అదనపు భారంతో ఆపసోపాలు | - | Sakshi
Sakshi News home page

అదనపు భారంతో ఆపసోపాలు

Aug 30 2026 1:51 AM | Updated on Aug 30 2026 1:51 AM

● ట్రాన్స్‌కో ఎస్‌ఈ కార్యాలయానికి రాని తిరుపతి కాంట్రాక్ట్‌ ఉద్యోగులు ● 30 మంది గైర్హాజరుతో మిగిలిన వారిపై పని ఒత్తిడి ● ప్రత్యామ్నాయం చూపని అధికారులు

చిత్తూరు కార్పొరేషన్‌: తిరుపతి జిల్లా నుంచి చిత్తూరుకు రావాల్సిన 25 మంది శాశ్వత ఉద్యోగులు ఎట్టకేలకు వచ్చారు. కానీ, 30 మంది వరకు కాంట్రాక్ట్‌ ఉద్యోగులు ఇక్కడికి రావడానికి ససేమిరా అంటున్నారు. వారికి వచ్చే రూ.20 వేల జీతంతో తిరుపతి–చిత్తూరుకు రానుపోను రాకపోకల చార్జీలు, భోజనం, ఇతర ఖర్చులకు సగానికి పైగా పోతుంది. మిగిలిన మొత్తంతో కుటుంబ పోషణ నెగ్గుకు రావాలంటే కష్టమంటున్నారు. రూ.లక్షల్లో జీతాలు తీసుకునే శాశ్వత ఉద్యోగులే దాదాపు 20 నెలలకు పైగా రాకపోయిన పట్టించుకోలేదు. కింది స్థాయిలోని తమను చిత్తూరుకు రావాలని ఒత్తిడి చేయడం సరికాదని కాంట్రాక్ట్‌ ఉద్యోగులను ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కంప్యూటర్‌ ఆపరేటర్లు, ఎల్‌డీసీ, క్లర్క్‌లు, అటెండర్లు దాదాపు 30 మంది వరకు రాకపోవడంతో ఇక్కడ ఉన్న వారికి తిప్పలు తప్పడం లేదు. ఈ మేరకు ఎస్‌ఈ, ఎంఆర్‌టీ, నిర్మాణ విభాగం, టెక్నికల్‌, కమర్షియల్‌ విభాగాల పరంగా ఉన్న ఉద్యోగులపై పనిఒత్తిడి పెరుగుతోంది. సెలవులు కూడా దొరకడం కష్టంగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసరమైనప్పుడు కొందరు ఉద్యోగులు సెలవు పెడితే మిగిలిన ఉద్యోగులకు నరకం కనపడుతోందని వాపోతున్నారు.

కొరత తీర్చాలి

ఎస్‌ఈ కార్యాలయం, అనుబంధ విభాగాల పరంగా రిపోర్ట్స్‌ సకాలంలో కావాలని ఉన్నతాధికారులు ఒత్తిడి చేయడం పరిపాటి. అలాంటప్పుడు ఉద్యోగులు కొరత సమస్యను తీర్చాలని పలువురు అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతసేపు టెలీకాన్ఫరెన్స్‌లు, ఇతర సమావేశాలకే సమయం సరిపోతుందని వెల్లడిస్తున్నారు. ఇక రిపోర్ట్స్‌ సిద్ధం చేసి ఇవ్వడానికి సమయం చాలడం లేదని స్పష్టం చేస్తున్నారు. ఈ పనులన్నీ తెలిసిన కాంట్రాక్ట్‌ ఉద్యోగుల కొరతను తీర్చాలని డిమాండ్‌ చేస్తున్నారు. అయితే వారు చిత్తూరుకు రారు కాబట్టి ప్రత్యామ్నాయమార్గం చూపాల్సిన అవసరముందని సూచిస్తున్నారు.

స్టోర్స్‌ కంట్రోల్‌ మారేనా..

ఉమ్మడి జిల్లాకు చిత్తూరులోని స్టోర్స్‌ నుంచే విద్యు త్‌ పరికరాలు వెళుతున్నాయి. ఒక సబ్‌డివిజన్‌కు పరికరాలు కావాలంటే ఆ రోజు కోసం తిరిగి వేచి చూడాల్సిన పరిస్థితి. అలా కాకుండా అత్యవసరమైతే అనుమతితో సబ్‌డివిజన్లకు పరికరాలు ఇచ్చే విధంగా సరళతరం చేయాలి. స్టోర్స్‌ కంట్రోల్‌ తిరుపతి జిల్లా ఎస్‌ఈ పరిధిలో ఉంది. ముఖ్యమైన అనుమతులు కావాలంటే అక్కడ నుంచి అంగీకారం వచ్చే వరకు వేచి చూడాలి. అలా కాకుండా చిత్తూరు ఎస్‌ఈకు అధికారం ఇస్తే విద్యుత్‌ పరికరాలకు త్వరగా అనుమతులు లభిస్తాయి.

సమస్యను నివేదించాం

ఎస్‌ఈ కార్యాలయం, అనుబంధ విభాగాల ఆఫీసులకు తిరుపతి నుంచి 30 మంది వరకు కాంట్రాక్ట్‌ ఉద్యోగులు రావాల్సి ఉంది. సమస్యను ఉన్నతాధికారులకు నివేదించాం. ప్రత్యామ్నాయ మార్గం చూపాలని కోరాం.

– అమర్‌బాబు, ఎస్‌ఈ, ట్రాన్స్‌కో చిత్తూరు

జిల్లా ట్రాన్స్‌కో కార్యాలయం సిబ్బంది లేమి సమస్యతో కొట్టుమిట్టాడుతోంది. గతంలో పరిపాలన తిరుపతి కేంద్రంగా నడిచేది. రెండేళ్ల క్రితం చిత్తూరుకు ఎస్‌ఈ కార్యాలయ తరలింపును ప్రభుత్వం చేపట్టింది. ఈ క్రమంలో పలు విభాగాలకు అధికారులను కేటాయించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. రాజకీయ పలుకుబడితో వారు చిత్తూరుకు రాకుండానే దాదాపు 20 నెలలపాటు కాలం గడిపేశారు. ఉన్నతాధికారుల ఒత్తిడి మేరకు 3 నెలల క్రితం విడతల వారీగా వచ్చి విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికీ సుమారు 30 మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులు గైరార్హజరువుతున్నారు. దీంతో ఆఫీస్‌లోని ఇతర సిబ్బందిపై అదనపు భారం పడుతోంది. పని ఒత్తిడితో ఆపసోపాలు పడాల్సి వస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement