రౌడీ రిగ్గింగ్‌ | - | Sakshi
Sakshi News home page

రౌడీ రిగ్గింగ్‌

Nov 2 2026 1:53 AM | Updated on Nov 2 2026 1:53 AM

● కుప్పంలోని అనిమిగానిపల్లె, తంబిగానిపల్లె ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో దొంగ ఓట్లు పోలయ్యాయి. మధ్యాహ్నం 12 గంటలకే అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ఉన్న వైఎస్సార్‌ సీపీ ఏజెంట్లను భయభ్రాంతులకు గురిచేసి బయటకు పంపించేశారు. ● నగరిలోని సత్రవాడ బూత్‌లో దొంగ ఓట్లు వేసుకుంటున్న టీడీపీ నేతలను ఏ ఒక్కరూ ఆపలేకపోయారు. ● పలమనేరులో దాదాపు 12 వార్డుల్లో 8 వేల ఓట్ల వరకు టీడీపీ కార్యకర్తలే దొంగ ఓట్లు వేశారు. ● నగరిలో 26వ వార్డు వద్ద దొంగ ఓటర్లను ప్రశ్నించిన వైఎస్సార్‌ సీపీ నేత మురళీపై టీడీపీ నేతలు పిడిగుద్దులు కురిపించి, తీవ్రంగా దాడి చేసి గాయపరిచారు. ● కుప్పంలో సాయంత్రం 4.30 నుంచి 5 గంటల వరకు రెస్కో సాకారంతో విద్యుత్‌ సరఫరా ఆపేసిన టీడీపీ నేతలు భారీ రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. ప్రధానంగా 7, 8, 9 వార్డుల్లో 80 శాతం ఓట్లను టీడీపీ కార్యకర్తలు దొంగ ఓట్లు వేశారు. దీనిపై పీవో నుంచి పోలీసుల వరకు ఏ ఒక్కరూ ప్రశ్నించలేదు. ● పలమనేరులోని నాలుగో వార్డులోని బూత్‌లను ఎమ్మెల్యే అమరనాథరెడ్డి ఆక్రమించుకున్నారు. ఏ ఒక్కరినీ లోపలకు పంపకుండా రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. ● నగరిలో మాజీ మంత్రి ఆర్‌కె.రోజాను హౌస్‌ అరెస్టు చేశారు. అధికారపార్టీ నేతలు చెప్పిందే చట్టంగా పోలీసులు పనిచేశారే తప్ప.. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి కాదన్నట్లు వ్యవహరించారనే విమర్శలను మూటగట్టుకున్నారు.

వైఎస్సార్‌ సీపీ ఏజెంట్లను

తరిమేసి యథేచ్ఛగా రిగ్గింగ్‌

చిత్తూరులో వైఎస్సార్‌ సీపీ మేయర్‌ అభ్యర్థిపై దాడికి యత్నం

పోలీస్‌ స్టేషన్‌లో బూత్‌ ఏజెంట్ల నిర్బంధం

కుప్పంలో అడ్డూ అదుపు లేకుండా టీడీపీ దొంగ ఓట్లు

పుర పోరులో

మున్సిపల్‌ ఎన్నికల వేళ అధికార కూటమి నేతలు బరితెగించారు. ఓటమి భయంతో పోలింగ్‌ కేంద్రాలను తమ గుప్పిట్లోకి తెచ్చుకుని ప్రతిపక్ష పార్టీల ఏజెంట్లను లేకుండా చేసి రిగ్గింగుకు పాల్పడ్డారు. ప్రశ్నించిన వైఎస్సార్‌ సీపీ నాయకులపై దాడులు చేశారు. పోలీసులు వారి అరాచకాలను అడ్డుకోకపోగా అండగా నిలిచి ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాలరాశారు.

సాక్షి, చిత్తూరు: అధికారం చేతిలో ఉంటే రాజ్యాంగం ఇచ్చిన హక్కును ఎలా కాలరాయాలో జిల్లాలో జరిగిన మునిసిపల్‌ ఎన్నికలు ప్రత్యక్ష నిదర్శనంగా మారాయి. టీడీపీ, కూటమి నేతలు బరితెగించారు. అన్యాయం జరిగిన వాళ్ల వైపు నిలబడాల్సిన ఖాకీలు అంగబలం ఉన్న వాళ్లకు మద్దతు ఇచ్చారు. చిత్తూరు జిల్లాలో ఆదివారం చిత్తూరు కార్పొరేషన్‌, పలమనేరు, కుప్పం, నగరి మునిసిపాలిటీల్లో నిర్వహించిన ఎన్నికలు కూటమి నేతల కనుసన్నల్లోనే జరిగాయి. ఏకపక్షంగా, నిస్సిగ్గుగా అప్రజాస్వామ్యకంగా ప్రజల ఓట్లను దొంగిలించి రిగ్గింగ్‌కు పాల్పడ్డారు.

తెల్లవారినుంచే దొంగ ఓట్లు

చిత్తూరు కార్పొరేషన్‌లో ఉదయం 7 నుంచే టీడీపీ కార్యకర్తలు, నేతలు దొంగ ఓట్లు వేయడం ప్రారంభించారు. గాండ్లపల్లె, లక్ష్మీనగర్‌ కాలనీ, ఓబనపల్లె, గంగనపల్లె, దుర్గానగర్‌, కట్టమంచి, మురకంబట్టు, వళ్లియప్పనగర్‌, ఓటి చెరువు, శంకరయ్యగుంట, ప్రాంతాల్లో దొంగ ఓట్లు పడ్డాయి. 60 డివిజన్లలోనూ టీడీపీ మేయర్‌ అభ్యర్థికి దొంగ ఓట్లు వేయడానికి ప్రణాళిక రూపొందించి అమలు చేశారు.

వైఎస్సార్‌ సీపీ శ్రేణులపై దాడులు

చిత్తూరులోని శంకరయ్యగుంట, గిరింపేట, సంతపేట ప్రాంతాల్లో వైఎస్సార్‌ సీపీ శ్రేణులు, కార్యకర్తలపై టీడీపీ నేతలు మన్నెం కిషోర్‌, రవి, దిలీప్‌, గోకుల్‌, నాయుడు, అర్జున తదితరులు దాడులకు తెగబడ్డారు. ఈ క్రమంలో కయినికట్టు వీధికి చెందిన రోషన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గిరింపేటలో బూత్‌లను పరిశీలించడానికి వెళ్లిన వైఎస్సార్‌ సీపీ మేయర్‌ అభ్యర్థి చంద్రశేఖర్‌పై దాడికి ప్రయత్నించారు.

చివరి గంట భారీ రిగ్గింగ్‌

చిత్తూరు నగరంలోని 140 పోలింగ్‌ బూత్‌లో చివరి గంటలో భారీ రిగ్గింగ్‌ జరిగింది. దాదాపు 18 వేల నుంచి 23 వేల వరకు దొంగ ఓట్లు పోల్‌ చేసుకున్నారు. వళ్లియప్పనగర్‌ పోలింగ్‌ కేంద్రంలోకి చొరబడిన టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు దాదాపు ఐదు బండిళ్ల బ్యాలెట్లు తీసుకుని రిగ్గింగ్‌ చేశారు. గాండ్లపల్లె, కట్టమంచి, మురకంబట్టు, గిరింపేట, లక్ష్మీనగర్‌ కాలనీ, ఇరువారం, గంగనపల్లె, రామ్‌నగర్‌ కాలనీ ప్రాంతాల్లో భారీగా రిగ్గింగ్‌ చేశారు.

ఎక్కడ పోలీస్‌..?

చిత్తూరు నగరంలో ఉదయం 5 గంటలకే పలువురు వైఎస్సార్‌ సీపీ నాయకులు, బూత్‌ ఏజెంట్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీళ్లందరినీ వన్‌టౌన్‌, టూటౌన్‌, డీటీసీ ప్రాంతాలకు తరలించారు. ఫలితంగా చాలా బూత్‌లలో ఏజెంట్లు కూర్చోలేదు. ఓట్లు వేయడానికి వచ్చిన వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరులను బెదిరించి పంపించేశారు.

టీడీపీ నేతల బరితెగింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement