ఎన్నికల బరిలో అరాచకాలు | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల బరిలో అరాచకాలు

Oct 27 2026 1:50 AM | Updated on Oct 27 2026 1:50 AM

వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్లకు అడ్డంకులు 39 మంది వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థుల అడ్డగింత దాడులు చేసి, నామినేషన్‌ పత్రాలు చించివేసిన టీడీపీ రౌడీలు ఏ మాత్రం పట్టించుకోని ఆర్‌వోలు, పోలీసులు జిల్లా ఎన్నికల అధికారికి వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేగౌడ ఫిర్యాదు

చిత్తూరు కలెక్టరేట్‌ : చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో బరిలో ఉండే వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థులపై అరాచకాలు సృష్టించి, నామినేషన్లు దాఖలు చేయనివ్వలేదని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేగౌడ అన్నారు. సోమవారం ఆయన, వైఎస్సార్‌సీపీ నాయకులు జిల్లా ఎన్నికల అధికారి సుమిత్‌ కుమార్‌ను కలిసి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలు పరాకాష్టకు చేరాయని విమర్శించారు. జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీకి చెందిన 39 మంది (పులిచెర్ల మండలంలో 23, రామకుప్పంలో 16 మంది) ఎంపీటీసీ అభ్యర్థులను నామినేషన్లు వేయనివ్వకుండా టీడీపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

పుంగనూరు, కుప్పం నియోజకవర్గాల్లో వికృత రూపం

పుంగనూరు, కుప్పం నియోజకవర్గాల్లోని ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియలో టీడీపీ నాయకులు వికృత రూపం దాల్చి అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. ఈ నెల 21 వ తేదీ నుంచి 23 వ తేదీ వరకు జరిగిన ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియలో తమ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేసి అడ్డుకున్నారన్నారు. పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలంలోని దేవలంపేట, తదితర ఎంపీటీసీ స్థానాల్లో పోటీ చేయాల్సిన 23 మంది వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై దాడులకు పాల్పడ్డారన్నారు. అభ్యర్థుల చేతుల్లోని నామినేషన్‌ పత్రాలను లాక్కొని దారుణంగా చించివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం ననియాలతాండా, బల్ల, బందార్లపల్లి, గొరివిమాకుపల్లి, కెంచనబల్ల, కొంగనపల్లి, మానెండ్రం, ముద్దనపల్లి, పాండ్యాలమడుగు, రామకుప్పం1,2, సింగసముద్రం, ఉణిసిగానిపల్లి, వీర్నమాల, విజాలపురం ఎంపీటీసీ స్థానాల్లో 16 మంది అభ్యర్థులను అడ్డుకున్నారన్నారు. నామినేషన్‌ కేంద్రాలకు వెళ్లనివ్వకుండా డాడులు చేశారని చెప్పారు.

నామినేషన్‌ కేంద్రాల వద్ద రక్షణ కల్పించాల్సిన పోలీసు వ్యవస్థ ప్రేక్షకపాత్ర వహించడం దారుణమని మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ మండిపడ్డారు. పులిచెర్ల, రామకుప్పం మండలాల్లో అభ్యర్థులపై బహిరంగంగా దాడులు జరుగుతున్నా, పత్రాలు చించివేస్తున్నా పోలీసులు ఏమాత్రం స్పందించకుండా ప్రేక్షక పాత్ర వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈ నెల 23వ తేదీ సాయంత్రం 5 గంటల గడువు ముగిసే సమయానికి సదరు 39 మంది అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేయలేక తమ రాజ్యాంగబద్ధమైన పోటీ చేసే హక్కును కోల్పోయారన్నారు. ఈ ఘటనలను క్షుణ్ణంగా విచారించి న్యాయం చేయాలన్నారు. ఈ ఫిర్యాదును రాష్ట్ర ఎన్నికల సంఘానికి సైతం సమర్పిస్తున్నట్లు తెలిపారు. 39 మంది అభ్యర్థులు తిరిగి నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు. బాధిత అభ్యర్థులందరికీ న్యాయం జరిగేలా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేలా తగిన చర్యలు తీసుకోకపోతే చట్టబద్ధంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ ఫిర్యాదుపై జిల్లా ఎన్నికల అధికారి స్పందిస్తూ విచారణ చేస్తామని తెలిపారు. ఆయన వెంట వైఎస్సార్‌సీపీ ఉద్యోగుల, పెన్షనర్ల విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయసింహారెడ్డి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement