– ముగ్గురికి తీవ్రగాయాలు
నగరి: చిత్తూరు–తచ్చూరు జాతీయ రహదారిలో బూచివానత్తం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు.. బెంగళూరుకు చెందిన లోకేష్ (34), హరిహరన్ (35), శాంతి (53), జగదీష్ (33) ఆదివారం ఉదయం కారులో చైన్నెకి బయలుదేరారు. చిత్తూరు–తచ్చూరు జాతీయ రహదారిపై బూచివానత్తం సమీపంలో కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో కారు నడుపుతున్న లోకేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. హరిహరన్, శాంతి, జగదీష్ తీవ్రంగా గాయపడ్డారు. పోలీసు లు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను అంబులెన్స్ ద్వారా నగరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం చైన్నెకి రెఫర్ చేశారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని రైతు మృతి
పలమనేరు: మండలంలోని మొరం పంచాయ తీ గజ్జలవారిపల్లి సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో వ్యక్తి మృతిచెందాడు. స్థానికుల కథనం మేరకు.. గజ్జలవారిపల్లికి చెందిన జి.ప్రభాకర్ రెడ్డి(53) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అతను ఆదివారం సాయంత్రం గ్రామ సమీపంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొంది. తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే మృతిచెందాడు. ఎక్స్‌ప్రెస్ హైవే నుంచి బైరెడ్డిపల్లి మీదుగా నిత్యం వేలాది వాహనాలు వెళుతుండడంతో పలమనేరు– బైరెడ్డిపల్లి రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంపై తమకు సమాచారం అందలేదని పోలీసులు తెలిపారు.
శ్రీవారి దర్శనానికి 8 గంటలు
తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 19 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శనివారం అర్ధరాత్రి వరకు 74,239 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 28,313 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.76 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 8 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.
‘పురపోరు’ లెక్కలు తేలేది రేపే!
సాక్షి, చిత్తూరు: మునిసిపల్ ఎన్నికలు ముగియడంతో బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైన ప్రజాతీర్పును అధికారులు అత్యంత భద్రత నడుమ ఆదివారం రాత్రి స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు. ఈ నెల 3వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. మఽ ద్యాహ్నం 12 గంటలకంతా ఫలితాలు వెల్లడి కా నున్నాయి. చిత్తూరు కార్పొరేషన్‌కు సంబంధించి పీవీకేఎన్ డిగ్రీ కళాశాలలో ఓట్ల లెక్కింపు కేంద్రా న్ని ఏర్పాటు చేశారు. పలమనేరుకు స్థానిక ప్రభు త్వ డిగ్రీ కళాశాల, కుప్పంలో ఎంఎఫ్‌సీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, నగరి మునిసి పాలిటీకి పుత్తూరులోని సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
వైఎస్సార్‌సీపీ
ప్రచార ఆటోపై దాడి
రేణిగుంట : స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి గంగారి సుజాతకు సంబంధించిన ప్రచార ఆటోను టీడీపీ కార్యకర్త ధ్వంసం చేశాడు. ఆదివారం వెంకటాపురంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆటోపై పచ్చరౌడీ బండరాయి వేయడంతో అద్దాలు పగిలిపోయాయి. డ్రైవర్ హాజవలీకి గాయాలయ్యాయి. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


