కార్వేటినగరం: ఓటమి భయంతోనే కూటమి ప్రభు త్వం తమను హౌస్ అరెస్టు చేయించిందని వైఎస్సార్ సీపీ జీడీనెల్లూరు సమన్వయకర్త కృపాలక్ష్మి, మాజీ ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి ఆరోపించారు. వారు గురువారం తమ స్వగృహంలో మీడియాతో మాట్లాడారు. మనం భారత దేశంలో ఉన్నామా.. లేక పాకిస్తాన్‌లో ఉన్నామా అన్నది అర్థం కావడం లేదన్నారు. వైఎస్సార్ సీపీ నాయకుల పట్ల కూటమి ప్రభుత్వం దారుణంగా వ్యహరిస్తోందని వాపోయారు. తాను ఒక మాజీ డిప్యూటీ సీఎంగా జెడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్ కేంద్రానికి వెళితే అక్కడ టీడీపీ గుండాలు వ్యవహరించిన తీరు భయభ్రాంతులకు గురిచేసిందన్నారు. కారును అడ్డుకోవడమే కాకుండా అద్దాలు పగులగొట్టి ధ్వంసం చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదన్నారు. దాడులు చేసిన కూటమి నాయకులు ఫిర్యాదు ఇస్తే తనను హౌస్ అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థులు నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారని, పోలీసులు కూడా టీడీపీ గుండాలకే అండగా నిలుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తమిళనాడు నుంచి సుమారు 500 మంది గంజాయి బ్యాచ్‌లను తీసుకొచ్చి దాడులు చేయిస్తున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని ఆరోపించారు. మాపై దాడులు చేసిందే కాకుండా మాకు నోటీసులు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రోడ్డుపై ఉన్న వైఎస్సార్ సీపీ కార్యకర్తలను చెదరగొట్టారని, ఎంపీడీవో కార్యాలయం చుట్టూ, ఆవరణంలో వందల మంది తమిళ రౌడీలు తిరుగుతున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయని, చట్టాన్ని రక్షించాల్సిన పోలీసు అధికారులు వారికి దాసోహం కావడం తగదన్నారు. ఇది ఒక పవిత్రమైన ఖాకీ యూనిఫామ్‌కే సిగ్గుచేటన్నారు.


