ఇసుక జోరు.. తమ్ముళ్ల పోరు | - | Sakshi
Sakshi News home page

ఇసుక జోరు.. తమ్ముళ్ల పోరు

Mar 16 2026 7:46 AM | Updated on Mar 16 2026 7:46 AM

● చిత్తూరు కేంద్రంగా ఇసుక మాఫియా ● పూతలపట్టు వావిల్‌తోట, చిత్తూరు బీఎన్‌ఆర్‌పేట కేంద్రంగా వ్యాపారం ● మురకంబట్టు, మంచినీళ్ల కుంట, సీఎం కండ్రిగలో డంప్‌లు ● తమిళనాడుకు రవాణా.. నేతల్లో కుమ్ములాట ● తారస్థాయికి చేరిన ఇసుక యుద్ధం

భగ్గుమంటున్న సొంత పార్టీ నేతలు

తిరుపతి సాక్షి టాస్క్‌ఫోర్స్‌: చిత్తూరు కేంద్రంగా ఇసుక అడ్డగోలు వ్యాపారం హద్దులు దాటింది. మాఫియా డంప్‌లు చేసి దందాను దర్జాగా చేస్తోంది. అధికారుల కళ్ల ముందే కోట్ల రూపాయల దందాను కొనసాగిస్తోంది. ఈ అక్రమ వ్యాపారం రోజు రోజుకూ రెచ్చిపోతోంది. వావిల్‌తోట వయా తమిళనాడుకు పరుగులు పెడుతోంది. బీఎన్‌ఆర్‌పేట నుంచి మంచినీళ్లకుంట మీదుగా రయ్‌రయ్‌మంటోంది. ఇలా ప్రకృతి సంపదను కొల్లగొట్టి మాఫి యా కోట్లకు పడగలెత్తుతోంది. ఈక్రమంలో ఓ వర్గానికి చెందిన మాఫియా పోలీసుల చేతిలో లాక్‌ అవ్వడంతో.. తమ్ముళ్ల మధ్య వర్గపోరు మొదలైంది.

‘డంప్‌లు కాదు...ఇసుక కొండలే’...

పూతలపట్టు మండలం వావిల్‌తోట, చిత్తూరు బీఎన్‌ఆర్‌పేట ప్రాంతాలు ప్రస్తుతం ఇసుక దందాకు అడ్డాగా మారాయి. వావిల్‌తోట నుంచి ఇసుక తోడి మురకంబట్టులో దాచిపెడుతున్నారు. అలాగే మంచినీళ్ల కుంట, సీఎం కండ్రిగ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఇసుక డంప్‌లు కొండలను తలపిస్తున్నాయి. నదులు, వంక నుంచి తవ్విన ఇసుకను ముందుగా ఇక్కడే నిల్వ చేసి తర్వాత లారీల్లో లోడ్‌ చేసి అక్రమ వ్యాపారానికి ఆజ్యం పోస్తున్నారు.

సరిహద్దులు దాటుతున్న లారీలు

చిత్తూరు జిల్లా సరిహద్దు ప్రాంతం కావడంతో తమిళనాడుకు ఇసుక రవాణా సులభంగా మారింది. ముఖ్యంగా రాత్రి వేళల్లో వరుసగా లారీలు బయలుదేరి సరిహద్దు దాటుతున్నాయి. అక్కడ భారీ డిమాండ్‌ ఉండటంతో ఈ దందా మరింత ఊపందుకున్నట్లు తెలుస్తోంది. గుడిపాల మండల సరిహద్దులోని మంచినీళ్ల కుంట, సీఎం కండ్రిగ నుంచి మాత్రం పట్టపగలే బహిరంగంగా లారీల్లో రయ్‌రయ్‌మంటున్నాయి. అక్కడ లారీ ఇసుక రూ. 1.20 లక్ష నుంచి రూ.1.80 లక్షల వరకు విక్రయాలు జరుగుతున్నాయి. అక్కడ ఇసుకకు భారీగా డిమాండ్‌ పెరగడంతో అక్రమ లారీల సంఖ్యను పెంచారు. మురకంబట్టు నుంచి రోజువారీగా 15 లారీల నుంచి 20 లారీలు, మంచినీళ్ల కుంట, సీఎం కండ్రిగ నుంచి 30 నుంచి 40 లారీలు వెళుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ లెక్కన రూ.80 లక్షల నుంచి రూ. కోటి వరకు వ్యాపారం జరుగుతున్నట్లు వారు అంటున్నారు.

ఆ ఇద్దరే..దమ్ముంటే పట్టుకోండి చూద్దాం?

గుడిపాల మండలంలోని ఆ ఇద్దరు చోటా నేతలు ఇసుక అక్రమ వ్యాపారంలో ఆరితేరారు. తమిళనాడులో బ్రోకర్లను ఏర్పాటు చేసుకుని ఇసుక వ్యాపారాన్ని విస్తరిస్తున్నారు. మంచినీళ్ల కుంట, సీఎం కండ్రిగ డంప్‌ల నుంచి కమ్మతిమ్మపల్లి మీదుగా తమిళనాడుకు తన్నుకుపోతున్నారు. వీరి కంట్లో పడినవారంతా పాతాళానికి పడిపోతున్నారు. ఓ ప్రజాప్రతినిధి అండతో...అక్రమ వ్యాపారాన్ని రెండేళ్లుగా దర్జాగా నడిపిస్తున్నారని సొంత పార్టీ నేతలే విమర్శలు గుప్పిస్తున్నారు. వారి తమిళనాడు వ్యాపారానికి పోటీగా వచ్చేవారికి నరకం చూపిస్తున్నారని మండి పడుతున్నారు. దమ్ముంటే..వాళ్లను పట్టుకోండి చూద్దామని ఓ వర్గ తెలుగు తమ్ముళ్లు సవాల్‌ విసురుతున్నారు.

ఇసుక వ్యాపారంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఒకే పార్టీకి చెందిన నేతల మధ్యే విభేదాలు తారస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. ఈ పోటీ మరింత పెరిగితే పరిస్థితి ఎటు దారి తీస్తుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాలో పెరుగుతున్న ఇసుక అక్రమ రవాణాపై అధికారులు సమగ్రంగా దృష్టి పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. లేకపోతే చిత్తూరు జిల్లాలో ఇసుక దందా మరింత విస్తరించే ప్రమాదం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు. దీంతో పాటు తెలుగు తమ్ముళ్ల మధ్య గొడవకు దారి తీసే ప్రమాదం ఉందని వారు అంటున్నారు.

మురకంబట్టు... లారీలు మాత్రమే లాక్‌

గతనెల మురకంబట్టు నుంచి ఇసుక తరలిస్తు న్న ఓ లారీని చిత్తూరు తాలూకా పోలీసులు పట్టుకుని గుడిపాల పోలీసు స్టేషన్‌కు తరలించారు. అలాగే శుక్రవారం రాత్రి నిఘా పెట్టి రెండు ఇసుక లారీలను పట్టుకున్నారు. అరెస్ట్‌ కూడా చూపించారు. అయితే మంచినీళ్ల కుంట, సీఎం కండ్రిగ ప్రాంతాల నుంచి వెళ్లే లారీలకు మాత్రం పెద్దగా అడ్డంకులు లేకుండా రవాణా సాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో మురకంబట్టు తెలుగు తమ్ముళ్లు తీవ్ర అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘ఒక మార్గానికి బ్రేక్‌ మరో మార్గానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఎందుకు?’ అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement