– మాజీ మంత్రి ఆర్కే రోజా
నగరి: నగరి మున్సిపల్ ఎన్నికల్లో సోమవారం నామినేషన్ల పరిశీలన ఏకపక్షంగా సాగింది. టీడీపీ నేతల సేవలో అధికార యంత్రాంగం తరించింది. వైఎస్సార్సీపీ తరఫున చైర్మన్ స్థానానికి వేసిన మొత్తం 17 నామినేషన్లను తిరస్కరించినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఎన్నికల అధికారులతో మాట్లాడేందుకు తన ఇంటి నుంచి బయలు దేరిన మాజీ మంత్రి ఆర్కే రోజాను పోలీసులు ఇనుప కంచెలతో అడ్డుకున్నారు. మాజీ మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్సీపీ బలంగా ఉన్న ప్రతిచోటా టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరిలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులుగా తమ పార్టీ వారు 17 నామినేషన్లు వేస్తే అన్నింటినీ ఎలా తిరస్కరిస్తారని ప్రశ్నించారు. తప్పుడు మార్గంలో ఏకగ్రీవాలు చేసుకునే దానికి ఇక ఎన్నికలు నిర్వహించడం ఎందుకని మండిపడ్డారు. కేజే కుమార్ కుటుంబ సభ్యులు నామినేషన్లు వేసిన వార్డుల్లో తమ పార్టీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలకు చించివేశారని, మహిళలని కూడా చూడకుండా తలలు పగలగొట్టారని ఆరోపించారు.
ఎమ్మెల్యే భాను కనుసన్నల్లోనే దాడులు
నిండ్ర, వడమాలపేట నుంచి ఎమ్మెల్యే భానుప్రకాష్ రౌడీలను తీసుకువచ్చి వైఎస్సార్ సీపీ అభ్యర్థులపై దాడులు చేయించారని ఆరోపించారు. తన కారు డ్రైవర్ను పంపించి పుత్తూరు వైఎస్సార్ సీపీ చైర్మన్ అభ్యర్థి చేతిలోని నామినేషన్ పేపర్లను చించివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పచ్చమూక రౌడీయిజం చేస్తున్నా పోలీసులు, ఎన్నికల అధికారులు సైతం వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. టీడీపీకి తాబేదారులుగా వ్యవహరించిన ప్రతి అధికారీ సమాధానం చెప్పే రోజు వస్తుందని హెచ్చరించారు.
అవకతవకగా పరిశీలన
జనసేనపుత్తూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఏలుమలై వేసిన రెండు సెట్ల నామినేషన్లతో పాటు టీడీపీ తరఫున వేసిన మరో నామినేషన్ సైతం తిరస్కరణకు గురైందని మాజీ మంత్రి రోజా తెలిపారు. వాటికి సంబంధించిన వీడియోలు తమ వద్ద ఉన్నాయని చెప్పారు. అయితే అధికారులు అవకతవకలకు పాల్పడి, అధికార పార్టీ ఒత్తిడికి లొంగి గంట తర్వాత ఏలుమలై నామినేషన్ను ఆమోదించారని ఆరోపించారు.


