ప్రభుత్వ భూముల మ్యుటేషన్‌.. 11 మంది వీఆర్వోల సస్పెన్షన్‌

11 VROs Suspension In Prakasam District - Sakshi

ప్రకాశం జిల్లా కలెక్టర్‌ ఉత్తర్వులు

మార్కాపురం(ప్రకాశం జిల్లా): నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూములను మ్యుటేషన్‌ చేశారన్న ఆరోపణలపై ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని 11 మంది వీఆర్వోలు, ఓ విలేజ్‌ సర్వేయర్‌ను సస్పెండ్‌ చేయడంతోపాటు తహసీల్దార్‌ ఆఫీస్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్‌ను ఉద్యోగం నుంచి తొలగిస్తూ జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, ఇందులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విశ్రాంత తహసీల్దార్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేయాల్సిందిగా ఆదేశించారు. ఈ మేరకు పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్‌ స్పెషల్‌ కలెక్టర్‌ ఒక ప్రకటన విడుదల చేశారు.

17 గ్రామాల్లో మొత్తం 378.89 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా పలువురికి మ్యుటేషన్‌ చేసినట్లు గుర్తించామన్నారు. సస్పెండ్‌ అయిన వారిలో మార్కాపురం–2, 3 వీఆర్వోలు ఎస్‌.శ్రీనివాసరెడ్డి, కె.రాజశేఖరరెడ్డి, గజ్జలకొండ–1, 2 వీఆర్వోలు జి.శ్రీనివాసరెడ్డి, వై.గోవిందరెడ్డి, పెద్దయాచవరం వీఆర్వో ఎస్‌కే కాశింవలి, నాయుడుపల్లి వీఆర్వో వై.కాశీశ్వరరెడ్డి, ఇడుపూరు వీఆర్వో వీవీ కాశిరెడ్డి, కోలభీమునిపాడు, జమ్మనపల్లి వీఆర్వో ఐ.చలమారెడ్డి, చింతగుంట్ల, బడేకాన్‌పేట వీఆర్వో మస్తాన్‌వలి, కొండేపల్లి, కృష్ణాపురం వీఆర్వో రామచంద్రారావు, భూపతిపల్లి, బొందలపాడు వీఆర్వో పి.మల్లిఖార్జున, చింతగుంట్ల విలేజ్‌ సర్వేయర్‌ ఎం.విష్ణుప్రసన్నకుమార్‌లు ఉన్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పి.నాగరాజును రిమూవ్‌ చేస్తూ ఆదేశాలిచ్చారు. విశ్రాంత తహసీల్దార్‌ విద్యాసాగరుడుపై క్రిమినల్‌ కేసు నమోదుకు ఆదేశించారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో ఏఆర్‌ఐ గోపి, మార్కాపురం–4 వీఆర్వో కోటయ్య, రాయవరం–1 వీఆర్వో జి.సుబ్బారెడ్డిని సస్పెండ్‌ చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top