సిఫార్సులకే అవార్డులు | - | Sakshi
Sakshi News home page

సిఫార్సులకే అవార్డులు

Aug 30 2026 1:51 AM | Updated on Aug 30 2026 1:51 AM

● ఎంపిక ప్రక్రియలో జోక్యం చేసుకుంటున్న నేతలు ● తమకు అన్యాయం చేస్తున్నారంటున్న అర్హులైన టీచర్లు ● కలెక్టర్‌ ప్రత్యేక దృష్టి సారించాలని విన్నపాలు

పక్కదారి పడుతున్న ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు

చిత్తూరు కలెక్టరేట్‌ : ఏటా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అందించే ఉత్తమ పురస్కారాలకు ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా జరగడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా స్థాయి అవార్డులకు 50 మంది, రాష్ట్ర స్థాయి అవార్డులకు 20 మంది దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో అర్హత, విద్యా బోధనలో ప్రతిభ, పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని ప్రామాణికంగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే నాయకుల సిఫార్సు లేఖలు, అధికారుల వద్ద ఉన్న పలుకుబడి ఆధారంగా అవార్డుల జాబితాలు తయారు చేస్తున్నారని పలువురు ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజూ తరగతి గదిలో కష్టపడి బోధించే వారిని విస్మరించి, నిరంతరం ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగే వారికే ప్రాధాన్యత లభిస్తోందనే ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు, కేటాయించిన పాయింట్ల విధానం కేవలం కాగితాలకే పరిమితమవుతోందని సమాచారం. క్షేత్రస్థాయి పరిశీలనలు మొక్కుబడిగా సాగుతున్నాయని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి.

నీరుగారుతున్న ఆశయం

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అనేవి టీచర్లలో ఉత్సాహాన్ని, పోటీతత్వాన్ని నింపి విద్యారంగంలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు దోహదపడాలి. కానీ, అర్హత లేని వారికి, సిఫార్సులతో వచ్చిన వారికి అవార్డులు కట్టబెట్టడం వల్ల నిజాయితీగా పనిచేసే ఉపాధ్యాయుల మనోధైర్యం దెబ్బతింటోంది. ఎంత కష్టపడినా ఉపయోగం ఏముంది? గుర్తింపు రావాలంటే పలుకుబడి ఉండాల్సిందేగా! అనే నిరాశ నిస్పృహలు ఉపాధ్యాయుల్లో వ్యక్తమవుతున్నాయి.

సమాజ నిర్మాణం.., భావి భారత పౌరులను తీర్చిదిద్దడం.. విద్యార్థుల ఉన్నతికి కృషి చేయడంతోపాటు దేశాభివృద్ధిలో తమ వంతు కీలక పాత్రం పోషించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న ఉపాధ్యాయులకు ఉత్తమ అవార్డులు అందించి ప్రభుత్వం పోత్సహిస్తూ ఉంటుంది. అయితే ఇందులోనూ రాజకీయాలు రంగప్రవేశం చేయడంతో పురస్కారాలు పవిత్రను కోలోతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పిల్లలకు చక్కగా విద్యాబుద్ధులు నేర్పిస్తూ.. చిత్తశుద్ధితో విధులు నిర్వర్తిస్తున్న టీచర్లను వదిలేసి నేతలు సిఫార్సు చేసిన వారికే పెద్దపీట వేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా, రాష్ట్ర స్థాయి అవార్డుల ఎంపికలో సైతం పలుకుబడే పనిచేస్తోందని ఉపాధ్యాయ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

కలెక్టర్‌ జోక్యం చేసుకోవాల్సిందే..

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ఎంపిక ప్రక్రియపై కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ ప్రత్యేక దృష్టి సారించాలని టీచర్లు కోరుతున్నారు. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. నిబంధనలను పాటించి, రాజకీయ సిఫార్సులకు తావులేకుండా ఎంపికలు చేయాలని కోరుతున్నారు. విద్యాశాఖ సమర్పించే జాబితాలపై కలెక్టరేట్‌ స్థాయిలో ప్రత్యేక నిఘా ఉంచి, క్షేత్రస్థాయిలో విద్యార్థులు, గ్రామస్థుల అభిప్రాయాల ఆధారంగా అర్హులను ఎంపిక చేయాలని స్పష్టం చేస్తున్నార. రాజకీయ, అధికారుల సిఫార్సు లేఖల ను పూర్తిగా పక్కనబెట్టి, కేవలం మెరిట్‌, నిబంధనల ఆధారంగా మాత్రమే అవార్డు విజేతలను ప్రకటించాలని సూచిస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయుల పాయింట్లు, వారి సాధించిన విజయాలను బహిరంగంగా ప్రకటించిన తర్వాతే తుది జాబితాను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికై నా జిల్లా యంత్రాంగం స్పందించి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు.

డీఈఓ కార్యాలయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement