హాస్టళ్లపై పకడ్బందీ ప్రణాళిక
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని 113 సంక్షేమ వసతి గృహాలను నెట్ జీరో ప్రాంగణంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో పలు శాఖల అధికారులతో వరుస సమీక్షలు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఉన్న 113 సంక్షేమ వసతి గృహాలను నెట్ జీరో ప్రాంగణంగా రూపాంతరం చేసే కార్యక్రమం అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి పకడ్బందీగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రతి వసతి గృహంలో కచ్చితంగా ఆర్‌వో ప్లాంట్, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యం, ఫ్యాన్, సోలార్ లైటింగ్, కిచెన్ గార్డెన్‌లు ఉండాలన్నారు. వసతి గృహాల్లో అవసరమైన సౌకర్యాలపై ఈనెల 6 న నివేదికలు అందజేయాలన్నారు. ప్రతి వసతి గృహానికి రూ.50 వేల చొప్పున నిధులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. సమావేశంలో సంక్షేమ శాఖల అధికారులు విక్రమ్‌కుమార్‌రెడ్డి, మూర్తి, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
జీఎస్టీ తప్పకుండా చెల్లించాలి
అభివృద్ధి పనులు జరుగుతున్న శాఖల్లో తప్పనిసరి గా జీఎస్టీ తప్పకుండా అమలు చేయాలని కలెక్టర్ అన్నారు. జీఎస్టీ అమలు తీరుపై సమీక్ష నిర్వహించా రు. జిల్లాలో రూ.100 కోట్లతో పలు అభివృద్ధి పను లు చేస్తున్నట్లు తెలిపారు. పీఎం–అజయ్ పథకంలో గృహ నిర్మాణ శాఖలో నిర్వహిస్తున్న అన్ని పనులను వెబ్ పోర్టల్ తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. ఆ పనులకు సంబంధించిన జీఎస్టీని జాప్యం చేయకుండా చెల్లించేలా చర్యలు చేపట్టాలన్నారు. నకిలీ పన్ను చెల్లింపుదారులను గుర్తించాలన్నారు. కుప్పం లో రూ.29 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు తెలిపారు. బకాయి లు ఉన్న చెల్లింపుదారుల పన్ను లావాదేవీలను నిషే ధించాలన్నారు. డీఆర్‌వో మోహన్ కుమార్, కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ రవీంద్రనాథ్‌రెడ్డి పాల్గొన్నారు.


