పలమనేరు: పట్టణంలోని ఆర్టీసీ బస్టాండులోకి వెళుతున్న ఓ బస్సు ముందు టైర్ పక్కనే వెళుతున్న ఓ వృద్ధురాలి కాలుపై తొక్కించడంతో తీవ్రంగా గాయపడిన సంఘటన ఆదివారం స్థానిక ఏటీఎం వద్ద చోటు చేసుకుంది. చిత్తూరు నుంచి పలమనేరుకు వస్తున్న బస్సు బస్టాండులోకి వెళ్లే సమయంలో పక్కనే వెళుతున్న గంటావూరుకు చెందిన మునెమ్మ(65)ను కాలుపై బస్సు ముందు చక్రం ఢీకొనడంతో కాలు విరిగింది. స్థానికులు ఆమెను ఏరియా ఆస్పత్రికి తరలించారు.
అన్నదమ్ములకు తీవ్ర గాయాలు
వి.కోట: గుర్తు తెలియని కారు అతి వేగంగా వచ్చి టూవీలర్‌ను ఢీకొట్టడంతో అన్నదమ్ములకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం.. మండలంలోని కుంబార్లపల్లి గ్రామానికి చెందిన షబీర్ కుమారులు అమ్‌జాద్(27), అతిక్(24) చెరుకు జ్యూస్ వ్యాపారం చేసుకుని జీవించేవారు. వీరిద్దరూ రామకుప్పం మండలంలో చెరుకు జ్యూస్ వ్యాపారం ముగించుకుని ఆదివారం సాయంత్రం టూ వీలర్‌లో వీ.కోటకు బయల్దేరారు. అదే సమయంలో వీ.కోట నుంచి పెర్నంబట్ వైపు వెళ్తున్న గుర్తుతెలియని కారు అతి వేగంగా వచ్చి టూవీలర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అమ్‌జాద్, అతిక్ దాదాపు పది అడుగుల దూరం ఎగిరిపడి తీవ్రంగా గాయపడ్డారు. పోలిసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను పరిశీలించారు. అతిక్ పరిస్థితి విషమంగా ఉండడంతో 108 వాహనంలో కుప్పం పీఈఎస్‌కు తీసుకెళ్లారు. కేసు దర్యాప్తులో ఉంది.


