సోషల్‌ మీడియా పరిచయం.. ఫోటోలు మార్పింగ్‌ చేసి!

4 People Arrested For Morphing Photos And Blackmailing Girl - Sakshi

సాక్షి, సింగరేణి(కొత్తగూడెం): ఫొటోలు మార్ఫింగ్‌ చేసి బాలికను బ్లాక్‌మెయిల్‌ చేసిన నలుగురు వ్యక్తులను కొత్తగూడెం టూ టౌన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఠాణాలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ రాజేష్‌చంద్ర సీఐ బి.సత్యనారాయణతో కలిసి వివరాలు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలం ఖానాపూర్‌ గ్రామానికి చెందిన అక్కినపెల్లి శివకృష్ణ కొత్తగూడెంలోని గౌతంపూర్‌కు చెందిన బాలికను ఇన్‌స్ట్రాగామ్‌ ద్వారా పరిచయం చేసుకున్నాడు. మాయమాటలు చెప్పి వాట్సాప్‌ ద్వారా ఆమె ఫొటోలు సేకరించాడు. ఫొటోలను మార్ఫింగ్‌ చేసి తిరిగి బాలిక వాట్సాప్‌కు పంపాడు. డబ్బులు, బంగారం ఇవ్వాలని లేకపోతే మార్ఫింగ్‌ ఫొటోలను సోషల్‌ మీడియాలో పెడతానని బెదిరించాడు. దీంతో బాలిక భయపడి అంగీకరించింది. చదవండి : ఆ నది రక్తంతో ఎరుపెక్కుతోంది..

సెప్టెంబర్‌ 19న తన స్నేహితులు పాతకుంట సందీప్‌కుమార్, సుద్దపల్లి కార్తీక్, గిందమ్‌ విజయ్‌కుమార్‌లను గౌతంపూర్‌కు పంపాడు. వారు బాలిక నుంచి రెండు తులాల బంగారు ఆభరణం తీసుకుని, బెదిరించి వెళ్లారు. మళ్లీ ఈ నెల 3న శివకృష్ణ బాలికతో చాటింగ్‌ చేసి, రూ.3 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. తాము రుద్రంపూర్‌లోని ప్రగతివనం పార్కు వద్ద ఉన్నామని, వెంటనే డబ్బులు తెచ్చి ఇవ్వాలని బెదిరించాడు. విశ్వసనీయ సమాచారంతో టూ టౌన్‌ ఎస్‌హెచ్‌ఓ బి.సత్యనారాయణ తన సిబ్బందితో కలిసి చాకచక్యంగా శివకృష్ణను, అతని మిత్రులు పాతకుంట సందీప్‌కుమార్, సుద్దపల్లి కార్తీక్, గిందమ్‌ విజయ్‌కుమార్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కారు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను రిమాండ్‌కు తరలించనున్నట్లు ఏఎస్పీ తెలిపారు. చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్న సీఐ సత్యనారాయణను, సిబ్బందిని అభినందించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు నడుస్తున్న నేపథ్యంలో తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని చెప్పారు.  ఎస్‌ఐలు రాజేందర్, రాంబాబు, ఏఎస్‌ఐ రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. చదవండి: విషాదం: ప్రేమికులిద్దరూ మృతి

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top