నామినేషన్ల పరిశీలనను ప్రహసనంగా మార్చిన టీడీపీ నేతలు | - | Sakshi
Sakshi News home page

నామినేషన్ల పరిశీలనను ప్రహసనంగా మార్చిన టీడీపీ నేతలు

Oct 20 2026 4:25 AM | Updated on Oct 20 2026 4:25 AM

● కుప్పంలో వైఎస్సార్‌సీపీ దళిత అభ్యర్థి కిడ్నాప్‌ ● నగరిలో ప్రతిపక్ష అభ్యర్థుల దరఖాస్తులను ఏకపక్షంగా తిరస్కరణ ● చిత్తూరులో ఇష్టార్జాంగా దాడులు.. నామినేషన్ల అపహరణ ● రాత్రి 9 గంటలైనా.. అర్హుల జాబితా ప్రకటించని రిటర్నింగ్‌ అధికారులు ● ఏకగ్రీవం చేసుకోవడమే లక్ష్యంగా అక్రమాలు ● ప్రేక్షకపాత్ర వహించిన పోలీసులు ● నగరిలో చైర్మన్‌ అభ్యర్థిగా పదిసెట్ల నామినేషన్లను ఆర్‌ఓ ఏకపక్షంగా తిరస్కరించారు. బాలకృష్ణతో పాటు రమేష్‌రెడ్డి, వెంకటరత్నం నామినేషన్లు చెల్లుబాటు అవుతాయని ఉదయం ఫామ్‌–7 ఇచ్చిన అధికారులు.. సాయంత్రానికి టీడీపీ అభ్యర్థి శ్రీనివాస్‌ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు ప్రకటించారు. దీనిపై మాజీ మంత్రి ఆర్‌కే రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి లోకేష్‌ ఆదేశాలతో కమిషనర్‌, ఆర్‌ఓ ఏకపక్షంగా టీడీపీ అభ్యర్థిని గెలిపించారని మండిపడ్డారు. అధికార పార్టీకి ఇంత కంటే దౌర్భాగ్యం ఉండదని విమర్శించారు.

● కుప్పంలో వైఎస్సార్‌సీపీ దళిత అభ్యర్థి కిడ్నాప్‌ ● నగరిలో ప్రతిపక్ష అభ్యర్థుల దరఖాస్తులను ఏకపక్షంగా తిరస్కరణ ● చిత్తూరులో ఇష్టార్జాంగా దాడులు.. నామినేషన్ల అపహరణ ● రాత్రి 9 గంటలైనా.. అర్హుల జాబితా ప్రకటించని రిటర్నింగ్‌ అధికారులు ● ఏకగ్రీవం చేసుకోవడమే లక్ష్యంగా అక్రమాలు ● ప్రేక్షకపాత్ర వహించిన పోలీసులు

చిత్తూరు నగరంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త సయ్యద్‌పై మూకుమ్మడిగా దాడిచేస్తున్న టీడీపీ గుండాలు

ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాల్సిన ఎన్నికలను టీడీపీ అపహాస్యం చేసింది. ప్రజలు ఓట్లు వేసి, సిరా చుక్కపెట్టుకుని ఇవ్వాల్సిన తీర్పును.. రక్తపుటేర్లతో పచ్చమూక బలవంతంగా లాగేసుకుంటోంది. మున్సిపల్‌ ఎన్నికల వేళ జిల్లాలో నామినేషన్ల పరిశీలన ఘట్టం ఓ యుద్ధాన్ని తలపించింది. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా దాడులు చేసి అధికార పార్టీ అరాచకానికి పాల్పడింది. ఈ క్రమంలో పోలీసు, అధికార యంత్రాగం మౌనంగా చోద్యం చూస్తూ నిలబడింది.

సాక్షి, చిత్తూరు : నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ఏకపక్షంగా సాగింది. టీడీపీ నేతల స్వైరవిహారంతో ప్రజాస్వామ్యం కుదేలైంది. వైఎస్సార్‌సీపీ నేతలు, అభ్యర్థులే టార్గెట్‌గా పచ్చమూక రెచ్చిపోయింది. దాడులు, కిడ్నాప్‌లతో ప్రజలను భయాందోళనకు గురిచేసింది.

కుప్పంలో మొదలు..

జిల్లాలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ సోమవారం ప్రారంభంకాగానే కుప్పంలో హింసాకాండకు టీడీపీ నేతలు తెరతీశారు. వైఎస్సార్‌సీపీ చైర్మన్‌ అభ్యర్థి విజయ్‌, ఎమ్మెల్సీ భరత్‌ ఇంటి వద్ద ఉండగా ఒక్కసారిగా పదుల సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. విజయ్‌ను కిడ్నాప్‌చేసి, కారులో తీసుకెళ్లిపోయారు. అడ్డొచ్చిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు రాజ్‌కుమార్‌, జయశంకర్‌, హఫీజ్‌ను రక్తం వచ్చేలా చావబాదారు. ఈ వ్యవహారాన్ని మొబైల్‌లో చిత్రీకరిస్తున్న సాక్షి రిపోర్టర్‌ వెంకటాచలంపై దాడికి యత్నించారు. అతడి చేతిలోని సెల్‌ఫోన్‌ లాక్కుని పగులగొట్టారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ కనుసన్నల్లో జరిగిన ఈ దౌర్జన్యకాండలో పోలీసులు కౌరవసైన్యం వైపు నిలిచి ప్రేక్షకపాత్ర పోషించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ భరత్‌ ఈ మేరకు టీడీపీ నేతల అరాచకాలను ఫోన్‌లో ఎస్పీ తుషార్‌ డూడీ దృష్టికి తీసుకెళ్లారు. ఎస్పీ చెప్పినా సరే విజయ్‌ను మాత్రం టీడీపీ మూకలు వదల్లేదు. వాస్తవానికి దళిత అభ్యర్థి విజయ్‌ను అపహరించి, దాడి చేసినందుకు అట్రాసిటీ కేసు పెట్టాలి. కానీ, పోలీసులు ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదు.

అన్ని చోట్ల అమలు..

చిత్తూరు కార్పొరేషన్‌లోని సత్యనారాయణపురం నామినేషన్‌ కేంద్రంలో 14వ డివిజన్‌ టీడీపీ అభ్యర్థి లక్ష్మీ నామినేషన్‌ తిరస్కరణకు గురైంది. ఇక్కడ, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అంజలిరెడ్డి నామినేషన్‌ను ఆమోదించారు. దీంతో ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్‌ నాయుడు అనుచరులు కుమార్‌, నాయుడుతో పాటు బెంగళూరు నుంచి వచ్చిన రౌడీ మూకలు వైఎస్సార్‌సీపీ మైనారిటీ నాయకుడు సయ్యద్‌ బాషాను కాళ్లతో తన్నుతూ, బండరాయితో తలపై మోది రక్తం వచ్చేలా కొట్టారు. పోలీసులు లాఠీలకు పనిచెప్పకపోతే సయ్యద్‌ను చంపేసేవారు. అంతటితో ఆగకుండా కొంగారెడ్డిపల్లెలోని బాపూజీనగర్‌ నామినేషన్‌ కేంద్రంలో వైఎస్సార్‌సీపీ దరఖాస్తుల్లోని పలు పత్రాలను టీడీపీ నేతలు తీసుకెళ్లిపోయారు. అడ్డొచ్చిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మురళీని చావబాదారు. అక్కడ విధుల్లో ఉన్న యాదమరి ఎస్‌ఐ ఈశ్వర్‌, గుడిపాల ఎస్‌ఐ రామ్మోహన్‌ సమక్షంలో ఇదంతా జరిగిందని ఎస్పీ తుషార్‌డూడీకు వైఎస్సార్‌సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగని పచ్చమూక ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంపై రాళ్లు రువ్వింది.

తేలని చీకటి లెక్కలు

చిత్తూరు కార్పొరేషన్‌తో పాటు నగరి, పలమనేరు మున్సిపాలిటీల్లో రాత్రి 9 గంటలైనా కూడా నామినేషన్ల పరిశీలన అనంతరం అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను ఆర్‌ఓలు బయటపెట్టలేదు. మధ్యాహ్నం మూడు గంటలకే పరిశీలన ప్రక్రియ మొత్తం పూర్తయినా, టీడీపీ నేతల ఆదేశాలతో చీకటి పడ్డా కూడా అధికారులు కాలయాపన చేస్తూ వచ్చారు. చిత్తూరు కార్పొరేషన్‌, నగరి ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లు ఆమోదించినట్లు ఫామ్‌–7 జారీ చేసిన రిటర్నింగ్‌ అధికారులు.. పరిశీలన అనంతరం పలువురు అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటు కాలేదని ప్రకటించారు. ఈ క్రమంలో ఎన్నికలే నిర్వహించకుండా పలు మున్సిపాలిటీలను ఏకగ్రీవం చేసుకోవడమే ఈ ప్రణాళిక ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

పలమనేరు మున్సిపల్‌ కార్యాలయం వద్ద తనకు జరిగిన అన్యాయంపై సొమ్మసిల్లి కిందపడిపోయిన వైఎస్సార్‌సీపీ మైనారిటీ నేత రహీంఖాన్‌

కుప్పంలో టెన్షన్‌ టెన్షన్‌

కుప్పం : నామినేషన్ల పరిశీలన సందర్భంగా సోమవారం కుప్పంలో టీడీపీ శ్రేణుల దాడులు.. దౌర్జన్యాలకు టెన్షన్‌ వాతావరణం ఏర్పడింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 3 గంటల వరకు పట్టణ ప్రజలు వీధిలోకి వచ్చేందుకు సైతం భయపడ్డారు.

తరిమి తరిమి కొట్టారు

నామినేషన్లు పరిశీలనకు ఉదయం 11 గంటలకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, మద్దతుదారులు వెళుతుండగా పచ్చమూక రెచ్చిపోయింది. స్థానిక అంబికా కల్యాణ మండపం నుంచి ప్యాలెస్‌ రోడ్డులోకి వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలను తరిమి తరిమి కొట్టింది. అందులో మహిళలు ఉన్నప్పటికీ కనికరించకుండా దారుణంగా దాడులకు పాల్పడింది. అభ్యర్థుల చేతిలోని సర్టిఫికెట్లను లాక్కుని చించివేసింది. ఈ విషయంలో పట్టణంలో దావాలనంలా వ్యాపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు సైతం భయాందోళన చెందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement