సర్కారు బండిలో షికారు | - | Sakshi
Sakshi News home page

సర్కారు బండిలో షికారు

Nov 12 2026 3:24 AM | Updated on Nov 12 2026 3:24 AM

ఐఅండ్‌పీఆర్‌ శాఖలో గీత దాటిన ఆగడాలు డీడీ అధికారిక వాహనంలో ప్రయాణం అధికారిక ఫైళ్లతో నగరంలో హల్‌చల్‌

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లా కేంద్రమైన చిత్తూరులోని సమాచార, పౌరసంబంధాల శాఖ (ఐ అండ్‌పీఆర్‌)లో అడ్డగోలు వ్యవహారాలు పరాకాష్టకు చేరాయి. ప్రభుత్వ నిధులతో నడిచే అధికారిక వ్యవస్థను సొంత ప్రచారానికి వినియోగిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే నిబంధనలను ఉల్లంఘిస్తూ శాఖాధిపతుల వాహనాలను వ్యక్తిగత పనులకు వినియోగిస్తుండడం తీవ్ర దుమారం రేపుతోంది. కూటమి ప్రభుత్వ పాలనలో ఇన్‌ఫ్లుయెన్సర్ల పేరిట అడ్డదారుల్లో నియామకాలు చేపట్టారు. వారికి ఏకంగా శాఖాధికారులకు కేటాయించిన ప్రభుత్వ బొలేరో వాహనాన్ని అప్పగించడం అధికార యంత్రాంగం నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఈ బాగోతంలో మరో దిగ్భ్రాంతికర విషయం వెలుగులోకి వచ్చింది.

సమాచార, పౌరసంబంధాల శాఖ రికార్డుల ప్రకారం ఇన్‌ఫ్లుయెన్సర్‌గా కరుణాకర్‌ అనే వ్యక్తి నియమితుడయ్యాడు. ఏ మాత్రం సంబంధం లేని హేమంత్‌ కుమార్‌ అనే మరో వ్యక్తికి డీడీ వేలాయుధం అధికారిక వాహనాన్ని అప్పగించారు. అతను బుధవారం సాయంత్రం ప్రభుత్వ ఫైళ్లను తీసుకుని బొలేరో వాహనంలో కలెక్టర్‌ బంగ్లా పరిసరాలతో పాటు నగరంలోని ప్రధాన వీధుల్లో స్వేచ్ఛగా షికారు చేయడం కలకలం రేపింది. సాధారణంగా ప్రభుత్వ నిధులతో కొనుగోలు చేసిన వాహనాలను ఆయా శాఖల్లో అధికారికంగా పనిచేసే డ్రైవర్లు మాత్రమే నడపాల్సి ఉంటుంది.

ఇక్కడ నిబంధనలను ఉల్లంఘించి అడ్డదారుల్లో వచ్చిన వారికి డీడీ వాహనాన్ని అప్పగించడం వెనుక ఉన్న రహస్యమేమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సమాచార, పౌరసంబంధాల శాఖ అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కనిపించకుండాపోతోందని, ఇలాగే వదిలేస్తే మునుముందు మొత్తం శాఖను ఈ ఇన్‌ఫ్లుయెన్సర్ల చేతిలో పెట్టేస్తారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా కలెక్టర్‌ స్పందించి నిబంధనలు ఉల్లంఘించి ప్రభుత్వ వాహనాన్ని ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చిన అధికారిపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

కలెక్టర్‌ బంగ్లా ఎదురుగా పార్క్‌ చేసి ఉన్న ఐఅండ్‌పీఆర్‌ శాఖ డీడీ బొలేరో వాహనం, డీడీ బొలేరో వాహనం డ్రైవింగ్‌ చేసేందుకు వెళ్తున్న డమ్మీ ఇన్‌ఫ్లుయెన్సర్‌

ఐ అండ్‌పీఆర్‌లో నిబంధనలు ఉల్లంఘన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement