ఏకగ్రీవం.. ఏకపక్షం | - | Sakshi
Sakshi News home page

ఏకగ్రీవం.. ఏకపక్షం

Oct 23 2026 1:57 AM | Updated on Oct 23 2026 1:57 AM

క్యాంపులోనే వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, ప్రతిపాదకులు అయినా ఆర్వోలకు విత్‌డ్రా లేఖలు స్వతంత్రులు, కమ్యూనిస్టు అభ్యర్థుల సంతకాలు ఫోర్జరీ ఆర్వోలకు అన్నీ తెలిసినా మౌనం చిత్తూరు కార్పొరేషన్‌లో 51 ఏకగ్రీవాల్లో 47 టీడీపీవే ఆర్వోలకు నోటీసులు జారీ చేసిన కలెక్టర్‌

సాక్షి, చిత్తూరు: సాధారణంగా ఎన్నికల్లో 20 శాతం ఏకగ్రీవాలైతే మామూలే అనుకుంటారు. 30 శాతమైతే ఎలా జరిగింది అని ఆలోచిస్తారు. అదే 50 శాతం స్థానాలైతే ఏదో జరిగిందనే అనుమానాలు తలెత్తుతాయి. చిత్తూరు మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఏకంగా 90 శాతం స్థానాలు ఏకగ్రీమైపోయాయి. ఇది ఏమాత్రం సమ్మశక్యంకాని విషయం. ఏకగ్రీవాల్లో ఎలాంటి నిబంధనలు పాటించారు? ఉపసంహరణ పత్రాలు ఎవరు అందజేశారు? అసలు ఏమి జరిగిందో రాతపూర్వక వివరణ ఇవ్వాలంటూ జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌గాంధీ 15 మంది ఆర్వోలకు నోటీసులు జారీ చేశారు.

జరిగింది ఇదేనా..?

చిత్తూరు కార్పొరేషన్‌లోని 60 డివిజన్లకు 606 నామినేషన్లు దాఖలయ్యాయి. అధికారులు ప్రకటించిన తుది బరిలో 47 మంది అభ్యర్థులు తొమ్మిది డివిజన్లలో పోటీ పడుతున్నారు. అంటే నాలుగు గంటల్లో 559 నామినేషన్లు ఉపసంహరించుకున్నారని అధికారులు ప్రకటించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నామినేషన్లు దాఖలు చేయడానికి ఆఖరి రోజైన గత ఆదివారం నాడు చిత్తూరులోని 15 కేంద్రాల్లో టీడీపీ నేతలు చొరబడ్డారు.

అక్కడున్న నామినేషన్ల దరఖాస్తులో తొలి పేజీని ఫొటోలు తీసుకున్నారు. ఇలా అన్ని కేంద్రాల్లో ఫొటోలు తీసుకున్న టీడీపీ నాయకులు, బెంగళూరు నుంచి చేతిరాత నిపుణులు ముగ్గురిని చిత్తూరు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. విత్‌డ్రా ఫారాలను తీసుకుని కొన్నింటిలో అభ్యర్థులను పోలిన సంతకాలు, మరికొన్ని ఫారాల్లో ప్రతిపాదకులు చేసినట్లు సంతకాలు పెట్టేసినట్లు సమాచారం. వీటిని బుధవారం సాయంత్రం కార్పొరేషన్‌ కార్యాలయంలోని ఆర్వోలకు అందజేసినట్లు తెలిసింది. విత్‌డ్రా ఫారాలు అందజేసిన వాళ్లు ఎవరు? ఎక్కడ ఉన్నారు? కారణం ఏమిటి? గుర్తింపు కార్డులు ఇచ్చారా? వీడియో రికార్డింగులు ఏమైనా ఉన్నాయా? తదితరాలు ఏమీ లేకుండానే నామినేషన్లను విత్‌ డ్రా చేసుకున్నట్టు తెలిపి 51 మంది ఏకగ్రీవమైనట్లు ప్రకటించేశారు. కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ గాంధీ దీనిపై విచారణకు ఆదేశించారు. 24 గంటల్లో ఆర్వోలు రాత పూర్వక నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. గురువారం వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు చిత్తూరు కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుట కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. అనంతరం సహాయ కమిషనర్‌ ప్రసాద్‌కు వినతి పత్రం అందజేశారు. తమ సంతకాలను ఫోర్జరీ చేసిన వాళ్లను అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

ఏ ధైర్యంతో ఇలా..?

పోటీలో ఉన్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల్లో కొందరు తమిళనాడులోని ఏలగిరి, మరికొందరు తిరుచందూరులో, మరో 200 కి.మీ దూరం అవతల ఇంకొందరు ఉన్నారు. అదెలాగో తెలియడంలేదు కానీ చిత్తూరు మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల విధుల్లో ఉన్న ఆర్వోలకు అభ్యర్థులు రాకుండానే, ప్రతిపాదకులను చూడకుండానే విత్‌డ్రా లేఖలు అందాయి. ఇంకేముంది.. చిత్తూరు మునిసిపల్‌ కార్పొరేషన్‌లో 51 మంది కార్పొరేటర్లు ఏకగ్రీవంగా గెలిచినట్లు ప్రకటించేశారు. వారిలో టీడీపీ కార్పొరేటర్లు 47 మంది, జనసేన నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఒకరు ఉన్నారు. ఇంతమంది ఒకేచోట ఏకగ్రీవంగా గెలిచారని ప్రకటించడానికి చాలా గుండె ధైర్యం ఉండాలి. ఎందుకంటే ఎక్కడైనా ఇదంతా తప్పనితేలితే.. జిల్లా ఎన్నికల అధికారి, ఎన్నికల సంఘం, క్రిమినల్‌ కేసులు.. ఇలా చాలా వ్యవహారం ఉంటుంది. ఈ వ్యవహారంలో నిజం చెప్పి అధికారులు తమను తాము కాపాడుకోవాలి తప్ప, ఏ ఒక్క గాడ్‌ఫాదర్‌ పట్టించుకోరన్నది సుస్పష్టం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement