చిత్తూరు కలెక్టరేట్ : స్వాతంత్య్ర సమరయోధుడు, దేశ తొలి విద్యాశాఖ మంత్రి డాక్టర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్‌ను ఆదర్శంగా తీసుకోవాలని డీఆర్‌వో మోహన్‌కుమార్ తెలిపారు. కలెక్టరేట్‌లోని వివేకానంద భవనంలో బుధవారం జిల్లా మైనారిటీల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆజాద్ జయంతిని పురస్కరించుకుని ‘జాతీయ విద్యా దినోత్సవం’, ‘మైనారిటీల సంక్షేమ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. డీఆర్‌వో ముఖ్య అతిథిగా పాల్గొని ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా ఆజాద్ విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేశారని తెలిపారు. ఐఐటీ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల స్థాపనకు పునాదులు వేశారని కొనియాడారు. విద్యతోనే దేశాభివృద్ధి సాధ్యమని బలంగా నమ్మిన వ్యక్తి ఆజాద్ అని పేర్కొన్నారు. డీఈవో లక్ష్మినారాయణ మాట్లాడుతూ సాంకేతిక విద్య, జాతీయ సమైక్యత, లింగ సమానత్వానికి ఆజాద్ విశేషంగా కృషి చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి చిన్నారెడ్డి, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, విద్యాశాఖ, మైనారిటీ సంక్షేమ శాఖ ప్రతినిధులు పాల్గొన్నారు.
పోలీస్ కార్యాలయంలో..
చిత్తూరు రూరల్ (కాణిపాకం): దేశ తొలి విద్యామంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని జిల్లా ఎస్పీ తుషార్ డూడి పిలుపునిచ్చారు. చిత్తూరు నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆజాద్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ పేదరికం, నిరక్షరాస్యతను సమూలంగా తుడిచిపెట్టడానికి విద్య ఒక్కటే సరైన మార్గమని నమ్మి దేశంలో విద్యా వ్యవస్థకు బలమైన పునాదులు వేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు మహబూబ్ బాషా, ఎస్.షాను, దేవదాస్, ఏఆర్ డీఎస్పీలు మహబూబ్ బాషా, రామకృష్ణ, ఆర్‌ఐలు చంద్రశేఖర్, సుధాకర్, వీరేశ్, డీపీఓ ఏఓ నాగభూషణమ్మ, సిబ్బంది పాల్గొన్నారు.
ఆజాద్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న డీఆర్‌వో, సిబ్బంది, చిత్రపటానికి నివాళులర్పిస్తున్న ఎస్పీ


