21 నుంచి 23వ తేదీ వరకు
నామినేషన్ల స్వీకరణ
నవంబర్ 3న ఓటింగ్,
5వ తేదీన కౌంటింగ్
చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 21 నుంచి 23వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, నవంబర్ 3వ తేదీన ఎన్నికలు, 5న ఫలితాలు వెల్లడించనున్నట్లు పేర్కొంది. దీంతో పరిషత్ పోరుకు రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు.
27 జెడ్పీటీసీ, 370 ఎంపీటీసీ స్థానాలు
జెడ్పీటీసీ అభ్యర్థులు జెడ్పీ కార్యాలయంలో, ఎంపీటీసీ అభ్యర్థులు ఎంపీడీఓ కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంపీటీసీ సభ్యులు మండల పరిషత్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసే కేంద్రాల్లో తమ నామినేషన్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఎంపీటీసీ ఎన్నికలకు మండల స్థాయిలో నియమించిన రిటర్నింగ్ అధికారులు ఈ ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. జిల్లాలో 27 జెడ్పీటీసీలు, 370 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అందుకోసం 1,236 పోలింగ్‌స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఇందులో ఒకే పోలింగ్ కేంద్రం ఉండేవి 573. రెండు పోలింగ్ స్టేషన్స్ ఉండే ప్రాంతాలు 209, మూడు ఉండేవి 38, మూడు కంటే ఎక్కువ ఉండేవి 22 ఉన్నాయి. వీటిటో సమస్యాత్మకమైనవి 366, అత్యంత సమస్యత్మకమైనవి 346గా గుర్తించారు. 2616 బ్యాలెట్‌బాక్స్‌లు సిద్దం చేశారు. జిల్లాలో 12,90,810 జనాభా ఉండగా అందులో పురుష ఓటర్లు 5,07,703, మహిళలు 5,19,091, ఇతరులు 27 మంది ఉన్నారు. నియోజకవర్గాల వారీగా స్ట్రాంగ్ రూమ్స్, కౌంటింగ్ సెంటర్స్‌ను ఎంపిక చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలలు 7 లో వీటిని ఏర్పాటు చేయనున్నారు.
ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల


