మృత్యువులోనూ వీడని స్నేహం | - | Sakshi
Sakshi News home page

మృత్యువులోనూ వీడని స్నేహం

Nov 4 2026 1:26 AM | Updated on Nov 4 2026 1:26 AM

● టిప్పర్‌ ఢీకొని ఇద్దరు విద్యార్థుల మృతి ● కన్నీరుమున్నీరైన కుటుంబీకులు ● జాతీయ రహదారిపై ఆందోళనకు దిగిన బంధువులు

నగరి : చేతిలో చేయి వేసుకుని తిరిగిన ఆ ఇద్దరు స్నేహితులను మృత్యువు కూడా ఒకేసారి వెంటాడింది. కలిసే చదువుకున్నారు.. కలిసే తిరిగారు.. చివరకు ఒకే ప్రమాదంలో విగతజీవులయ్యారు. రెప్పపాటులో జరిగిన ఘోర ప్రమాదం రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. కన్న కొడుకుల భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల కలలను జాతీయ రహదారిపై దూసుకొచ్చిన టిప్పర్‌ చిదిమేసింది. పట్టణ పరిధిలోని తహసీల్దార్‌ కార్యాలయం సమీపంలో మంగళవారం సాయంత్రం ఈ హృదయవిదారక ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మదన్‌కుమార్‌ అలియాస్‌ సంతోష్‌ (18), అజిత్‌ (18) అనే ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులిద్దరూ స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నారు. మదన్‌న్‌కుమార్‌ నగరి మున్సిపాలిటీ పరిధిలోని చింతలపట్టెడకు చెందినవాడు కాగా, అజిత్‌ తమిళనాడులోని అరక్కోణం ప్రాంతానికి చెందినవాడు. అజిత్‌ చింతలపట్టెడ మార్గంలోని బీసీ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నాడు. ఇద్దరూ ప్రాణస్నేహితులు. ఖాళీ సమయాల్లో మదన్‌న్‌కుమార్‌ తన తాత స్కూటీపై సరదాగా బయటకు వెళ్లి వస్తుండేవారు. ఎప్పటిలాగే మంగళవారం సాయంత్రం కూడా ఇద్దరూ స్కూటీపై పుత్తూరు మార్గంలోకి వెళ్లి తిరిగి వస్తున్నారు. ఇంతలో వేగంగా వచ్చిన టిప్పర్‌ వారి స్కూటీని ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ లారీ కిందకు వెళ్లి చక్రాల కింద నలిగి ప్రాణాలు కోల్పోయారు. కళ్లముందే జరిగిన ఈ ఘోరాన్ని చూసిన స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్‌ టిప్పర్‌ను అక్కడే వదిలి పరారయ్యాడు.

టిప్పర్ల వేగంపై ఆగ్రహం

ఇద్దరు విద్యార్థుల మృతికి టిప్పర్ల అతివేగమే కారణమంటూ బంధువులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్‌తో పాటు ఆ మార్గంలో వస్తున్న ఇతర టిప్పర్లపై రాళ్లు విసురుతూ రహదారిపై నిరసనకు దిగారు. దీంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలను పూర్తిస్థాయిలో విచారించి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మృతుల కుటుంబీకులకు హామీ ఇచ్చారు.

ఈ ప్రమాదం కారణంగా మదన్‌న్‌కుమార్‌ కుటుంబం అనుభవిస్తున్న విషాదం పలువురి హృదయాలను కలచివేసింది. అతని తండ్రి ఇప్పటికే మరణించడంతో తల్లే కుటుంబ భారాన్ని భుజాన వేసుకుంది. భవన నిర్మాణ కూలీగా పనిచేస్తూ రెక్కలు ముక్కలు చేసుకుని ఇద్దరు కుమారులను చదివిస్తోంది. తన కష్టాలను పక్కనపెట్టి, పెద్ద కుమారుడిని ఉన్నతంగా చూడాలని ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ విధి వక్రించించింది. కష్టపడి పెంచుకున్న పెద్ద కుమారుడు ఇక తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడన్న వార్త ఆ తల్లిని, అవ్వను కుంగదీసింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఆమె కుమారుడి మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా రోదించిన తీరు అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించింది.

తండ్రి లేడు.. తల్లి కష్టమే జీవనాధారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement