తవ్వేస్తూ..సరిహద్దులు దాటిస్తూ! | - | Sakshi
Sakshi News home page

తవ్వేస్తూ..సరిహద్దులు దాటిస్తూ!

Jul 6 2026 12:28 AM | Updated on Jul 6 2026 12:28 AM

సరిహద్దులు దాటుతున్న సహజ వనరులు ఒక్కో టిప్పర్‌ ఇసుక రూ.1.2 లక్షల నుంచి రూ.1.8 లక్షలు

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: జిల్లాలో మైనింగ్‌ మాఫియా బరితెగించింది. పచ్చ చొక్కాల అండదండలతో ఇసుక, మట్టి, గ్రానైట్‌ దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. నాడు ఉచిత ఇసుక అంటూ ఊదరగొట్టిన కూటమి నేతలు.. నేడు దాన్ని ‘అక్రమ ఇసుక‘గా మార్చి వందల కోట్లు వెనకేసుకుంటున్నారు. చిత్తూరు కేంద్రంగా సాగుతున్న ఈ అక్రమ ధనార్జన వ్యాపారం ఇప్పుడు పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకకు బంగారు బాతులా మారింది. జిల్లాలోని వాగులు, వంకలు, నదీ పరివాహక ప్రాంతాలలో హిటాచీలతో తవ్వేస్తూ ఇసుకను తరలించేస్తున్నారు.

శెట్టితంగాల్‌ కేంద్రంగా దందా

చిత్తూరు మండలం శెట్టితంగాల్‌ కేంద్రంగా ఇసుక అక్రమ వ్యాపారం పతాక స్థాయికి చేరింది. ఇక్కడి నుంచి గుడిపాల మండలంలోని మంచినీళ్ల కుంట, సీఎం కండ్రిగ డంప్‌లకు తరలిపోతోంది. అక్కడి నుంచి రాత్రి పగలు తేడా లేకుండా తమిళనాడుకు టిప్పర్లలో తరలిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో ఒక్కో టిప్పర్‌ ఇసుక ధర రూ. 1.2 లక్షల నుంచి రూ.1.8 లక్షల వరకు పలుకుతోంది.

ఆగని దోపిడీ.. మట్టి గుల్ల

నగరి నియోజకవర్గంలోనూ మట్టి తవ్వకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. పచ్చ నేతల కనుసైగలతో టిప్పర్ల కొద్దీ మట్టిని తమిళనాడుకు తరలిస్తున్నారు. పలమనేరులోని కౌండిన్య నదీ పరివాహక ప్రాంతంలో ఇసుక దోపిడీకి అడ్డూఅదుపు లేకుండా పోయింది. ఈ అక్రమ దందాపై సంబంధిత శాఖల అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు.

సొంత తమ్ముళ్లే ‘బోరుమంటున్నారు’!

సీఎం నారా చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో ‘మైనింగ్‌ మాఫియాకు అడ్డుకట్ట వేస్తామని ప్రకటించారు. అయితే, సీఎం ప్రకటన కేవలం కుప్పానికే పరిమితమా? మిగిలిన నియోజకవర్గాల్లో దోపిడీకి లైసెన్స్‌ ఇచ్చినట్లేనా? అని సొంత పార్టీ నేతలే చర్చించుకోవడం గమనార్హం. జిల్లాలో సాగుతున్న ఈ భారీ మైనింగ్‌ దోపిడీపై ఉన్నతాధికారులు ఇప్పటికై నా స్పందిస్తారో..లేదో చూడాలి.

మైనింగ్‌ మాఫియా స్వైరవిహారం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement