సీజన్ ముగియకముందే హఠాత్తుగా తోతాపురి కొనుగోలు బంద్
రాత్రికి రాత్రే వెలిసిన బోర్డులు
గొల్లమడుగు వద్ద కిలోమీటర్ల
మేర ట్రాక్టర్ల క్యూ
తమిళనాడు సరిహద్దు దాటిన
వాహనాలు
లోడ్ దిగేలోపే కుళ్లిపోతున్న పంట
సిఫార్సులకే పెద్దపీట వేస్తున్నారంటూ రైతాంగం ఆగ్రహం
జిల్లాలో మామిడి రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. అన్నదాత ఆశలపై పళ్ల గుజ్జు ఫ్యాక్టరీల యజమానులు నీళ్లు చల్లుతున్నారు. తోతాపురి మామిడి కొనుగోళ్లను రాత్రికి రాత్రే నిలిపివేస్తున్నట్టు ఫ్యాక్టరీల ఎదుట బోర్డులు పెట్టేశారు. నీలం రకం మాత్రమే కొనుగోలు చేస్తామంటూ డొల్లమాటలు చెబతున్నారు. తోతాపురిని తక్కువ ధరకే కొల్లగొట్టేందుకు పక్కాగా స్కెచ్ వేశారు. ఇందులో భాగంగానే మాయమాటలు చెబుతూ సిండికేట్‌గా ఏర్పడి దొంగాట ఆడుతున్నారని రైతులు మండిపడుతున్నారు.
కాణిపాకం/గుడిపాల: గుడిపాల మండలంలోని మూడు ప్రధాన పళ్ల గుజ్జు ఫ్యాక్టరీలతో పాటు, గంగాధరనెల్లూరు మండలంలోని పలు పరిశ్రమల వద్ద తోతాపురి కొనుగోలు నిలుపుదల చేశారు. ఈ మేరకు ఆయా ఫ్యాక్టరీ యజమానులు బోర్డులు పెట్టేశారు. తోతాపురి సీజన్ ఇంకా ముగియక ముందే.. అప్పుడే నీలం రకం కాయలు మాత్రమే కొంటామంటూ బోర్డులు పెట్టడం వెనుక పెద్ద వ్యూహమే దాగి ఉందని రైతులు ఆరోపిస్తున్నారు. ధర తగ్గించి తక్కువకే లాక్కోవడానికే ఈ నాటకాలంటూ మండిపడుతున్నారు.
ట్రాక్టర్ల మహా క్యూ
మెజారిటీ ఫ్యాక్టరీలు చేతులెత్తేయడంతో, ప్రస్తుతం కొనుగోళ్లు సాగుతున్న ఏకై క కేంద్రమైన గుడిపాల మండలంలోని గొల్లమడుగు ఫ్యాక్టరీ వద్దకు రైతు లు పోటెత్తారు. వేలాది ట్రాక్టర్లు, లారీలు రోడ్డుపైకి చేరడంతో కిలోమీటర్ల మేర ట్రాక్టర్లు నిలిచిపోయాయి. 2.5 కిమీ మేర 600కుపైగా ట్రాక్టర్లు నిలిచిపోయాయి. వాహనాల క్యూ ఏకంగా పొరుగు రాష్ట్రమైన తమిళనాడు సరిహద్దును తాకింది.
కంటిపై కునుకు లేదు
ఫ్యాక్టరీకి తీసుకొచ్చిన లోడ్ అన్‌లోడింగ్ కావడానికి ఆరు రోజులు పడుతోంది. ఎండకు ఎండుతూ, వానకు నానుతూ అడవి లాంటి నిర్జన ప్రదేశాల్లో రైతులు నరకయాతన అనుభవిస్తున్నారు. రాత్రి వేళల్లో వాహనాల్లో ఉన్న పరికరాలను ఎక్కడ దొంగిలిస్తారోనని జాగారం చేస్తున్నారు. పగటిపూట ఎండలోనే కాసేపు తలవాల్చుతున్నారు.
‘సిఫార్సు’లకే దారి
సామాన్య రైతులకు ఫ్యాక్టరీల వద్ద తీవ్ర అన్యా యం జరుగుతోంది. క్యూలైన్లను పక్కనబెట్టి, కొందరు పెద్దల సిఫార్సులతో వచ్చే వాహనాలను దొడ్డిదారిన లోపలికి తీసుకెళ్లి అన్‌న్‌లోడ్ చేసుకుంటున్నారని రైతులు గొగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికై నా కలెక్టర్, అధికార యంత్రాంగం తక్షణమే జోక్యం చేసుకుని, ఫ్యాక్టరీల దగా ఆటను కట్టించి, కొనుగోళ్లు పారదర్శకంగా సాగేలా చూడాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
తమిళనాడు సరిహద్దును తాకుతున్న మామిడి కాయల ట్రాక్టర్ల క్యూ , క్యూలోని టైర్ పంక్చర్ అయిన దృశ్యం
చూస్తే మేలిమి బంగారం.. కోస్తే పురుగులు
ఆరు రోజుల పాటు ట్రాక్టర్లలోనే మగ్గిపోతుండడంతో కాయలన్నీ కుళ్లిపోతున్నాయి. మామిడి కాయ చూస్తే మేలిమై ఉండు.. పొట్ట విప్పు చూడు పురుగులుండు.. అన్న చందంగా తయారైంది.. ప్రస్తుత పరిస్థితి. పైకి రంగు బాగా కనిపిస్తున్నా, లోపల కుళ్లిపోవడంతో ఫ్యాక్టరీ నిర్వాహకులు తిరస్కరిస్తున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలో గుజ్జు ఫ్యాక్టరీల దగా


