దౌర్జన్య విజయం | - | Sakshi
Sakshi News home page

దౌర్జన్య విజయం

Nov 4 2026 1:26 AM | Updated on Nov 4 2026 1:26 AM

పురపోరులో మూడు స్థానాలూ టీడీపీ కై వసం

చిత్తూరు మేయర్‌..పలమనేరు, కుప్పంలో సైకిల్‌

ఎన్నికలు జరిగిన వార్డుల్లో వైఎస్సార్‌సీపీ గట్టి పోటీ

కౌంటింగ్‌ సమయంలోనూ కుతంత్రాలు

కౌంటింగ్‌ కేంద్రాల్లోనూ అన్యాయం

● కుప్పం మున్సిపాలిటీ 7వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మనోహర్‌ తొలుత 200 ఓట్లు, 3వ వార్డులోనూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి 350 ఓట్లు, , 12వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి 200 ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్లు అధికారులు తొలుత ప్రకటించారు. కాసేపటి తర్వాత వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను బయటకు పంపించేశారు. అనంతరం ఈ మూడు వార్డుల్లోనూ టీడీపీ అభ్యర్థులే గెలిచినట్లు ప్రకటించారు. దీనిపై నిరసన వ్యక్తం చేసిన వైఎస్సార్‌సీపీ శ్రేణులను పోలీసులు లాఠీతో చావబాదారు.

● పలమనేరులోని 34వ వార్డులో 14 ఓట్ల మెజారిటీతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గెలిచినప్పటికీ.. టీడీపీ నేతలు రీకౌంటింగ్‌కు పట్టుబట్టారు. నాలుగుమార్లు రీకౌంటింగ్‌ చేసినా, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గెలిచినట్లే గణాంకాలు చూపించాయి. అయినా సరే రాత్రి 8 గంటల వరకు కూడా దీనిపై అధికారికంగా ప్రకటన చేయలేదు.

● నగరిలోని 38వ వార్డులో 29 ఓట్ల మెజారిటీతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గెలుపొందితే, టీడీపీ నేతలు రీకౌంటింగ్‌కు పట్టుబట్టారు. అనంతరం ఫలితాల్లోనూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గెలుపొందడంతో ప్రత్యర్థులు నిరాశతో వెనుతిరిగారు.

సాక్షి, చిత్తూరు : ఏజెంట్లను బయటకు పంపేయడం, రిగ్గింగ్‌ చేయడం, దొంగ ఓట్లు వేయించడం, పోలీసులతో బెదరించడం, వైఎస్సార్‌సీపీ నేతలను అక్రమంగా నిర్బంధించడం వంటి అప్రసాజ్వామిక ఘటనల నడుమ పురపాలక పోలింగ్‌ సాగింది. ఈ నేపథ్యంలో ఫలితాలు ఎలా ఉంటాయనేది అందరూ ఊహించారు. చివరకు జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు అధికారపార్టీకే అనుకూలంగా వస్తాయనే అంచనాలు నిజమయ్యాయి. మంగళవారం జరిగిన ఓట్ల లెక్కింపులో ఓ కార్పొరేషన్‌తో పాటు రెండు మున్సిపాలిటీల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు.

చిత్తూరులో హై డ్రామా..

చిత్తూరు కార్పొరేషన్‌లో 60 డివిజన్లకు గాను, 51 స్థానాలు ఏకగ్రీవం కాగా, 9 డివిజన్లకు ఎన్నికలు నిర్వహించారు. అయితే మొత్తం పోలైన ఓట్లు 92,910 అంటూ అధికారులు ప్రకటించారు. ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్‌లో 21 వేలు, రెండో రౌండ్‌లో 31 వేలు, మూడో రౌండ్‌లో 31 వేల ఓట్ల చొప్పున ఓట్లు లెక్కించి అధికారులు ఫలితాలు వెల్లడించారు. మిగిలిన చివరి రౌండ్‌లో 8,910 ఓట్లను కౌంట్‌ చేసి ఫలితాలు ప్రకటించాలి. ఇక్కడే అధికారులకు షాక్‌ తగిలింది. చివరిలో దాదాపు 6 వేల ఓట్లు అదనంగా బ్యాలెట్‌ బాక్సులో ప్రత్యక్షమైనట్లు తెలుస్తోంది. దీంతో గంటన్నరసేపు అధికారులు కౌంటింగ్‌ ప్రక్రియను ఆపేసినట్లు విశ్వసనీయ సమాచారం. అప్పటికే విషయం దావానంలా సామాజిక మాధ్యమాల్లో వ్యాపించడం, అధికారపార్టీ నేతలు దొంగ ఓట్లు వేయడం, రిగ్గింగ్‌ చేశారనేందుకు ఈ 6 వేల ఓట్లే నిదర్శనమంటూ విమర్శలు మొదలయ్యాయి. గంటన్నర తర్వాత మొత్తం 8,912 ఓట్లకు ఫలితాలు వెల్లడించారు. అంటే ఇక్కడ కూడా గతంలో అధికారులు ప్రకటించిన సంఖ్య కంటే రెండు ఓట్లు అదనంగా వచ్చాయి.

కుట్రలను ఎదురొడ్డి గెలిచారు

ఓ వైపు దొంగ ఓట్లు, మరోవైపు రిగ్గింగ్‌ చేస్తూ బట్టబయలైన అధికారపార్టీ కుతంత్రాల మధ్య ఎన్నికలు జరిగిన 94 వార్డుల్లో .. 17 చోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు కుట్రలకు ఎదురొడ్డి గెలుపొందారు. ఈ మేరకు ఎన్నికల నిర్వహించిన చిత్తూరు కార్పొరేషన్‌లోని 9 స్థానాల్లో టీడీపీ–4, వైఎస్సార్‌సీపీ– 3, జనసేన–1, స్వతంత్ర అభ్యర్థి ఓచోట గెలిచారు. కుప్పంలో టీడీపీ–19, నగరిలో టీడీపీ–30, వైఎస్సార్‌సీపీ–6, జనసేన–1, పలమనేరులో టీడీపీ– 21, వైఎస్సార్‌సీపీ–8, జనసేన అభ్యర్థులు 2 స్థానాల్లో గెలుపొందారు.

ఎవరెక్కడ ఎవరంటే..

చిత్తూరు కార్పొరేషన్‌లో టీడీపీ అభ్యర్థి కటారి హేమలత రెండో మారు మేయర్‌గా గెలుపొందారు. కుప్పం పురపాలక చైర్మన్‌గా రాజకుమార్‌ (టీడీపీ) గెలవగా, పలమనేరు మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా రాజ్యలక్ష్మి (టీడీపీ) విజయం సాధించారు. నగరి మున్సిపల్‌ చైర్మన్‌గా శ్రీనివాసన్‌ (టీడీపీ) ఏకగ్రీవంగా గెలిచినట్లు అధికారులు గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే.

‘పచ్చ’పోటు.. ఓడిన ఓటు

రాజ్యాంగానికి అవమానం జరిగింది. ప్రజాతీర్పుపై పచ్చపోటు పడింది. ఓటరుపై దౌర్జన్యమే విజయం సాధించింది. చివరకు ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైంది. టీడీపీ గూండాల కర్కశత్వానికి జన సామాన్యం విలవిలలాడింది. నచ్చిన నేతను ఎన్నుకునే అవకాశం కూడా లేని దుస్థితి దాపురించింది. రౌడీరాజ్యంలో బ్యాలెట్‌ కేవలం కాగితం ముక్కలానే మిగిలింది. కౌంటింగ్‌ కేంద్రంలోనూ కుతంత్రమే గెలుపొందింది. రిగ్గింగ్‌.. దొంగ ఓట్లతో ఎట్టకేలకు అధికార పార్టీనే జిల్లాలోని మూడు పురపాలక పీఠాలను కై వసం చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement