అవస్థల ‘రహదారి’ | - | Sakshi
Sakshi News home page

అవస్థల ‘రహదారి’

Mar 16 2026 7:46 AM | Updated on Mar 16 2026 7:46 AM

● నిర్వహణలోపంతో ముప్పుతిప్పలు ● ప్రణాళిక లేకుండా తవ్వకాలు దుకాణదారులు, ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ● కొండలు కరిగిపోతున్నా పూర్తికాని పనులు ● సర్వీసు రోడ్డు నుంచి వీధుల్లో వెళ్లేందుకు దారిలేక ఇక్కట్లు

నగరి : పుత్తూరు నుంచి తిరువళ్లూరు వరకు చేపట్టిన జాతీయ రహదారి ప్రయాణికులకు అవస్థల రహదారిగా మారింది. పలు ప్రాంతాల్లో నిర్వహణ లోపం చోటుచేసుకోవడంతో ప్రయాణికులు ముప్పుతిప్పలు పడుతున్నారు. రాష్ట్ర సరిహద్దు తమిళనాడులోని తిరుత్తణి నుంచి నగరి మీదుగా పుత్తూరు ఓవర్‌ బ్రిడ్జి వరకు 205 చైన్నె సెక్షన్‌ 716, 71 తిరుపతి–తిరుత్తణి నాలుగు వరుసల సరికొత్త జాతీయ రహదారి, రెండు వైపులా సర్వీసు రోడ్డు రూపుదిద్దుకుంటోంది. తిరుపతి నుంచి తిరువళ్లూరు వరకు రూ.864 కోట్ల వ్యయంతో రోడ్డు నిర్మించడానికి జాతీయ రహదారుల విభాగం అంచనా వేయగా అందులో తిరుత్తణి పుత్తూరు మధ్య పనులు ఆగిపోయాయి. రెండేళ్ల క్రితం ఈ పనులు మాజీ మంత్రి ఆర్కేరోజా చొరవతో ప్రారంభమైంది. 20.05 కిలోమీటర్ల మేర ఉన్న రోడ్డును విస్తరించే పనులు చేపట్టారు. ఈ మార్గంలో వీఎన్‌ఆర్‌ పేట జంక్షన్‌ వద్ద, వీకేఆర్‌ పురం వద్ద, కీళపట్టు ఆంజనేయ స్వామి ఆలయ సర్కిల్‌, ఓంశక్తి ఆలయ సర్కిల్‌, కొండచుట్టు మండపం సర్కిల్‌, ప్రభుత్వ ఆస్పత్రి సర్కిల్‌ వద్ద, కనంమిట్ట వద్ద, వేపగుంట క్రాస్‌ల వద్ద అండర్‌ పాస్‌ రోడ్లు, కుశస్థలినదిపై మేజర్‌ బ్రిడ్జి నిర్మిస్తున్నారు. దేశమ్మ దేవాలయ ఆర్చి సమీపం ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణ పనులు, ఉయ్యాల కాలువ, జీవీఆర్‌ కళ్యాణమండపం సమీపం, పరమేశ్వర మంగళం వద్ద మినీ బ్రిడ్జులు, 60 ప్రాంతాల్లో కల్వర్టులు ఈ పనుల్లో భాగంగా నిర్మిస్తున్నారు. ఈ పనులు ప్రారంభమై సుమారు 18 నెలలుగా జరుగుతోంది. అయితే ఈ పనులు ప్రణాళికాబద్ధంగా జరగక పోవడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు.

ప్రణాళిలేకుండా పనులు

జాతీయ రహదారి నిర్మాణ పనులు ప్రణాళికా రహితంగా సాగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లో కాలువల నిర్మాణం కోసం తవ్వకాలు చేపట్టి వాటిని పూర్తి చేయకుండా వదిలేయడంతో దుకాణదారులు, స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో తవ్వకాలు చేపట్టడం వల్ల తాగునీటి పైపులు పగిలిపోతుండటంతో పలుచోట్ల తాగునీటి సరఫరా నిలిచిపోతోంది. సర్వీసు రోడ్డు వేసే ప్రాంతంలో రోడ్డును ఆనుకొని అర అడుగు ఎత్తులో కాలువలు నిర్మిస్తున్న సిబ్బంది అవసరమైన ప్రాంతాల్లో ఎత్తు తగ్గించి దారి వసతి కల్పించాలి. అలాంటి సౌకర్యాలు కల్పించకపోవడంతో రోడ్డుకు ఆనుకొని నివసించే వారు, పక్క వీధుల్లోకి వెళ్లాల్సిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలతో రోడ్డు దాటలేని పరిస్థితి ఏర్పడడంతో ప్రజలే మట్టి పోసి గట్టులు కట్టి రోడ్డును దాటుతున్నారు. రోడ్డు పనుల్లో పలు ప్రాంతాల్లో సరైన సూచిక బోర్డులు లేకపోవడం, ఉన్న రోడ్లలో ఏ రోడ్డు చివరి వరకు ఉందో? ఏ రోడ్డు మధ్యలో ఆగిపోతుందో ? వాహనదారులకు తెలియని పరిస్థితి.

కొండలు కరిగిపోతున్నా పూర్తికాని పనులు

నిర్మాణ సమస్యలు ఓ వైపు ఉండగా జాతీయ రహదారి పేరిట నగరి నియోజకవర్గంలో ఉన్న కొండలు కరిగిపోతున్నాయి. తమిళనాడు నుంచి వచ్చిన వ్యాపారులు భారీ యంత్రాలతో కొండలను పిండి చేసేస్తున్నారు. కంకర, గ్రావెల్‌ విచ్చల విడిగా తరలించేస్తున్నారు. జాతీయ రహదారి ప్రామాణికాల మేరకు పనుల చేపడతామని చెబుతున్నా రెండేళ్లలో పనులన్నీ పూర్తి చేస్తామని ప్రకటించిన అధికారులు పనులు, ఇప్పటికి 18 నెలలు కావస్తున్నా ఇంకా జరగాల్సిన పనులు ఎక్కువగా ఉన్నాయి. నిర్మించాల్సిన ఓవర్‌ బ్రిడ్జిలు, అండర్‌పాస్‌లు చాలావరకు ఉన్నాయి.

ప్రమాదానికి గురైన లోనైన ట్రాక్టర్‌, బస్సు (ఫైల్‌)

వాహనాలు వెళ్లే సమయంలో రేగుతున్న మట్టి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement