శ్రీవారి దర్శనానికి 15 గంటలు | - | Sakshi
Sakshi News home page

శ్రీవారి దర్శనానికి 15 గంటలు

Oct 27 2026 1:50 AM | Updated on Oct 27 2026 1:50 AM

తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 85,369 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 26,414 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.13 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది.

ఉప రాష్ట్రపతికి సాదర స్వాగతం

రేణిగుంట: తిరుమల, తిరుపతి రెండు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం జిల్లాకు విచ్చేసిన భారత ఉప రాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్‌కు రేణిగుంట విమానాశ్రయంలో కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, జిల్లా ఇంచార్జ్‌ మంత్రి అనగాని సత్యప్రసాద్‌, డీఐజీ షిమోషి, ఎస్పీ ఎల్‌.సుబ్బరాయుడు, స్విమ్స్‌ డైరెక్టర్‌ జగదీష్‌ తదితరులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఉప రాష్ట్రపతి తిరుమల బయల్దేరి వెళ్లారు.

నీట్‌ పీజీ ప్రవేశాలు

తిరుపతి తుడా: ఎస్వీ వైద్య కళాశాలలో 2026– 2027 సంవత్సరానికి గాను నీట్‌ పీజీ వైద్య విద్యలో ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. సోమవారం ఆల్‌ ఇండియా వ్యాప్తంగా అత్యుత్తమ ర్యాంక్‌ సాధించిన డాక్టర్‌ మాతంగి శామిలి అనే వైద్య విద్యార్థిని జనరల్‌ సర్జరీలో పీజీ అడ్మిషన్‌ పొందారు. ఈ సందర్భంగా ఆమె చిన్ననాటి నుంచి ఉత్తమ సర్జన్‌ కావాలనే లక్ష్యంతో నేడు ఎస్వీ వైద్య కళాశాలలో జనరల్‌ సర్జరీలో అడ్మిషన్‌ పొందినట్లు తెలిపారు. అలాగే సాయికృష్ణ సాకేత్‌ అనే విద్యార్థి జనరల్‌ సర్జరీలో పీజీ అడ్మిషన్‌ పొందారు. అనంతరం వైస్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కిరీటి మాట్లాడుతూ ఎస్వీ వైద్య కళాశాలలో మొత్తం 240 పీజీ సీట్లు ఉండగా ఆల్‌ ఇండియా కోటా కింద 113 సీట్లు, రాష్ట్ర కోటా కింద 127 సీట్లను తదుపరి కౌన్సెలింగ్‌లో కేటాయించనున్నట్టు తెలిపారు. సోమవారం సుమారు 40 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారన్నారు.

అఫిలియేషన్‌

విధివిధానాలపై కమిటీ

తిరుపతి సిటీ: విశ్వవిద్యాలయాల పరిధిలోని కళాశాలల అనుమతులు, గుర్తింపు పునరుద్ధరణపై ప్రస్తుతం ఉన్న విధివిధానాలు గందరగోళంగా ఉన్నాయని, వీటిపై సమగ్ర అధ్యయనం చేసి నూతన విధివిధానాలను సూచించాలని కమిషనర్‌ ఆఫ్‌ హైయ్యర్‌ ఎడ్యుకేషన్‌ నూతన కమిటీని నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ కమిటీలో ఉన్నత విద్యామండలి చైర్మన్‌ను కమిటీ చైర్‌పర్సన్‌గా, హైయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ను మెంబర్‌ కన్వీనర్‌గా, మరో ఆరుగురు పలు వర్సిటీల వీసీలు, రిజిస్ట్రార్‌లను సభ్యులుగా నియమించింది. ఇందులో ఎస్వీయూ రిజిస్ట్రార్‌ భూపతినాయుడు కమిటీ సభ్యులుగా నియమితులయ్యారు. ప్రస్తుతం వివిధ విశ్వవిద్యాలయాల్లో కళాశాలల అనుబంధ గుర్తింపు నిబంధనలు, గుర్తింపు కాలపరిమితి, తనిఖీలు, ఫీజులు, విద్యా క్యాలెండర్‌ వంటి అంశాల్లో వ్యత్యాసాలు ఉన్నాయని, ఈ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాలకు వర్తించేలా ఉమ్మడి విధానాన్ని రూపొందించాలని కమిటీకి ప్రభుత్వం సూచించింది. నెల రోజులలో సిఫార్సులను కమిటీ ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది.

రైల్వే ప్రయాణికులకు

ఇన్సూరెన్స్‌

చిత్తూరు కార్పొరేషన్‌: రైల్వే ప్రయాణికులకు ఆప్షన్‌గా ఇన్సూరెన్స్‌ తీసుకొనే విధానం అమల్లోకి తెచ్చారని ఆశాఖ వాణిజ్య ఇన్‌స్పెక్టర్‌ అతిశయ తెలిపారు. పీఆర్‌ఎస్‌ కౌంటర్‌ల్లో ఆఫ్‌లైన్‌లో టికెట్‌ తీసుకునే వారి కోసం ఈ విధానం మంగళవారం నుంచి అమల్లోకి వస్తుందన్నారు. గతంలో ఆన్‌లైన్‌ టికెట్‌ తీసుకునే వారికి ఈ విధానం ఇప్పటికే అమల్లో ఉందని గుర్తుచేశారు. కిలోమీటర్‌కు 0.45 పైసలు చొప్పున ఇన్సూరెన్స్‌ చార్జీలు పడుతుందన్నారు. ఒకవేళ ప్రయాణంలో మరణిస్తే రూ.10 లక్షలు, పూర్తి అంగవైకల్యానికి రూ.10 లక్షలు, పాక్షిక వైకల్యానికి రూ.10 లక్షలు, గాయాలకు రూ.2 లక్షలు, మృత ఆవశేషాల రవాణాకు రూ.10 వేలు ఇవ్వనున్నారని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement