ప్రాదేశిక పోరులో
ఏకగ్రీవాల కోసం కుట్రలు
ప్రతిపక్షంపై పోలీసులు, పచ్చ మూకల రుబాబు
వైఎస్సార్‌సీపీ నేతలే లక్ష్యంగా ఉపసంహరణకు ఒత్తిళ్లు
జెడ్పీ చైర్‌పర్సన్–ఎంపీపీలే లక్ష్యంగా కుతంత్రాలు
ఇప్పటికే అక్రమంగా
నాలుగు జెడ్పీటీసీ స్థానాల ఏకగ్రీవం
నేటితో ముగుస్తున్న జెడ్పీటీసీ–ఎంపీటీసీల ఉపసంహరణ
అందుబాటులో లేని అభ్యర్థులు..
కుటుంబ సభ్యులకు బెదిరింపులు
సాక్షి, చిత్తూరు / చిత్తూరు కార్పొరేషన్: ప్రాదేశిక ఎన్నికల్లో ఎలాగైనా జెడ్పీ పీఠం ఏకగ్రీం చేసుకోవాలని టీడీపీ నేతలు చేస్తున్న కుట్రలు అన్నీ ఇన్నీ కావు. పచ్చని పల్లెల్లోకి రౌడీ మూకలు, గూండాలను పంపిస్తున్నారు. జెడ్పీటీసీ నుంచి ఎంపీటీసీగా నామినేషన్లు దాఖలు చేసిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులే లక్ష్యంగా బెదిరింపులకు పాల్పడుతున్నారు. సామ, దాన, దండోపాయాలను ప్రయోగిస్తున్నారు. కొన్ని చోట్ల పచ్చ నేతలకు పోలీసులు వంతపాడుతున్నారు. ‘‘అధికార పార్టీ వాళ్లు చెప్పినట్టు చేసుకోండి.. లేకుంటే మీకు ఇబ్బందులు తప్పవు.. మేమేమీ చెయ్యలేం’’ అంటూ నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే ఇలా చేస్తుండడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. జిల్లాలో ఇప్పటికే పలుచోట్ల చోటుచేసకున్న ఘటనలు పరిశీలిస్తే..
ఎంత కావాలో తీసుకుని తప్పుకోండి
చిత్తూరు మండలంలో పోటీలో ఉన్న ఎనిమిది మంది ఎంపీటీసీ అభ్యర్థులు లొంగిపోవాలని టీడీపీ నాయకులు డబ్బులు ఎర వేస్తున్నారు. ‘మీకు ఎంత కావాలో తీసుకుని నామినేషన్ ఉపసంహరించుకోండి’’ అంటూ ఒత్తిడి తెస్తున్నారు. అయినప్పటికీ వారు లొంగకపోవడంతో అంతు చూస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు.
పోలీసుల అండతో ఏకగ్రీవం
రొంపిచెర్ల మండలంలో 8 ఎంపీటీసీ స్థానాలను పోలీసుల అండతో టీడీపీ నాయకులు ఏకగ్రీవం చేయించుకున్నారు. జెడ్పీటీసీ అభ్యర్థి సుష్మపై బెదిరింపులకు దిగారు. ఆమె తరఫున ఏజెంట్లుగా ఎవరూ కూర్చోకూడదని 54 మందిని బెదిరిస్తున్నారు. వీటిపై సుష్మ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
గుడిపాల మండలంలో ఎంపీటీసీ స్థానాల కోసం నామినేషన్లు వేసిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల్లో పలువురు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తమ సంతకాలు ఫోర్జరీ చేస్తారని, ఇక్కడుంటే బెదిరింపులకు గురిచేస్తారని ఉపసంహరణ గడువు పూర్తయ్యేంత వరకు బయటి ప్రాంతాల్లో ఉండాలని అందుబాటులో లేకుండా పోయారు. కానీ ఓ పోలీసు అధికారి పోటీలో ఉన్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ఇళ్ల వద్దకు పోలీసులను పంపించారు. ఫోన్లలో టీడీపీ నేతలతో మాట్లాడుకుని ఉపసంహరణ చేసుకోవాలని అభ్యర్థుల కుటుంబ సభ్యులపై ఒత్తిడి పెంచుతున్నారు.
పోటీ నుంచి తప్పుకోండి
పలమనేరు, గంగాధరనెల్లూరులోని 18 మంది వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థులకు ఇప్పటికే టీడీపీ నేతలు వాట్సాప్ కాల్స్ చేసి పోటీ నుంచి తప్పుకోవాలని హెచ్చరికలు జారీచేశారు. పూతలపట్టులో మూడు స్థానాలు వైఎస్సార్‌సీపీకి తీసుకుని, మిగిలిన 10 తమకు ఏకగ్రీవం చేయాలని ఒత్తిడి చేస్తున్నారు.
గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటినగరంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై టీడీపీ నేతలు బెదిరింపులకు పాల్పడుతుంటే అప్రమత్తమైన నాయకులు ఇటీవల ముగ్గురు ఎంపీటీసీ అభ్యర్థులను బయట ప్రాంతాలకు తరలించారు.
నగరి నియోజకవర్గం విజయపురం మండలం కోసలనగరం వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి భవాని నామినేషన్‌లో సంతకం లేదని అధికారులు తిరస్కరించారు. దానిపై మాజీ మంత్రి రోజా అపీల్ చేయించారు.
కుప్పం నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను భయబ్రాంతులకు గురిచేస్తూ, వారిని ఇళ్ల నుంచి బయటకు కూడా రానివ్వడంలేదు. టీడీపీ నేతలకు వైఎస్సార్‌సీపీ కండువాలు వేయించి.. తప్పుడు నామినేషన్లు వేయించారు. వీటిని ఉపసంహరించుకుని కుప్పం నియోజకవర్గం మొత్తాన్ని ఏకగ్రీవం చేయడానికి పన్నాగాలు పన్నుతున్నారు.
రామకుప్పం మండలంలోని 16 ఎంపీటీసీ స్థానాలకు టీడీపీ నాయకులే వైఎస్సార్‌సీపీ అభ్యర్థులంటూ నామినేషన్లు దాఖలు చేశారు. వాటిని ఉపసంహరించుకుని వైఎస్సార్‌సీపీ అభ్యర్థులే ఉపసంహరించుకున్నారని చూపించి ఏకగ్రీవం చేసుకునేందుకు ఎత్తులు వేశారు.
యాదమరి మండలంలోని 5 ఎంపీటీసీ స్థానాలకు కూడా వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల పేరుమీద టీడీపీ నాయకులు నామినేషన్లు వేశారు. వాటిని విత్ డ్రా చేయించుకోనున్నారు.


