చంపేందుకు ఎందుకు కన్నావమ్మా!? 

12 Day Old Baby Found Deceased In Hospitals Water Sump - Sakshi

12 రోజుల పసిబిడ్డను హత్య చేసిన తల్లి  

నీటి తొట్టిలో వేయడంతో ఊపిరాడక బిడ్డ మృతి 

ఆడబిడ్డ పుట్టడం ఇష్టం లేకనే..  

పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం

నవ మాసాలూ మోసి.. రక్తం పంచిన బిడ్డల్ని అత్యంత దారుణంగా తల్లులే హత్య చేస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. మొన్న భర్తతో గొడవ పడి ఓ తల్లి ఏకంగా తన బిడ్డ చేతిని కోసి ప్రాణాలు విడిచే వరకూ అలానే చూస్తుండిపోయిన ఘటన అనంతపురం జిల్లాలో చూశాం. ఆడబిడ్డ పుట్టిందని ఆస్పత్రిలోని నీటితొట్టిలో వేసి బిడ్డ ఊపిరి తీసిన తల్లి ఉదంతాన్ని పశ్చిమగోదావరి జిల్లాలో ఇప్పుడు చూస్తున్నాం. రక్తమాంసాలు పంచిన ‘అమ్మ’లే నిలువునా బిడ్డల ప్రాణాలు తీస్తుంటే.. ఇక బిడ్డలను రక్షించేదెవరు?!  

సాక్షి, ఏలూరు టౌన్‌: కృష్ణాజిల్లా బాపులపాడు మండలం రేమల్లి గ్రామానికి చెందిన కలపాల నాగేశ్వరరావు కుమారుడు హరికృష్ణకు ఆరేళ్ల కిందట చాట్రాయి మండలానికి చెందిన సీతామహాలక్ష్మితో వివాహమైంది. వ్యవసాయ పనులు చేసుకుంటూ ఇద్దరూ జీవనం సాగిస్తున్నారు. చాలా కాలానికి సీతామహాలక్ష్మి గర్భం దాల్చింది. ప్రసూతి కోసం ఏలూరులోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా, జూలై 30న ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉండటంతో వైద్యులు డిశ్చార్జ్‌ చేశారు. అయితే బిడ్డ మళ్లీ అనారోగ్యంగా ఉండటంతో ఈ నెల ఎనిమిదో తేదీన ఏలూరు శంకరమఠం వీధిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. చిన్నారికి గొంతులో ఇన్‌ఫెక్షన్‌ ఉండటంతో ఈఎన్‌టీ వైద్యులు చికిత్స అందించారు.

ఇదిలా ఉండగా బిడ్డ కోలుకుందని ఈ నెల 11న ఇంటికి వెళ్లొచ్చని వైద్యులు చెప్పారు. హరికృష్ణ బయటికి వెళ్లి తండ్రితో కలిసి హాస్పిటల్‌కు వచ్చేసరికి పాప కనిపించలేదు. ఆస్పత్రి అంతా గాలించినా ఫలితం లేకపోయింది. చివరికి ఆస్పత్రి ప్రాంగణంలోని నీటి తొట్టెలో ఆ చిన్నారి విగతజీవిగా కనిపించింది. టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సీఐ ఆదిప్రసాద్, ఎస్‌ఐలు కిషోర్‌బాబు, నాగబాబు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. దీనిపై తల్లిని ప్రశ్నించగా తన బిడ్డను తానే చంపినట్టు సీతామహాలక్ష్మి చెప్పింది. సీతామహాలక్ష్మికి ఆడబిడ్డ పుట్టటం ఇష్టం లేదని, దీనికి తోడు బిడ్డ అనారోగ్యంతో ఉండటంతో అస్సలు నచ్చలేదని శనివారం మీడియాతో ఏలూరు డీఎస్పీ దిలీప్‌కిరణ్‌ చెప్పారు. నిందితురాలిని న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా రిమాండ్‌ విధించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top