300 మంది రోగుల హత్య.. వెలుగులోకి ఒళ్లు గగుర్పొడిచే విషయాలు | Sakshi
Sakshi News home page

300 మంది రోగుల హత్య.. వెలుగులోకి ఒళ్లు గగుర్పొడిచే విషయాలు

Published Sun, Apr 23 2023 9:06 AM

300 Patients Assassination In Tamil Nadu In Ten Years - Sakshi

కొరుక్కుపేట(తమిళనాడు): అనారోగ్యంతో ఆస్పత్రులకు వచ్చినవారిని ఓ కిరాతకుడు దారుణంగా చంపేశాడు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా పదేళ్లలో సుమారు 300 మంది రోగులను హత్య చేశాడు. ఈ విషయాన్ని స్వయంగా అతనే చెబుతున్న వీడియో తమిళనాట తీవ్ర సంచలనం సృష్టించింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ కేసు వివరాలు.. తమిళనాడులోని నామక్కల్‌ జిల్లా పల్లిపాళయం ప్రభుత్వాస్పత్రి మార్చురీలో పనిచేసే ఓ ఉద్యోగికి సహాయకుడిగా ఉన్న మోహన్‌రాజ్‌ (50) అనే వ్యక్తి చిన్నచిన్న పనులు చేస్తుండేవాడు.

తాను పెద్దఎత్తున హత్యలు చేసినట్లు మోహన్‌రాజ్‌ ఓ వ్యక్తికి చెబుతున్న వీడియో ఈ నెల 18వ తేదీన బయటకు వచ్చింది. వయోభారం, ఆరోగ్యం క్షీణించిన వృద్ధులకు వారి బంధువుల కోరిక మేరకు విషపు ఇంజక్షన్లు ఇచ్చి దాదాపు 300 మందిని హత్య చేసినట్లు మోహన్‌రాజ్‌ ఆ వీడియోలో వెల్లడించాడు. చెన్నై, బెంగళూరులోనూ కొద్దికాలం ఆస్పత్రుల్లో పనిచేసే సమయంలో ఇలాంటి హత్యలు చేసినట్లు తెలిపాడు.
చదవండి: భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటున్న యువతి.. కన్నేసిన మాజీ ప్రియుడు

ఒక్కో హత్యకు రూ.5 వేలు తీసుకునేవాడినని పేర్కొన్నాడు. ఆ వీడియోను పరిశీలించి తాము విచారణ చేయగా, మోహన్‌రాజ్‌ డబ్బులు తీసుకుని హత్యలకు పాల్పడుతున్నట్లు తేలిందని పల్లిపాళయం పోలీసు ఇన్‌స్పెక్టర్‌ చంద్రకుమార్‌ శనివారం తెలిపారు. ఓ సామాజిక కార్యకర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, తాను హత్యలు చేసినట్లు తమ విచారణలో నిందితుడు అంగీకరించడంతో అరెస్ట్‌ చేశామని చెప్పారు.  

Advertisement
 

తప్పక చదవండి

Advertisement