చిత్తూరు కార్పొరేషన్: స్థానిక రైల్వేస్టేషన్‌లో విల్లుపురం–తిరుపతి ప్యాసింజర్ రైలు కింద పడి ఆదివారం గుర్తుతెలియని మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఒకటో ఫ్లాట్‌ఫాం నుంచి వంద మీటర్ల దూరంలో వెళ్తున్న రైలు వద్దకు మహిళ పట్టాల పై వెళ్లడంతో గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. సంఘటనను గమనించిన ప్రయాణికులు రైల్వే అధికారులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి పేరు , వయస్సు, చిరునామా వంటి వివరాలు తెలియలేదని జీఆర్‌పీ ఎస్‌ఐ నరసింహులు తెలిపారు. మృతురాలు దాదాపు 35–40 సంవత్సరాల మధ్య వయ స్సు ఉంటుందని, ముదురు రంగు గులాబీ చీర ధరించి ఉందని, కుడి చేతి పై ‘మురళి’ అనే పచ్చబొట్టు ఉందన్నారు. ఆమె గురించి సమాచారం తెలిసిన వారు పోలీసుస్టేషన్‌లో సంప్రదించాలని కోరారు.
గృహోపకరణాలు దగ్ధం
తవణంపల్లె(ఐరాల) : మొబైల్ చార్జర్ పేలడంతో ఇంటి గృహోపకరణాలు అగ్నికి ఆహుతైన ఘటన ఆదివారం చిత్తూరు తవణంపల్లె మండలంలోని ఎగువ తడకర, ఈ.వెంకటాపురంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. మండంలోని ఈ.వెంకటాపురంలో మాజీ సర్పంచ్ సుబ్రమణ్యంశెట్టి(దివంగత) ఇంట్లో ఉదయం మొబైల్ చార్జర్ పేలడంతో బెడ్‌రూమ్‌లో ఉంచిన నగదు రూ.90 వేలతో పాటు పట్టువస్త్రాలు, నిల్వ ఉంచిన వీధి దీపాలు, టీవీ, తదితర గృహోపకరణాలు బూడిదయ్యా యి. ఆ సమయంలో ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. స్థానికులు మంటలు గుర్తించి ఇంటి తాళాలు పగలగొట్టి మంటలను అదుపు చేశారు.
కాణిపాకం కిటకిట
కాణిపాకం: స్థానిక స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం సెలవు దినం కావడంతో స్వామివారి దర్శనార్థం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలోని క్యూలైన్లన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.


