చిత్తూరు కార్పొరేషన్: స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల చోరీతో చిత్తూరు ఎమ్మెల్యే అక్రమాలు రావణాసురుడిని మించిపోయాయని వైఎస్సార్ సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి ఆరోపించారు. ఆయన గురువారం వైఎస్సార్ సీపీ చిత్తూరు కార్పొరేటర్ అభ్యర్థులతో కలిసి కళ్లకు గంతలు కట్టుకుని చిత్తూరులో గాంధీవిగ్రహం వద్ద నిరసన తెలిపారు. విజయానందరెడ్డి మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు కోసం ఓట్లు చోరీ చేశారని విమర్శించారు. అందుకు నిదర్శనం బుధవారం కార్పొరేటర్ అభ్యర్థుల స్థానాలను దౌర్జన్యంతో ఏకగ్రీవం చేసుకోవడమేనన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి చిత్తూరు ఎమ్మెల్యే అధికారుల అండతో రిజర్వేషన్లు మార్చారని పేర్కొన్నారు. తదుపరి కార్పొరేటర్ స్థానం కోసం రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు డబ్బు తీసుకుని మళ్లీ రిజర్వేషన్ మార్పు చేశారని తెలిపారు. నామినేషన్ వేయడానికి వెళ్లిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల మీద భౌతికదాడులు చేశారని తెలిపారు. పరిశీలన రోజు కూడా దౌర్జన్యం చేశారని గుర్తుచేశారు. నామినేషన్ల ఉపసంహరణ రోజు ఎమ్మెల్యే ఆగడాలు తారస్థాయికి చేరాయన్నారు. అది ముందుగానే ఊహించి తాము తమ పార్టీ అభ్యర్థులను తమిళనాడులో భద్రపరిచి వారితో వీడియో తీయించి కలెక్టర్‌కు పంపించామని తెలిపారు. కార్పొరేషన్ కార్యాలయంలో 200 మంది రౌడీ మూకలు మాస్కులు వేసుకుని బీఫాం చింపేశారని పేర్కొన్నారు. సలహా కోసం వచ్చిన న్యాయ విభాగం రాష్ట్ర కార్యదర్శి సుగుణశేఖర్‌రెడ్డిపై దాడి చేశారన్నారు. ఈ ఘటనలో పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారన్నారు. కార్యక్రమంలో నాయకులు గాయత్రీదేవి, జ్ఞాన జగదీశ్, రాహుల్ రెడ్డి, లీనా రెడ్డి, కేపీ శ్రీధర్, ప్రకాష్, సూర్యప్రతాప్‌రెడ్డి, చక్రి, మురళి, చందు, అంజలిరెడ్డి, భాగ్యలక్ష్మి, హరీషారెడ్డి, మధురెడ్డి, ఆను, అన్బు, మనోజ్ రెడ్డి, రూపేష్, ఆల్తాఫ్, వెంకటేష్, సెల్వ, ఇమ్రాన్ పాల్గొన్నారు


