బైరెడ్డిపల్లె : స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమైనవారిపై టీడీపీ నేతలు కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. వివరాలు.. బైరెడ్డిపల్లె మండలం కడపతట్లపల్లె నుంచి దేవరబండ వరకు సుమారు 20 కుటుంబాల ప్రజలు వ్యవసాయ బోర్ల వద్ద గృహాలు నిర్మించుకుని అక్కడే జీవనం సాగిస్తున్నారు. దేవరబండ వద్ద నివసిస్తున్న సుబ్రమణ్యం భార్యను వైఎస్సార్ సీపీ తరఫున ఎంపీటీసీ అభ్యర్థిగా ఖరారు చేశారు. దీంతో టీడీపీ నేతలు వెంటనే బెదిరింపులకు దిగారు. అభ్యర్థి భర్త సుబ్రమణ్యానికి ఫోన్ చేసి నామినేషన్ వేయకూడదని ఆదేశించారు. ఆయన లొంగకపోవడంతో వారి ఇంటికి వెళ్లే దారిని జేసీబీతో తవ్వేశారు. 10 ఏళ్ల క్రితం జెడ్పీ నిధులతో వేసిన రోడ్డును టీడీపీ నేతలు దౌర్జన్యంగా తవ్వేశారని దేవరబండ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ కక్షలతో ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదని స్పష్టం చేశారు. ఇలాంటి బెదిరింపులతో ఎన్నికల్లో గెలవలేరని హెచ్చరిస్తున్నారు.


