నగరి : మున్సిపల్ పరిధి ఏకాంబరకుప్పం రైల్వేట్రాక్ సమీపంలో ఉన్న మర్రిచెట్టు కింద గురువారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న నగరి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మల్లికార్జునరావు అక్కడికి చేరుకుని పరిశీలించారు. స్థానికులను విచారించగా అతను తమిళనాడు తిరుత్తణి పరసర ప్రాంతాల్లో భిక్షమెత్తుకుంటూ ఉండగా చూసినట్లు తెలిసిందన్నారు. మృతదేహాన్ని నగరి ఏరియా ఆస్పత్రిలోని మార్చురీలో ఉంచామని, అతన్ని గుర్తించిన వారు తమను సంప్రదించి మృతదేహాన్ని తీసుకెళ్లవచ్చని తెలిపారు.
రైలు నుంచి జారిపడి
వ్యక్తి దుర్మరణం
కుప్పం రూరల్ : కుప్పం రైల్వేస్టేషన్‌లో గురువారం రైలు నుంచి జారిపడి వ్యక్తి దుర్మరణం చెందాడు. రైల్వే పోలీసుల కథనం మేరకు.. బెంగళూరు పట్టణానికి చెందిన సురేష్‌కుమార్ చౌహాన్ (50) భార్య, కుమార్తెతో కలిసి గురువారం మధ్యాహ్నం చైన్నెలో జరిగే బంధువులు పెళ్లి కోసం డబుల్ డక్కర్ రైలు ఎక్కాడు. దాహం వేయడంతో బాటర్ బాటిల్ కోసం సురేష్‌కుమార్ చౌహాన్ కుప్పం రైల్వే స్టేషన్‌లో దిగాడు. బాటిల్ తీసుకుని వచ్చేసరికి బండి కదిలింది. నడిచే రైలు ఎక్కేందుకు ప్రయత్నించగా కాలు జారి కింద పడ్డాడు. అతనిపై రైలు చక్రాలు ఎక్కిదిగడంతో శరీరం నుజ్జునుజ్జు అయి దుర్మరణం చెందాడు. మృతదేహాన్ని రైల్వే పోలీసులు కుప్పం ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
టీడీపీ నుంచి
వైఎస్సార్ సీపీలో చేరిక
గంగవరం: మండలంలోని గండ్రాజుపల్లి పంచాయతీ పెద్దఉగిణి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు సలీం గురువారం వైఎస్సార్ సీపీలో చేరారు. ఆయనకు వైఎస్సార్ సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకటేగౌడ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. సలీం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మోసాలు నచ్చక ఆ పార్టీని వీడి వైఎస్సార్ సీపీలో చేరినట్టు తెలిపారు. ఈ ఎన్నికల్లో పంచాయతీలో వైఎస్సార్ సీపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తానన్నారు. పార్టీ నాయకులు రాధాక్రిష్ణ, కిషోర్‌నాయుడు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
తాళం పగులగొట్టి
రూ.10 లక్షల బంగారం చోరీ
పూతలపట్టు(యాదమరి): పొలం పనులకు వెళ్లిన ఓ రైతు ఇంటిలో దొంగలు భారీ చోరీకి పాల్పడ్డారు. పోలీసుల కథనం మేరకు.. పూతలపట్టు మండలం కరిణిపల్లికి చెందిన చంద్రారెడ్డి గురువారం తన ఇంటికి తాళం వేసుకుని కుటుంబ సభ్యులతో కలిసి పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లాడు. అదును కోసం వేచి ఉన్న దుండగులు వారు వెళ్లగానే ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి చొరబడ్డారు. బీరువాలో ఉన్న సుమారు రూ.10 లక్షల విలువైన బంగారు నగలు, రూ.3 వేల నగదును చోరీ చేశారు. పొలం నుంచి ఇంటికి చేరుకున్న బాధితులు ఇంటి తలుపులు తెరిచి ఉండడాన్ని చూసి లోపల పరిశీలించగా బంగారు నగలు చోరీకి గురైనట్టు గుర్తించారు. వెంటనే పూతలపట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ గుండాల దాడి
తవణంపల్లె: తవణంపల్లెలో ఎంపీటీసీ నామినేషన్లు దాఖలు చేయడానికి వచ్చిన వైఎస్సార్ సీపీ అభ్యర్థులపై టీడీపీ గుండాలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. స్థానికుల కథనం మేరకు.. ఎగువమత్యం ఎంపీటీసీ సెగ్మంట్‌కు నామినేషన్ వేయడానికి వచ్చిన పూర్ణచంద్ర మిద్దైపె టీడీపీ గుండాల ఆగడాలను చిత్రీకరిస్తున్నాడు. దీన్ని గమనించిన టీడీపీ రౌడీలు అతనిపై దాడి చేశారు. ప్లాస్టిక్ కుర్చీలతో చితకబాదారు. అతని తలపై బలమైన గాయం కావడంతో తీవ్ర రక్తస్రావమైంది. గాయపడ పూర్ణచంద్రను కుటుంబ సభ్యులు అపోలో హాస్పిటల్‌కు తరలించి చికిత్స చేయించారు. అదేవిధంగా ఎగువతడకర సెగ్మెంట్ ఎంపీటీసీ అభ్యర్థిగా జొన్నగురుకుల రేవతి, ఆమెను ప్రతిపాదించడానికి శేఖర్ నామినేషన్ కేంద్రానికి వచ్చారు. టీడీపీకి చెందిన రౌడీలు వారిని అడ్డుకున్నారు. రేవతి నామినేషన్ల పత్రాలను లాక్కోవడానికి ప్రయత్నించారు. సెల్‌ఫోన్ తస్కరించి, శేఖర్‌పై దాడి చేశారు. టీడీపీ నాయకుల అరాచకాలు తీవ్రస్థాయికి చేరాయి. మూడో రోజు నామినేషన్లు వేయడానికి ఆఖరు అని, పోలీసులు టీడీపీ గుండాలను కట్టడి చేయకపోతే పరిస్థితి దారుణంగా ఉంటుందని ప్రజలు వాపోతున్నారు.


