చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ఎల్పీజీ వినియోగదారులు ఈ నెల 23వ తేదీలోపు ఈకేవైసీని తప్పనిసరిగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ స్పష్టం చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ఎల్పీజీ వినియోగదారులు తమ ఈకేవైసీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసుకోవాలన్నారు. వినియోగదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈకేవైసీ గడువును ఈ నెల 23వ తేదీ వరకు పొడిగించామన్నారు. గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాలతో పాటు హోమ్ డెలివరీ సిబ్బంది, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల మొబైల్ యాప్‌లలో వినియోగదారులు ఈకేవైసీ పూర్తి చేసుకునేలా ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. సర్వర్ లోపాలు, నెట్‌వర్క్ అంతరాయం, బయోమెట్రిక్ ధ్రువీకరణలో తలెత్తుతున్న ఆలస్యం కారణంగా కొందరు వినియోగదారులు ఇబ్బంది పడుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. ఈ క్రమంలోనే ఈకేవైసీకి అదనపు అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఈ మేరకు ఈకేవైసీ పూర్తి చేయని వినియోగదారులందరికీ ఏజెన్సీ నిర్వాహకులు సమాచారం అందించాలని ఆదేశించారు. నిర్దేశిత గడువులోపు వంద శాతం పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు.


