చిన్న వయసులోనే పెద్ద జబ్బులు బాల్యంలోనే నడుము నొప్పులు వంగిపోతున్న వెన్నుపూస రూ.10 వేల మెటీరియల్, 20 కిలోల పుస్తకాలు ప్రత్యామ్నాయంపై దృష్టి పెడితేనే
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో 2,414 ప్రభుత్వ, 431 ప్రైవేటు పాఠశాలల్లో 2.3 లక్షల మందికి పైగా విద్యార్థులు చదువుతుకుంటున్నారు. చాలా ప్రైవే టు పాఠశాలల్లో 1–5 తరగతులకు ఎస్‌సీఈఆర్టీ పుస్తకాలకు తోడు సొంత మెటీరియల్ అంటగడుతున్నారు. ఆరు నుంచి పదో తరగతి వారికి జేఈఈ మెయిన్స్, నీట్ స్టడీ మెటీరియల్ అంటూ భారీగా పుస్తకాలు ఇస్తున్నారు. బండెడు పుస్తకాలను బ్యాగులో వేసుకుని నేటి బాల్యం నిత్యం నరకయాతన అనుభవిస్తోంది. రెండు నుంచి నాలుగు వరకు అంతస్తుల్లో ఉన్న తరగతులకు మెట్ల మీదుగా చేరలేక ఉక్కిరిబిక్కిరికి లోనవుతున్నారు.
అమలు కాని స్కూల్ బ్యాగ్ పాలసీ
‘విద్యాహక్కు చట్టం– 2009’, యశ్‌పాల్ కమిటీ సిఫార్సుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం స్కూల్ బ్యాగ్ పాలసీని ఆరేళ్ల కిందట అమలులోకి తెచ్చింది. దీని ప్రకారం.. 1, 2 తరగతుల వారికి తెలుగు, ఆంగ్లం, గణితం, 3, 4, 5 తరగతులైతే ఆ మూడింటికి తోడు పరిసరాల విజ్ఞానం, 6–10 తరగతులైతే ఆరు పుస్తకాలే ఇవ్వాలి. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలతో తల్లిదండ్రులు మాట్లాడి.. స్కూల్ బ్యాగ్ ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టాలి. పాఠశాలలో రెండో సంచి పెట్టడం, ఏ రోజు అవసరమయ్యే వాటిని ఆ రోజే తెచ్చుకోవడం, హోంవర్కు ఇచ్చిన సబ్జెక్టుల నోటు పుస్తకాలే ఇళ్లకు తీసుకెళ్లేలా చూడడం అవసరం. ‘నో బ్యాగ్ డే’ని బడులు విధిగా అమలు చేయాలి.
చట్టాలు కాగితాలకే పరిమితం
కేంద్ర మానవ వనరల అభివృద్ధి శాఖ స్కూల్ బ్యాగ్ పాలసీ ప్రకారం ఏ తరగతి విద్యార్థి ఎంత బరువు మోయాలో స్పష్టమైన నిబంధనలున్నాయి. విద్యార్థి శరీర బరువులో 10 శాతానికి మించి స్కూల్ బ్యాగ్ బరువు ఉండకూడదనేది ప్రాథమిక సూత్రం. అయితే ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల ర్యాంకుల ఉచ్చు, అదనపు సిలబస్ మార్కెటింగ్ వ్యూహాల వల్ల ఈ నిబంధనలన్నీ తుంగలో తొక్కే స్తున్నారు. ప్రభుత్వాలు జీవోలు జారీచేయడం, అధికారులు అప్పుడప్పుడూ తనిఖీలు చేయడం మినహా క్షేత్ర స్థాయిలో శాశ్వత పరిష్కారం లభించడం లేదు.
బడి సంచి బరువెక్కింది. సవాలక్ష పుస్తకాలతో మోయలేని భారం పడుతోంది. కేజీల కొద్దీ పుస్తకాల మోయలేక వెన్నుపూస మధ్యలోనే ఒంగిపోతోంది. బాల్యమప్పుడే బరువులు మోయలేక జబ్బుల బారిన పడాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. నిబంధనలు కఠినతరం చేసి, రేపటి పౌరులను కాపాడాల్సిన అధికార గణం కూడా కళ్లప్పగించి చూస్తోంది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నా స్పందించనంటోంది.
బడి సంచి బరువు
తరగతి అనుమతించదగిన గరిష్ట బరువు ప్రస్తుతం సగటున మోస్తున్న బరువు 1,2 తరగతులు 1.6 నుంచి 2.2 కిలోలు 4 నుంచి 5 కిలోలు
3,4,5 తరగతులు 1.7 నుంచి 2.5 కిలోలు 6 నుంచి 7 కిలోలు
6,7 తరగతులు 2 నుంచి 4.5 కిలోలు 7 నుంచి 8 కిలోలు
8,9 తరగతులు 2.5 నుంచి 4.5 కిలోలు 9 నుంచి 12 కిలోలు
10 వతరగతి గరిష్టంగా 5 కిలోలు 12 నుంచి 15 కిలోలు


