తిరుపతి కల్చరల్: అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ జంటగా నటించిన లెనిన్ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలు ఆదివారం తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. తిరుపతి నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ మైదానంలో జరిగిన అన్నపూర్ణ స్టూడియోస్ అధినేత, ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. తిరుపతి పరిసరాలలోని రామాపురానికి చెందిన మురళీనంద కిషోర్ అంబుర్ అందించిన కథతో, ఆయన దర్శకత్వంలో రూపొందించిన లెనిన్ చిత్రం అభిమానులందరినీ ఆకట్టుకుంటుందన్నారు. ఈ చిత్రంలో సెంటిమెంట్ ఉందని, కథలో రకరకాల క్యారెక్టర్‌లు ఉన్నాయని చెప్పారు. అనేక ట్విస్టులు ఉన్నాయని పేర్కొన్నారు. ‘ప్రేమ అనేది పెద్ద ఎమోషన్. ప్రేమ కోసం రాజ్యాలు కూలాయి, ప్రేమ కోసం అనేక యుద్ధాలు జరిగాయి. అలాగే లెనిన్ కూడా ప్రేమ కథా చిత్రం. ఇది సీమ కథ, సీమ మట్టి కథ, సీమలోని మనుషుల కథ, లెనిన్ అందరి ఇంట్లోని వ్యక్తిగత కథ. ప్రేక్షకులు ఈ కథను బాగా అభిమానిస్తారు. కచ్చితంగా విజయవంతం చేస్తారనే నమ్మకం ఉంది’ అని అన్నారు. నాన్నగారు చెప్పినట్టు ప్రేక్షక దేవుళ్లు లెనిన్‌ను చూసి ఎంజాయ్ చేస్తారని అభిప్రాయపడ్డారు.
అందుకు క్షమించండి
చిత్ర హీరో అక్కినేని అఖిల్ మాట్లాడుతూ రెండేళ్లకు పైగా గ్యాప్ ఇచ్చానని, అందుకు ప్రేక్షకులు క్షమించాలన్నారు. లెనిన్ సినిమా ద్వారా కొత్తగా మీ ముందుకు వచ్చాను, ప్రతి ఒక్కరూ తమ ఇంటి వాడిగా చూసుకోవాలని ఈ సందర్భంగా కోరారు. జూలై 10వ తేదీ తర్వాత ఈ చిత్రం గురించి మాట్లాడుతానని వెల్లడించారు.


