కంపెనీలు వైద్యులకు ఉచితంగా ఇవ్వాల్సిన శాంపిళ్లను కొందరు కేటుగాళ్లు బహిరంగంగానే మెడికల్ షాపుల్లో అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. తిరుపతికి వచ్చే లక్షలాది మంది భక్తులు, సరిహద్దు గ్రామీణ ప్రాంత ప్రజలు అత్యవసర సమయాల్లో డాక్టర్ చీటీ లేకుండా కొనే మాత్రలే ఈ అక్రమార్కులకు కామధేనువుగా మారాయి. విద్యార్థులు, యువత ఎక్కువగా ఉండే తిరుపతి లాంటి విద్యాకేంద్రాల్లో కొన్ని షాపులు యథేచ్ఛగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే మత్తునిచ్చే మాత్రలను విక్రయిస్తూ వారి నాశనానికి కారణమవుతున్నాయనే ఆరోపణలున్నాయి. ప్రముఖ కంపెనీల రంగు, ఆకారం, సైజు, చివరికి ప్యాకింగ్‌ను కూడా అచ్చుగుద్దినట్లు అనుకరిస్తూ తయారు చేసిన నకిలీ ఔషధాలు మార్కెట్లోకి వస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఇక ఆర్‌ఎంపీల పేరుతో విచ్చలవిడిగా మందులు, మాత్రలు అమ్మేస్తున్నారు. అధికంగా చిత్తూరు జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ఆర్‌ఎంపీల దందా జోరుగా సాగుతోంది. వీరి ఆగడాలను కట్టడి చేసే వారు లేకపోవడం గమనార్హం.


