ఆరోగ్యశ్రీ అయోమయం | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్యశ్రీ అయోమయం

Feb 4 2026 7:19 AM | Updated on Feb 4 2026 7:19 AM

ఆరోగ్

ఆరోగ్యశ్రీ అయోమయం

నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు పేరుకుపోయిన బకాయిలు 5 శాతం మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకున్న ప్రభుత్వం ఏప్రిల్‌ నుంచి కొత్త యూనివర్సల్‌ హెల్త్‌ పాలసీ? ప్రశ్నార్థకంగా వైద్య మిత్రల భవిష్యత్తు

కాణిపాకం : ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రజల మనసుల్లోంచి పూర్తిగా తొలగించాలనే లక్ష్యంతో చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పథకం ప్రారంభమై 20 ఏళ్లవుతున్నా దానిని ప్రారంభించిన వైఎస్సార్‌ కొనసాగించిన ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేరే వినిపిస్తోంది. అందుకే ఈ పథకాన్నే ఎత్తేస్తే వారి గురించి ప్రజలు ఆలోచించరనే ఆలోచనతో ప్రభుత్వం ఈ చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆరోగ్యశ్రీ స్థానంలో త్వరలో యూనివర్సల్‌ హెల్త్‌ పాలసీని తీసుకురానుంది. అయితే ఇప్పటి వరకు నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకా యిలు, వైద్య మిత్ర ల ఉద్యోగుల విషయంలో ఎలాంటి స్పష్టత లేకుండా నూతన పాలసీకి వెళ్లడంపై విమర్శలు చెలరేగుతున్నాయి.

వైద్యమిత్రల ఆందోళన

జిల్లాలో ప్రస్తుతం 4,73,877 ఎన్టీఆర్‌ వైద్యసేవ కార్డులు, 74 నెట్‌వర్క్‌ ఆసుపత్రులు ఉన్నాయి. వీటిలో 4 ప్రభుత్వ ఆస్పత్రులు, 9 ప్రైవేటు ఆసుపత్రులు, 47 పీహెచ్‌సీలు, 7 సీహెచ్‌సీలు, 7 డెంటల్‌ హాస్పిటల్స్‌ ఉన్నాయి. ఇందులో 48 మంది వైద్యమిత్రలు గత 17 ఏళ్లుగా సేవలందిస్తున్నారు. ప్రభు త్వం మారిన ప్రతిసారి వైద్యమిత్రల ఉద్యోగ భద్ర త ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇప్పుడు కొత్త పాలసీ అమలుకు రెండు నెలలే సమయం ఉండటంతో, ప్రస్తు తం పనిచేస్తున్న సిబ్బందిలో సగానికి పైగా ఉద్యో గాలు కోల్పోతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో వైద్యమిత్రలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

బకాయిల భారం

జిల్లాలోని 47 ప్రైవేటు నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు భారీగా బకాయిలు పేరుకుపోయాయి. బ్యాంకు రుణాల ద్వారా బకాయిలు చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో నిధులు విడుదల కాలేదు. కొన్ని ఆసుపత్రులకు వారి బకాయిల్లో 5 నుంచి 10 శాతం మాత్రమే చెల్లించారని ఆరోపణలు ఉన్నాయి. ట్రస్టుకు రుణం ఇవ్వాలంటే ష్యూరిటీ కావాలంటూ బ్యాంకులు వెనుకడుగు వేస్తుండటంతో బకాయిల సమస్య మరింత క్లిష్టంగా మారింది.

పేదల జీవితాల్లో వెలుగు

ఒకప్పుడు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకోవాలంటే పేదలు తమ ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి. అలాంటి దుస్థితి నుంచి పేదలను బయటకు తీసుకొచ్చింది ఆరోగ్యశ్రీ పథకమే. 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా ఆరోగ్యశ్రీ కార్డు చేతిలో ఉంటే చాలు, ఖరీదైన కార్పొరేట్‌ ఆసుపత్రుల్లోనూ ఉచితంగా వైద్యం అందేలా మారింది. ఆయన మరణానంతరం వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం పథకాన్ని కొనసాగించినా అనేక పరిమితులతో అమలు చేశాయి. అయితే 2019లో ముఖ్యమంత్రి అయిన వైఎస్‌ జగన్‌మోహన్‌న్‌రెడ్డి ఆరోగ్యశ్రీని మరింత బలోపేతం చేశారు. చికిత్సల సంఖ్యను 1,800 నుంచి 3,255కు పెంచడమే కాకుండా, హైదరాబాద్‌, చైన్నె, బెంగళూరు వంటి నగరాల్లోనూ వైద్యం అందేలా విస్తరించారు.

ఆరోగ్యశ్రీ పేరును పూర్తిగా తొలగించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం యూనివర్సల్‌ హెల్త్‌ పాలసీని తీసుకొస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు జీఓ నెం.162 మాత్రమే విడుదల చేసి, పాలసీకి సంబంధించిన స్పష్టమైన మార్గదర్శకాలను బయటపెట్టలేదు. రూ.2 లక్షల వరకు ఆయుష్మాన్‌ భారత్‌ ద్వారా ఆపై మొత్తానికి ఇన్సూరెనన్స్‌ కంపెనీల ద్వారా చికిత్స అందించాలనే ప్రతిపాదనపై అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఇప్పటికే ఆసుపత్రుల సిబ్బంది వివరాలు రిజిస్టర్‌ చేశారు. అయితే తక్కువ ప్యాకేజీల కారణంగా ఇన్సూరెన్స్‌ కంపెనీలు ముందుకు రావడం లేదనే సమాచారం.

అనిశ్చితిలో ఆరోగ్య భద్రత

పేదలకు అండగా నిలిచిన ఆరోగ్యశ్రీ పథకాన్ని స్పష్టత లేకుండా తొలగించడం, ఉద్యోగులను అనిశ్చితిలో నెట్టడం, ఆసుపత్రుల బకాయిలను పట్టించుకోకపోవడం వల్ల ప్రభుత్వ నిర్ణయాలపై ప్రజల్లో అనుమానాలు పెరుగుతున్నాయి. కొత్త పాలసీ నిజంగా పేదలకు మేలు చేస్తుందా? లేక పేరు మార్చి బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నమా? అనే ప్రశ్నలు ఇప్పుడు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.

ఆరోగ్యశ్రీ అయోమయం 
1
1/1

ఆరోగ్యశ్రీ అయోమయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement