పలమనేరు: స్థానిక ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతుందనే భయంతోనే దాడుల దిగుతూ, పోలీసుల ద్వారా అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేగౌడ మండిపడ్డారు. పలమనేరు పట్టణంలోని డాక్టర్ సునీల్ నివాసంలో పూతలపట్టు నాయకులతో కలిసి సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏపీలో ఎన్నికలపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నా కూటమికి బుద్ధి రాలేదన్నారు. నేషనల్ మీడియా సైతం ఏపీలో టీడీపీ దాడులపై విస్మయం వ్యక్తం చేస్తోందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మీరేమన్నా అభివృద్ధి చేసుంటే ధైర్యంగా జనం వద్దకెళ్లి ఓటు అడగాలేగానీ ఇలా బెదిరింపులు, దౌర్జన్యాలు సరికాదన్నారు. ఇప్పటికై నా ఎన్నికలు జరిగే సమయంలో కేంద్ర బలగాల ద్వారా బందోబస్తు పెట్టాలని డిమాండ్ చేశారు.
మాపేనే దాడలు.. మాకే నిర్బంధాలు
పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్‌కుమార్ మాట్లాడుతూ ఆదివారం రాత్రి పదిగంటల సమయంలో పోలీసులు తనకు నోటీసు ఇచ్చారన్నారు. నామినేషన్ల విత్‌డ్రా ముగిసేదాక తాను పూతలపట్టు నియోజకవర్గంలోకి వెళ్ళరాదంటూ హౌస్ అరెస్ట్ చేయడం న్యాయమేనా అని ప్రశ్నించారు. శాంతిభద్రతలకు విఘాతం కల్పించే కూటమి నేతలను వదిలేసి తనను నిర్బంధిస్తే ప్రయోజనం ఏంటన్నారు. నామినేషనన్ల సందర్భంగా యాదమరి మండలంలో దాము అనే వ్యక్తిపై టీడీపీ రౌడీలు కన్నుపోయేలా దాడి చేశారన్నారు. పూతలపట్టు మండలం రవి అనే రిటైర్డ్ హెచ్‌ఎంపై దాడి జరిగిందని, తవణంపల్లి మండలంలో శంకర్ అనే వ్యక్తికి 30 కుట్లు పడ్డాయని ప్రస్తుతం ఇతను సీఎంసీలో చికిత్సపొందుతున్నారని తెలిపారు. ఇందుకు కారణమైన నిందితులను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. తమ వాళ్లపై దాడులు చేసిన వారిని పట్టించుకోకుండా తమనే నిర్భందించడం ప్రజాసామ్యానికే అవమానమన్నారు. నిజంగా ఎన్నికలు జరిగితే టీడీపీకి చిత్తుగా ఓడిపోవడం ఖాయమన్నారు. మాజీ ఎమ్మెల్యే లలితకుమారి మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షసపాలన సాగుతోందన్నారు. అసలు కూటమిలోని భాగస్వామి అయిన జనసేన వారికే టీడీపీ నుంచి ఇబ్బందులు తప్పలేదన్నారు. రాష్ట్ర చరిత్రలో ఇంతటి ఘోరమైన, దౌర్భాగ్యమైన స్థానిక ఎన్నికలు ఎప్పుడూ లేదన్నారు. కార్యక్రమంలో పూతలపట్టు నేతలు కుమారరాజ, రామచంద్ర, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.


