చిత్తూరు కార్పొరేషన్/పలమనేరు: స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతవరణంలో స్వేచ్ఛగా నిర్వహించే దమ్ము ప్రభుత్వానికి లేదని వైఎస్సార్ సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ ఆరోపించారు. పోటీ చేసి గెలవలేకనే అరాచకాలు సృష్టించి వైఎస్సార్సీపీ అభ్యర్థులను నామినేషన్ వేయకుండా అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. ఆయన గురువారం జెడ్పీ కార్యాలయంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్కు వినతి పత్రం అందజేసి మీడియాతో మాట్లాడారు. చిత్తూరు కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ నాయకులు దౌర్జన్యం చేసి ఏకగ్రీవంగా గెలిచినట్లు ప్రకటించుకోవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనన్నారు. కార్పొరేషన్ కార్యాలయంలో తిష్టవేసి వైఎస్సార్ సీపీ అభ్యర్థుల బీఫారాలను చింపివేసి అరాచకం సృష్టించారని తెలిపారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ వేయడానికి వచ్చిన అభ్యర్థుల నామినేషన్ పత్రాలను చింపివేయడంతోపాటు దాడులు చేసి గాయపరిచారని పేర్కొన్నారు. బుధవారం జెడ్పీ కార్యాలయ సమీపంలో మాజీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామిపై దాడి చేశారని గుర్తు చేశారు. మండలంలో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలన్నారు. పోలీసులు అడుగడుగునా వైఫల్యమయ్యారని వాపోయారు. పలమనేరు మున్సిపాలిటీలోని 6 వార్డులు తమ పార్టీ అభ్యర్థులు వేసిన నామినేషన్లను అక్రమంగా రిజెక్ట్ చేశారని, విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. తొలుత కలెక్టర్కు జెడ్పీటీసీ, ఎంపీటీసీల స్థానాల పరంగా ఏ ఫాంలను అందజేశామని తెలిపారు. వైఎస్సార్సీపీ ఉద్యోగ, పెన్షన్లర విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయసింహారెడ్డి పాల్గొన్నారు.


