సాక్షి టాస్క్‌పోర్స్: సీఎం ఆదేశమో, అధికారుల అత్యుత్సాహమో తెలియదు గానీ సీఎం చంద్రబాబు కుప్పం పర్యటనకు వచ్చిన ప్రతి సారీ భారీ వాహనాల డ్రైవర్లు, క్లీనర్లకు నరకం చూపుతున్నారు. నిత్యం వేల సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగే పలమనేరు–క్రిష్ణగిరి అంతర్రాష్ట్ర జాతీయ రహదారిపై అడ్డగోలుగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నారు. బస్సులు, కార్లను మాత్రం అనుమతిస్తూ లారీలను ఆపేస్తున్నారు. తమిళనాడు వైపు నుంచి వచ్చే భారీ వాహనాలను కుప్పం సమీపంలోని విజిలాపురం సర్కిల్ నుంచి కంగుంది మీదుగా మళ్లిస్తున్నారు. వి.కోట వైపు నుంచి తమిళనాడు వైపు వెళ్లే వాహనాలను శాంతిపురం మండలం, బడుమాకులపల్లి నుంచి ఇదే మార్గంలో మళ్లిస్తున్నారు. దీంతో దాదాపు 12 కి.మీ అదనంగా ప్రయాణించాల్సి వస్తోంది. ఈ మార్గంలో కొంత వరకూ ఇరుకై న సింగిల్ రోడ్డు, మలుపులు ఉండడంతో రాకపోకలు సాగించలేక భారీ లారీలు, డ్రైవర్లు జాతీయ రహదారి పక్కనే ఆపి వేచి చూడాల్సి వస్తోంది. భారీ వాహనాల మళ్లింపు సందర్భంలో వచ్చే చిరు వాహనాలు, కార్లు కూడా బారులు తీరి నిలవాల్సి వస్తోంది. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకూ ఇదే పరిస్థితి కొనసాగింది. తిండీ నీరు లేక.. సకాలంలో గమ్యం చేరుకోలేక డ్రైవర్లు, క్లీనర్లు అగచాట్లు పడ్డారు. శిపుపురం వద్ద జాతీయ రహదారి పక్కన ఉన్న సీఎం నివాసం ముందు సర్వీసు రోడ్డును ఏర్పాటు చేయడం ద్వారా అంతర్రాష్ట్ర రాకపోకలకు అంతరాయం లేకుండా చూసే అవకాశం ఉన్నా అధికారులు, నాయకులు ఆ దిశగా చర్యలు తీసుకోలేక పోతున్నారు.


