రెండో రోజూ తూతూమంత్రంగానే స్పెషల్ డ్రైవ్
బీఎల్వోలు ఎక్కడున్నారో తెలియని వైనం
పోలింగ్ కేంద్రాల వద్ద ఇక్కట్లు
ఎదుర్కొన్న ఓటర్లు
సీఎం పర్యటన సాకుతో క్షేత్ర స్థాయి సిబ్బంది డుమ్మా
ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాల
స్వీకరణలో తీవ్ర అలసత్వం
చిత్తూరు టాస్క్‌ఫోర్స్ : రాష్ట్ర ఎన్నికల సంఘం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక ఓటర్ల నమోదు సవరణ కార్యక్రమం (స్పెషల్ డ్రైవ్) జిల్లాలో పూర్తిగా దారి తప్పింది. రెండో రోజైన ఆదివారం క్షేత్ర స్థాయిలో పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. ఓటు హక్కు నమోదు చేసుకోవడానికి, తప్పులు సవరించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ఓటర్లకు నిరాశే ఎదురైంది. జిల్లా వ్యాప్తంగా ఆరు నియోజకవర్గాల పరిధిలోని 2,500 పోలింగ్ కేంద్రాల్లో ఎక్కడా కూడా ఆశించిన స్థాయిలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహణ కనిపించ లేదు. కాగితాల్లో 2,500 మంది బూత్ లెవెల్ అధికారులు (బీఎల్వోలు) విధులు నిర్వహిస్తున్నట్లు రికార్డులు చెబుతున్నా, క్షేత్ర స్థాయిలో ‘కనిపించలేదు సర్’ అనే సమాధానమే వినిపించింది.
సీఎం పర్యటన సాకు!
జిల్లాలో ముఖ్యమంత్రి అధికారిక పర్యటన ఉండడాన్ని జిల్లా ఉన్నతాధికారులు, నియోజకవర్గ స్థాయి అధికారులు పూర్తిగా తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ఉన్నతాధికారులంతా సీఎం ప్రో టోకాల్, బందోబస్తు విధుల్లో నిమగ్నమవడంతో క్షేత్ర స్థాయిలో బీఎల్వోల పర్యవేక్షణను పూర్తిగా గా లికి వదిలేశారు. దీనిని అదునుగా భావించిన మెజారిటీ బీఎల్వోలు ఆదివారం పోలింగ్ కేంద్రాలకు డు మ్మా కొట్టారు. అధికారులు అడిగితే సీఎం పర్యటన విధుల్లో ఉన్నామనే కుంటి సాకులు చెబుతూపబ్బం గడుపుకున్నారు. ఉన్నతాధికారుల తనిఖీలు లేకపోవడంతో, బీఎల్వోలు అసలు ఎక్కడున్నారో... ఎటు వెళ్లారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.
నీరుగారిన ‘స్పెషల్’ ఆశయం
నూతన ఓటర్ల ఎన్యూమరేషన్, పేరు మార్పులు, చేర్పులు, చిరునామా సవరణల కోసం ఫారాలు సమర్పించేందుకు వచ్చిన పౌరులకు పోలింగ్ కేంద్రాల వద్ద చుక్కలు కనిపించాయి. పనులన్నీ మానుకుని, ఆదివారం ఉదయాన్నే కేంద్రాలకు చేరుకున్న ఓటర్లు గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వచ్చింది. అనేక కేంద్రాలకు తాళాలు వేసి ఉండడం, మరికొన్ని చోట్ల సిబ్బంది లేకపోవడంతో ఓటర్లు తీవ్ర నిరాశకు లోనయ్యారు. కేంద్రాల వద్ద తాగునీరు, నీడ సదుపాయం లేకపోవడంతో తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు.
తీవ్ర అలసత్వం
పలుచోట్ల అరకొరగా తెరిచిన కేంద్రాల్లో సైతం సిబ్బంది తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శించారు. ఓటర్లు తీసుకొచ్చిన దరఖాస్తులను పరిశీలించడంలో, కొత్త ఫారాలను అందుబాటులో ఉంచడంలో ఘోరంగా విఫలమయ్యారు. ఆన్‌లైన్‌లోన్ సర్వర్లు పనిచేయడం లేదంటూ, సాంకేతిక కారణాలు చెబుతూ దరఖాస్తుదారులను వెనక్కి పంపించేశారు. కలెక్టర్, ఎన్నికల అధికారులు స్పందించి, విధులకు గైర్హాజరైన బీఎల్వోలపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


