్నారు. 

చదవండి: ఇంజనీరింగ్, ఎంబీఏ చదివారు.. విలాసాల కోసం యూట్యూబ్‌ చూసి..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top