● సిఫార్సులకే ప్రాధాన్యం ● కస్తూర్బాల్లో ప్రవేశాల పేరుతో నాయకుల వసూళ్లు
చిత్తూరు కలెక్టరేట్ : కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో సీట్ల కోసం పోటీ నెలకొంది. పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో సీట్ల భర్తీ జరుగుతున్నా.. మిగిలిపోయిన సీట్లకు కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసి అర్హులైన విద్యార్థినులకు ప్రవేశాలు కల్పిస్తారు. కానీ.. గ్రామీణ ప్రాంతాల్లోని స్థానిక నాయకులు మాత్రం ‘మేము సీటు ఇప్పిస్తాం’ అంటూ తల్లిదండ్రుల నుంచి రూ.వేలల్లో దండుకుంటున్నారు. విద్యార్థినుల తల్లిదండ్రులు వీరి మాయలో పడి డబ్బులు చెల్లించి సీటొస్తుందని ఎదురు చూస్తున్నారు. దీనివల్ల అటు డబ్బుపోగా ఇటు బాలికలు చదువుకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది.
ఇప్పటికే సీట్లన్నీ భర్తీ
జిల్లాలో ఉన్న 7 కేజీబీవీల్లో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 280 సీట్లు భర్తీకి చర్యలు చేపట్టారు. వీటిలో ప్రవేశాల కోసం ఆన్‌న్‌లైన్‌లోనే దాదాపు 11 వేల దరఖాస్తులు వచ్చాయి. మొదటి, రెండో విడతలో ఆన్‌లైన్ పద్ధతిలో ప్రవేశాలు కల్పించారు. ఖాళీగా కొన్ని సీట్లు మిగిలి ఉన్నాయి. వీటి కోసం వందల సంఖ్యలో సిఫార్సు లేఖలు రావడంతో ఎంపిక ప్రక్రియ కష్టంగా మారింది. సిఫార్సు లేఖలతో పాటు పలువురు తల్లిదండ్రులు నేరుగా సమగ్ర శిక్ష కార్యాలయానికి వచ్చి దరఖాస్తులు చేసుకున్నారు. పీజీఆర్‌ఎస్‌కు వందల సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం.
వందల సంఖ్యలో లేఖలు
కేజీబీవీల్లో 6వ తరగతిలో ప్రవేశం కోసం గ్రామ సర్పంచులు మొదలుకొని రాజకీయ పార్టీల కార్యకర్తలు, నాయకుల నుంచి వందల సంఖ్యలో సిఫార్సు లేఖలు వచ్చాయి. కొందరు గ్రామ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉన్నతాధికారుల సిఫార్సు లేఖలు తీసుకొని ‘మా వాళ్లకు ఆరో తరగతిలో ప్రవేశం కల్పించాలి’ అని సమగ్ర శిక్షా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఒక్కో సిఫార్సు లేఖ కోసం తల్లిదండ్రుల నుంచి రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నారని సమాచారం. కానీ ఇప్పటివరకు సీటు రాకపోవడంతో ఒకింత ఆందోళనకు గురవుతున్నారు.


